
నేను మీకు తెలుసా!
పట్టుకోండి చూద్దాం
ఆ చిన్న కాలనీ ఒకప్పుడు ప్రశాంతతకు, పచ్చదనానికి మారుపేరులా ఉండేది. అయితే కాలంతో పాటు ఆ కాలనీలోనూ మార్పులు వచ్చాయి. ప్రశాంతత కరువైంది. పచ్చదనం తరిగిపోయింది. సరిగ్గా నెల రోజుల నుంచి ఆ కాలనీలో ఏదో ఒక ఇంట్లో దొంగతనం జరుగుతుంది. చిత్రమైన విషయం ఏమిటంటే, దొంగతనం జరిగిన ఇంట్లో దొంగోడు ఏదో ఒక వస్తువును వదిలి వెళుతున్నాడు. అంటే... ఒక రకంగా దీన్ని ‘క్లూ’ అనుకోవచ్చు. దీంతో పాటు ఒక తెల్లకాగితంపై...
‘నేను మీకు తెలుసు. పట్టుకోండి చూద్దాం.
ఇట్లు
సుపరిచితుడు’ అని ప్రింట్ చేసిన అక్షరాలు కనిపిస్తాయి.
ఒక ఇంట్లో కీ చైన్.
ఒక ఇంట్లో బెల్ట్.
ఒక ఇంట్లో పెన్.
ఒక ఇంట్లో... పాత గొడుగు... ఏ ఇంట్లో దొంగతనం జరిగినా ఆ ఇంట్లో ఒక వస్తువును వదిలి వెళుతున్నాడు.
దొంగోడిది విపరీత మనస్తత్వం అనే విషయాన్ని పోలీసులు అర్థం చేసుకున్నారు.
దొంగల్లో రకరకాలు ఉంటారు.
ఉన్నదంటూ ఏమీ లేదు... అని దొంగతనం చేసేవాడు ఒకడు.
ఉన్నది కాస్తా సరిపోవడం లేదు... అని దొంగతనం చేసేవాడు ఒకడు.
రాత్రికి రాత్రి కోటీశ్వరుడై పోవాలని దొంగతనం చేసేవాడు ఒకడు.
ఇవి కాకుండా...
కేవలం ‘ఎగ్జైట్‌మెంట్’ కోసం చేసేవాడు ఒకడు. దొంగ చివరి కేటగిరికి చెందినవాడు అనే విషయం తెలియకనే తెలుస్తుంది. ఎందుకంటే... మిగిలిన దొంగలెవరూ...
‘క్లూ’ వదిలి ‘నన్ను పట్టుకోండి చూద్దాం’ అని సవాలు విసురరు.
దొంగోడు పరాయి రాష్ట్రం వాడు కాదు... పక్కాగా ఈ కాలనీ వాడేననేది ఒక అనుమానం. ఎందుకంటే... ‘నేను మీ అందరికీ తెలిసిన వాడినే’ అనే అచ్చు అక్షరాలు దొంగతనం జరిగిన ఇంట్లో కనిపించాయి.
‘క్లూ’లు అన్నింటినీ ఒక దగ్గర పెట్టుకొని పోలీసులు పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. కానీ ఫలితం కనిపించలేదు.
ఈ దొంగతనాలు చేస్తున్నవాడు వృత్తి దొంగ కాదు. ఇతరులను ఉడికించడానికి, సవాలు విసరడానికి చేస్తున్న పని. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్లు ఎవరైనా కాలనీలో ఉన్నారా? అని పోలీసులు ఎంక్వ్యేరీ చేశారు. దీనివల్ల కూడా ఫలితం కనిపించలేదు.
తాజాగా ఒక సీనియర్ ఇంజనీర్ ఇంట్లో దొంగతనం జరిగింది.
ఈ సారి మాత్రం దొంగ ఎలాంటి వస్తువులు వదిలి వెళ్లలేదు.
గోడపై మాత్రం... వంకర టింకరగా ఇలా రాశాడు.
‘12’
1..................2
3..................3
6...................2
11.................1
దీంతో పాటు టేబుల్ క్యాలెండర్‌లో ఉన్న జనవరి అనే ఇంగ్లీష్ అక్షరాల్లో ‘అ’ను రౌండప్ చేశాడు.
పది నిమిషాలు ఆలోచించిన తరువాత ఇన్‌స్పెక్టర్ నరసింహకు... ఏదో తట్టింది. ఇక్కడ ‘క్లూ’ ఏమిటో కాదు... గోడ మీది రాత, టేబుల్ క్యాలెండర్. వీటి సహాయంతో దొంగోడి పేరు ‘అరుణ్’ అనే విషయాన్ని కనిపెట్టాడు.
‘‘అరుణ్ అనే పేరుతో ఈ కాలనీలో ఎంతమంది ఉన్నారు అనేది ఎంక్వ్యేరీ చేయండి’’ అని సిబ్బందిని ఆదేశించాడు ఇన్‌స్పెక్టర్ నరసింహ. కాలనీ మొత్తంలో 8 మంది అరుణ్‌లు ఉన్నారు. అందులో ముగ్గురు చిన్న పిల్లలు. నలుగురు విదేశాల్లో ఉన్నారు.
ఇక ఒక్కడు మాత్రం... కాలనీలో అందరికీ సుపరిచితుడు. ఈ అరుణ్... కాలనీలో సంఘసేవ పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాడు. అందుకే... ఈ అరుణ్ అందరికీ తెలుసు. పోలీసులు అరుణ్‌ని అరెస్ట్ చేసి నిజాలు కక్కించారు.
అరుణ్ ‘ఎగ్జైట్‌మెంట్’ కోసం దొంగతనాలు చేశాడా? ‘అవసరం’ కోసం చేశాడా? అనేది వేరే విషయం.
ఇంతకీ... గోడ మీద ఉన్న అంకెలు, క్యాలెండర్ ఆధారంగా దొంగోడి పేరు ‘అరుణ్’ అనే విషయాన్ని ఇన్‌స్పెక్టర్ ఎలా కనిపెట్టాడు?
Ans :-
12-మొత్తం నెలలు.
1-2 అంటే... మొదటి నెల january లో ‘2’వ అక్షరం a
3-3 అంటే... మూడో నెల march లో ‘3’వ అక్షరం r
6-2... ఆరో నెల june లో ‘2’వ అక్షరం u
11-1... పదకొండో నెల november లో ‘1’వ అక్షరం n