
సిజేరియన్ అయిన అమ్మలకు
సిజేరియన్ ఆపరేషన్‌తో బిడ్డను కన్న కొత్త అమ్మలకు పేగుల కదలికలకు సంబంధించిన కొన్ని సమస్యలు చాలా సాధారణమట.
చ్యూయింగ్ గమ్...
సాఫీ విరేచనం!
సిజేరియన్ ఆపరేషన్‌తో బిడ్డను కన్న కొత్త అమ్మలకు పేగుల కదలికలకు సంబంధించిన కొన్ని సమస్యలు చాలా సాధారణమట. అయితే తమ సమస్యను పరిష్కరించుకోవడం చాలా తేలిక అంటున్నారు శాస్త్రజ్ఞులు. వాళ్లు... జస్ట్... రోజుకు మూడుసార్లు చ్యూయింగ్ గమ్ నమిలితే పేగుల కదలికలు గణనీయంగా మెరుగుపడతాయంటున్నారు. సిజేరియన్ ద్వారా బిడ్డను కన్న కొత్త మాతృమూర్తులకు పేగు కదలికలలో ఇబ్బందులతో పాటు కడుపునొప్పి, వికారం, కింది నుంచి గ్యాస్ పోవడం, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. సిజేరియన్ ప్రసవం జరిగిన ఐదుగురిలో ఒకరు పైన పేర్కొన్న సమస్యలతో బాధపడటం మామూలే. ఇది కొందరిలో కొన్ని దుష్ప్రభావాలకు దారితీసి... ఆ తర్వాత హాస్పిటల్‌లో చేర్చాల్సిన పరిస్థితిని కూడా తెచ్చే ప్రమాదం ఉంది. అయితే కేవలం చ్యూయింగ్‌గమ్ నమలడం ద్వారానే ఆ సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుందంటున్నారు ఫిలడెల్ఫియాకు చెందిన పరిశోధకులు.
చ్యూయింగ్ గమ్ వేసుకున్న తర్వాత అరగంట దాన్ని నములుతూ ఉండాలని వారు సూచిస్తున్నారు. ఇలా చేసే సమయంలో శరీరానికి రెండు రకాలుగా స్టిములేషన్స్ కలుగుతాయట. మొదటిది ఆ వ్యక్తి ఏదో తింటున్నందున దానికి తగినట్లుగా పేగుల కదలికలు జరిగేలా అంతర్గత అవయవాలు స్పందిస్తాయి. ఇక రెండోది చ్యూయింగ్ గమ్ నమిలే సమయంలో అంతసేపూ లాలాజలం స్రవిస్తుంది. అది లోపలికి స్రవించాక పేగులు దానికి తగినట్లుగా కదలికలు సంతరించుకుంటాయని పేర్కొంటున్నారు ఈ పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ బెర్ఘెల్లా. అయితే రోజుకు మూడుసార్లు... ప్రతిసారీ అరగంటకు మించనివ్వవద్దని కూడా సూచిస్తున్నారు. మరింత ఎక్కువగా చ్యూయింగ్‌గమ్ నమలడం వల్ల అందులోని విరేచనకారక ఔషధగుణం ఉన్న పదార్థాల వల్ల కొన్నిసార్లు విరేచనాలు అయ్యే అవకాశం కూడా ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.