కృంగిపోవడం ఒక రసాయనిక చర్య | depression is the chemical reaction | Sakshi
Sakshi News home page

కృంగిపోవడం ఒక రసాయనిక చర్య

Published Sun, Jan 26 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

కృంగిపోవడం ఒక రసాయనిక చర్య

కృంగిపోవడం ఒక రసాయనిక చర్య

 వివేకం
  కృంగిపోవడం వల్ల కావాలనుకున్నవన్నీ మీ నుంచి జారిపోతాయి. మీరు ఉల్లాసంగా ఉండాలనుకున్నా ఉండలేరు. ఇంకేదో గందరగోళం లోపల జరుగుతూ ఉంటుంది. మీ అంచనాలు నిజం కాకపోవటమే కృంగిపోవటానికి కారణం. ఈ కృంగిపోవడం అనేది ఒక రసాయనిక చర్య. మీరు ఒక స్పష్టమైన మానసిక అవగాహనా స్థాయితో, జాగరూకతతో ఉంటే ఈ రసాయనికత దానంతటదే కుదుటబడుతుంది. కానీ, ప్రస్తుతం అటువంటి జాగరూకత మీకు లేదు.
 
 స్టాక్ మార్కెట్ కూలిపోతే ఎంతోమంది కృంగిపోతారు. ప్రతిరోజూ గ్రాఫ్‌పై గీతలు పైకి పోవడం చూస్తుంటే వాళ్ల స్థితి కూడా పైకి వెళుతుంది. కానీ, ఈ రోజు గ్రాఫ్ కిందకి పడిపోవడం వారు చూశారు, అంతే! వారి మానసిక స్థితి కూడా పడిపోయింది. వారు ఏమి జరుగుతుందని అంచనా వేసుకున్నారో, అది జరగలేదు. అదే వారి మానసిక స్థితికి కారణం.
 
 కృంగిపోవడం అనే పదాన్ని మీ మానసిక స్థితిని గురించి చెప్పటానికి వాడతారు. మీ మనసును గురించి కాదు. మానసిక ప్రక్రియ తగ్గిపోలేదు. మనసు ఉన్న స్థితి మాత్రమే కృంగిపోయింది. అనేక మంది వ్యక్తులలో, ముఖ్యంగా సంపన్న వర్గాలకు చెందిన వ్యక్తులలో ఉన్న విషాదం ఏమిటో తెలుసా? వాళ్లకు అన్నీ ఉంటాయి, కానీ ఏదీ ఉండదు. కృంగిపోవటం అంటే, ఎక్కడో ఒక విధమైన నిరాశాభావం ప్రవేశించిందని! ఒక గ్రామానికి వెళితే... ఆ గ్రామంలోని వారు అతి పేదరికంలో ఉండవచ్చు కానీ వాళ్ల ముఖాలు మాత్రం ఉల్లాసవంతంగా కనిపిస్తాయి. ఎందుకంటే, వాళ్లలో ‘రేపు ఇంతకంటే బాగా ఉండబోతోంది’ అనే ఆశ ఉంది. సంపన్న వర్గాలవారిలో ఈ ఆశ అనేది లేకుండా పోయింది. కృంగిపోవటం ఆరంభమైంది. ఎందుకంటే, భౌతికంగా వారికి అన్నీ అమరినాయి. ఆహారం, నివాసం అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా ఎక్కడో ఏదో లోటు ఉంది. అదేమిటో వాళ్లకు కూడా తెలియదు.
 
 ఒక పేదవాడు ‘రేపు, నేను ఒక జత చెప్పులు తెచ్చుకోగలిగితే చాలు, అంతా బాగుంటుంది’ అనుకుంటాడు. అతనికి చెప్పుల జత లభిస్తే ముఖమంతా సంతోషంతో అతనొక మహారాజులాగా నడుస్తాడు. ఎందుకంటే అతని బాహ్య జీవితంలో అన్నీ ఇంకా సరిగా అమరకపోయినా, ఒక ఆశ అనేది ఉంది. సంపన్న వర్గాలలో బాహ్య జీవితంలో అన్నీ అమరినాయి. అంతరంగం మాత్రం సరిగా అమరలేదు. అందుకనే అక్కడ నిరాశ, కృంగిపోవటం జరుగుతోంది. మనం ముందుగా మన అంతరంగాన్ని సరిచేసుకోవాలి. తర్వాతనే బాహ్య పరిస్థితి గురించి శ్రమించాలి. అప్పుడు ప్రపంచం సుందరమౌతుంది.
 
 ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఇదే. అంతరంగంలో మీరు ఎవరో, దానిని మీరు తీర్చిదిద్దుకోవటం. మీ జీవితంలోని భౌతికతను నిలబెట్టుకోవటం కాదు. అలా అంతరంగాన్ని తీర్చిదిద్దుకోలేకపోతే మాత్రం, మీకు అన్నీ ఉంటాయి. మీకు ఏదీ ఉండదు.
 
 సమస్య - పరిష్కారం
 గతంలో నేను నా తండ్రి ద్వారా చాలా వేధింపులకు లోనైనాను. నా పిల్లలకు అలానే చేస్తున్నానని అనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిని ఎలా తప్పించుకోవాలి?
 - డి.వెంకటేశ్వర్లు, కాకినాడ
 
 నా చిన్నప్పుడు మా నాన్న నాకు ఏం చేశాడో తెలుసా అంటూ తామున్న పరిస్థితిని చాలామంది సమర్థించుకో జూస్తారు. మీ తండ్రి ఒక మూర్ఖుడైనప్పుడు, అది తెలుసుకునే సామర్థ్యం మీకున్నప్పుడు, మీరు మరింత వివేకంగా బతకాలి కదా! మీరు వేధింపులకు గురయ్యుంటే, జీవితంలో మీరు అవాంఛనీయ పరిస్థితులని ఎదుర్కొని ఉంటే, ఇంకెవరినీ ఇలాంటి పరిస్థితులకు గురిచేయనంత వివేకాన్ని కలిగి ఉండాలి. వివేకం అంటే అదే కదా! జరిగినవి ఎంత బాధగా ఉన్నా, మన మెదడు పదునుగా ఉంటే, వీటిని అధిగమించడం మన చేతిలో పని. మనకేదైనా బాధ కలిగితే, మనకు రావాల్సిన మొదటి ఆలోచన ఏమిటి? నాక్కానీ, మరెవరికీ కానీ మళ్లీ ఇలాంటిది జరగకూడదు అని అనుకోవాలి. నేను మీ చెడు అనుభవాలను తక్కువ చేసి చూపాలని ప్రయత్నించడం లేదు. దాని వెనుక బాధ ఉందని నాకూ తెలుసు. కానీ మనం ఈ బాధనే కొనసాగించాలా? లేక మన జీవిత అనుభవాన్నుంచి వివేకాన్ని పోగు చేయాలనుకుంటున్నామా? ఇది ప్రతి మనిషికీ ఉన్న ఛాయిస్.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement