‘ఎక్సయిటింగ్’ లీడర్!
విశ్లేషణం
బిల్‌క్లింటన్... ప్రజానాయకుడు కావాలని పదహారేళ్ల వయసులోనే నిర్ణయించుకుని, కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్‌లనుంచి ప్రేరణ పొంది, ప్రజాజీవితంలోకి ప్రవేశించి, రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు. హిల్లరీని ప్రేమించి, పెళ్లాడిన ప్రేమికుడు. క్లింటన్ ఫౌండేషన్ స్థాపించి సేవ చేస్తున్న మానవతావాది. మరి మోనికా లూయిన్‌స్కీ విషయంలో తప్పుటడుగు ఎందుకు వేశాడు? అధ్యక్షుడిగా ఉండి క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటానికి ఆయన వ్యక్తిత్వమే కారణమా?
చాలామంది నాయకులు తమ ఉపన్యాసం తయారులో చూపించే శ్రద్ధ.. బాడీలాంగ్వేజ్ విషయంలో చూపించరు. కానీ నిజానికి ఎంత బాగా మాట్లాడాం, ఎంతమందిని ఆకట్టుకున్నామనేదానిలో భాష పాత్ర ఏడు శాతం మాత్రమే. మిగతా 93 శాతం బాడీ లాంగ్వేజ్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయం క్లింటన్‌కు బాగా తెలుసు. ఉపన్యాసకళలో ఆయన నిష్ణాతుడు. అందుకే మాట్లాడేటప్పుడు ఆయన నిల్చునే తీరు, కదలికల్లో ఈజ్ కనిపిస్తుంది. తరచుగా చిరునవ్వులు చిందిస్తాడు. మాట్లాడటాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ ఆయనో విజువల్ పర్సనాలిటీ అని చెప్తాయి. మాట్లాడేటప్పుడు చేతులు, వేళ్లు రిలాక్స్‌డ్‌గా ఉంటాయి. ఆ రిలాక్సేషన్ మొహంలో కూడా కనిపిస్తుంది. అలాగే హస్తాన్ని పైవైపుకు ఉంచి చూపుడువేలును చూపిస్తారు. ఇది ఆయన ఓపెన్‌గా, సపోర్టివ్‌గా ఉంటారని, తననుంచి ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతారని వెల్లడిస్తుంది. చేతులు ఓపెన్‌గా ఉండటమనేది ఆయన్ను సులువుగా చేరవచ్చనే భావనను కలిగిస్తుంది.
మాటలు తెలిసిన నేత...
ఉపన్యాసాన్ని ఎలా మొదలెట్టాలో, ఎక్కడ ఆపాలో క్లింటన్‌కి బాగా తెలుసు. ప్రజల మనసుల్లోకి చేర్చాలనుకున్న విషయం గురించి మాట్లాడేటప్పుడు పదాలను నిదానంగా, స్పష్టంగా పలుకుతారు. ఆ విషయాన్ని ఒకటికి నాలుగుసార్లు చెప్పి ప్రజల మనసుల్లో నాటుకుపోయేలా చేస్తారు. ‘‘మనందరం కలిస్తే మరింత సాధించగలం. మనమధ్య విభేదాలు నిజమే, కానీ మనందరిలోనున్న మానవత్వం మరింత నిజం’’ అంటూ ‘నేను’ అనే పదం కన్నా ‘మనం’ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించడం ద్వారా తానూ అందరిలో ఒకడినే అన్న భావనను కలిగిస్తారు. ఎంత గంభీరమైన విషయం మాట్లాడుతున్నా కాసిన్ని జోకులు వేసి బ్యాలెన్స్ చేస్తారు. జర్నలిస్టులా అందరికీ అర్థమయ్యేలా విషయాన్ని వివరిస్తారు. ప్రశ్నలు వేసి, తానే సమాధానం చెప్పి, అదే అందరికీ కావాల్సిందని ఒప్పిస్తారు. వీటన్నింటిలోనూ ఆయన శరీర కదలికలకు, మాటలకు మధ్య లయ కనిపిస్తుంది. ఇవన్నీ కలిసి ఆయన మాట్లాడేది నిజమేనన్న విశ్వాసాన్ని కలుగజేస్తాయి.
అధికారంకన్నా లక్ష్యం ముఖ్యం
క్లింటన్ ఆత్మవిశ్వాసం, సాధించాలనే తపన, కరిష్మా ఉన్న నాయకుడు. తన అప్పియరెన్స్‌తో, మాటలతో ప్రజలను మంత్రముగ్ధులను చేస్తారాయన. చుట్టూ ఉన్నవారిని నిరంతరం గమనిస్తుంటారు. వారి మనసులో ఏముందో ఇట్టే పసిగట్టి, తను చెప్పాలనుకున్న విషయాన్ని నొప్పించకుండా చెప్పేస్తారు. ఆయనకు తన అధికారంకన్నా తానేమి సాధించాననేది ముఖ్యం. అలాగని లక్ష్యసాధనలో మొండిగా వ్యవహరించరు. అందరినీ కలుపుకుపోతారు. తనకు వచ్చిన సమాచారం, ఫీడ్‌బ్యాక్ ఆధారంగా లక్ష్యసాధన మార్గాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటారు. సాధించిన విజయాల నుంచి ప్రేరణ పొందుతారు. నిర్ణయాలు తీసుకునేప్పుడు తాను నిర్దేశించుకున్న ప్రమాణాలనే ప్రామాణికంగా తీసుకుంటారు.
ఎక్సయిట్‌మెంట్ కోసం ఆరాటం
క్లింటన్ బహిర్ముఖుడు (ఎక్స్‌ట్రావర్ట్). కలివిడిగా మాట్లాడతారు. సెంటర్ ఆఫ్ అటెన్షన్‌గా ఉండాలనుకుంటారు. అందుకోసం ఎదుటివారు ఇష్టపడేలా మాట్లాడతారు. ఈ క్షణంలో జీవించేందుకు ఇష్టపడతారు. ప్రతి క్షణాన్నీ ఆనందించాలనుకుంటారు. ఎప్పటికప్పుడు కొత్త ఆనందాలు, ఎక్సయిట్‌మెంట్స్ పొందాలనుకుంటారు. ఆ క్రమంలో అత్యుత్సాహంగా (ఇంపల్సివ్) వ్యవహరిస్తారు. తాను చేస్తున్నది ఓ సాహసమనుకుని, దాన్నుంచి ఆనందాన్ని పొందుతారు. ఈ ఆనందాన్ని, ఎక్సయిట్‌మెంట్‌ను పొందేందుకు అవసరమైతే సంప్రదాయాలను, అంతరాత్మను పక్కన పెట్టేయడానికి కూడా వెనుకాడరు. అలాంటి సాహసాల్లో ఒకటే మోనికా లూయిన్‌స్కీతో ప్రణయకలాపం. ఈ విషయంపై ఆయన బహిరంగ క్షమాపణ చెప్పినా... అది ఆయన జీవితంలో ఓ మచ్చగానే మిగిలిపోయింది.
- విశేష్, సైకాలజిస్ట్