అలాంటి రోబోలతో కష్టమే!
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘రోబో’ సినిమాలో చిట్టి అన్న రోబో ఎంత విధ్వంసం సృష్టిస్తుందో గుర్తుంది కదా? అలాంటిది నిజంగా కూడా జరిగే రోజులు ఎంతో దూరంలో లేవట! ఇప్పుడు దాదాపుగా అన్ని పెద్ద కంపనీలూ తమ మ్యానుఫాక్చరింగ్ టీమ్‌లో రోబో మెషిన్‌లను వాడుతూనే వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిస్టమ్స్‌గా పలు ప్రోగ్రామింగ్ సంబంధిత కార్యకలాపాలకు కూడా రోబోలను వాడుతున్నారు.
కొద్దిరోజుల క్రితం ఫేస్‌బుక్ కూడా ఏఐ రోబోలను వాడడం మొదలుపెట్టగా, అది కాస్త తేడా కొట్టింది. మనిషి చెప్పినవి వింటూ వాటంతట అవిగా ఈ ఏఐ రోబోలు పనిచేస్తాయి. అయితే సొంతంగా కూడా నిర్ణయం తీసుకునే శక్తి ఉన్న ఈ రోబోలు కొత్తగా వాటికవే ఓ భాష కనిపెట్టేసుకొని, ఆ భాషలో మాట్లాడుకోవడం మొదలుపెట్టేశాయి. ఆ భాష మనిషికి అర్థం కాకుండా, వాటికి మాత్రమే అర్థమయ్యే విధంగా ఉందట.
వెంటనే ఇదేదో ప్రమాదంగా కనిపెట్టిన ఫేస్‌బుక్ టెక్నికల్ టీమ్ వెంటనే ఆ సిస్టమ్స్‌ను షట్ డౌన్ చేసి, ప్రోగ్రామ్‌ను మార్చేసింది. ఇలాంటివి భవిష్యత్‌లో ఇంకెన్నో జరుగుతాయని, ఏఐ రోబోలన్నవి మానవాళికే పెద్ద ప్రమాదమని కొందరు సైంటిస్ట్‌లు చెబుతున్నారు. టెస్లా సీయీవో ఎలన్ మస్క్ మొదట్నుంచీ ఏఐ రోబోలను వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. భవిష్యత్ తరానికి వ్యాప్తి చెందనున్న పెద్ద ప్రమాదాల్లో ఇదొకటని ఆయన చెబుతున్నారు.