ఒకరోజు.. రాత్రి.. పార్టీ జరుగుతోంది... ‘‘తమ్ముడూ.. నిజంగానే దయ్యాలు లేవంటావా?’’ అన్నాడు ఆ ఊరి సర్పంచ్ మనసులో కాస్త బెరుకుతోనే. ‘‘దయ్యాల్లేవ్.. గియ్యాల్లేవ్ సర్పంచ్ సాబ్..’’ అని అంటూ‘‘ఏమ్‌రా అజయ్..ఉన్నయా?’’ అడిగాడు పక్కనే ఉన్న తన కజిన్‌ను. వాడు అదోరకంగా నవ్వాడు. ‘‘మరి అంతకుముందు గీ పొలం కొంటామని వచ్చిన ఆ ఇద్దరు ఎట్లా చనిపోయినట్టు?’’ డౌట్ సర్పంచ్‌కి. ‘‘ఏముందీ.. బ్రెయిన్ హ్యామరేజ్‌తో చనిపోయిన పర్సన్‌కు అంతకుముందే క్లాట్స్ ఏవో ఉండి ఉంటాయి. యాక్సిడెంట్‌లో పోయిన అతని గురించి చెప్పేదేముంది? తాగి బండి నడుపుతున్నాడు..ఎదురుగా వస్తున్న లారీకి గుద్దుకున్నాడు. ఇక్కడ దయ్యమెక్కడినుంచి వచ్చింది సర్పంచ్ సాబ్?’’ వెటకారంగా రాహుల్. గ్లాస్‌ను పెదవుల దగ్గర పెట్టుకున్న అజయ్.. రాహుల్‌నే చూస్తున్నాడు తదేకంగా. ‘‘ఏమైతేంది.. పొలం కొనుక్కున్నరు. మీరు మంచిగా పండిస్తే మా ఊరోళ్లకు కూడా మస్తు ధైర్యమొస్తది అన్నిరకాలుగా’’ అన్నాడు సర్పంచ్ చికెన్ ముక్కను నములుతూ!
మళ్లీ తన కజిన్ భుజమ్మీద చేయివేసి అతనిని చూపిస్తూ ‘‘ఇగో సర్పంచ్ సాబ్.. వీడు నా చిన్నమ్మ కొడుకు. రెండురోజుల కిందట అమెరికా నుంచి వచ్చిండు. నాకు హెల్ప్ చేయడానికే. నాతోనే ఉంటడు.ఇద్దరం కలిసి పొలం దున్ని చూపిస్తం. చాలెంజ్’’ అని సర్పంచ్‌తో సవాల్ చేసి.. మళ్లీ కజిన్ వైపు తిరిగి ‘‘ఏమంటావ్‌రా..అజయ్? ’’ అన్నాడు అతని భుజాన్ని గట్టిగా నొక్కుతూ.‘‘అంతే అన్నా.. చాలెంజ్. దున్ని చూపించుడే’’ అని అన్నకు జవాబిచ్చి సర్పంచ్ వైపు తిరిగి ‘‘ సర్.. వంచిన నడుము ఎత్తనీయకుండా పొలంల పనిచేయిస్తా మా అన్నతో. చాలెంజ్ ఏందో చెప్పుండ్రీ’’ అన్నాడు అజయ్‌నవ్వుతూ!ఆ చాలెంజ్‌లో ధీమా కన్నా అతని మాటలతో భయమే కలిగింది సర్పంచ్‌కి. మందు ఎక్కువైనట్టుంది అంటూ సమాధానపడ్డాడు. ఆ రాత్రి గడిచింది.
రాహుల్... బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివాడు. పేరున్న ఎమ్‌ఎన్‌సీలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేస్తూ ఓ స్టార్టప్ కంపెనీకి కూడా ప్లాన్‌వేస్తూండగా రైతుల ఆత్మహత్యలకు చలించిపోయి అగ్రికల్చర్ చేయాలని నిశ్చయించుకున్నాడు. మెదక్ జిల్లాలోని ఒక ఊళ్లో పొలం కూడా కొనేశాడు. తన బిజినెస్ మైండ్‌తో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులకు ప్రేరణనివ్వాలని ఆశపడ్తున్నాడు. అమ్మా, నాన్నా, చివరకు జీవితమంతా సేద్యంతోనే గడిపిన తాత చెప్పినా మనసు మార్చుకోలేదు అతను. గతం..రాహుల్ కొనుక్కున్న పొలం మల్లయ్యది. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ఒమన్‌లో, చిన్న కొడుకు భివండిలో ఉంటారు. భార్యతో ఊళ్లో ఉండేవాడు మల్లయ్య. ఉన్న అయిదు ఎకరాల్లో మూడుఎకరాలు కౌలుకి ఇచ్చి, మిగిలిన రెండు ఎకరాల్లోనే పాక లాంటిది వేసుకొని ఆలుమగలిద్దరూ సాగు చేసుకునేవారు. వరసగా వానలు లేక.. పొలంలో వేసిన బోరులో నీళ్లు పడక.. పంట పండక.. అప్పులపాలయ్యాడు. ఆ బెంగతోనే ఓ రోజు రాత్రి గుండె ఆగి చనిపోయాడు. పెద్ద కొడుకు రానేలేదు. చిన్నకొడుకే వచ్చి కర్మకాండ తంతు నిర్వహించి వెళ్లిపోయాడు. మల్లయ్య భార్య ఒక్కతే ఉండడం మొదలుపెట్టింది. ఊళ్లో వాళ్లంతా ఆమెను చూసి జాలిపడేవారు. భర్త చనిపోయిన షాక్ నుంచి తేరుకోక.. భర్త ఉన్నాడనే భ్రమలోనే ఆమె బతుకుతోందని! రోజూ ఇద్దరికి సరిపోయే భోజనం వండేది. గుడిసెలో తనతోపాటు ఇంకో వ్యక్తి ఉన్నట్లే ప్రవర్తించేది. కొన్నాళ్లకు ఊళ్లో వాళ్లకు అనుమానం వచ్చింది..మల్లయ్య దయ్యమయ్యాడా ఏంటీ అని! మల్లయ్య పొలంవైపుగా వెళ్లిన కొంతమంది.. గుడిసెలో మగ గొంతుతో మాటలు వినిపిస్తున్నాయంటూ ఆ అనుమానాన్ని రూఢీ చేసేసుకున్నారు.
ఆ ఊరి సర్పంచ్ మల్లయ్య పెద్ద కొడుక్కి ఫోన్ చేసి సంగతి చెప్పాడు. ఒమన్ నుంచి వచ్చాడు పెద్దోడు. భివండి నుంచి తమ్ముడినీ పిలిపించాడు. తల్లిని ఆ ఊళ్లోనే ఉన్న ఆశ్రమంలో చేర్పించి ఉన్న పొలం అమ్మేసుకొని చెరిసగం పంచుకొని వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారు. తల్లిని ఆశ్రమంలో చేర్పించారు కూడా. ఆ పొలం కొందామని బేరం కుదుర్చుకున్నాడు అదే ఊళ్లోని ఓ మోతుబరి. డబ్బులిచ్చే సమయానికి హఠాత్తుగా చనిపోయాడు. ఖంగుతిన్నారు అన్నదమ్ములిద్దరూ. మరో పదిరోజులకు ఇంకో వ్యక్తి ముందుకొచ్చాడు కొనడానికి. తెల్లవారి డబ్బులు తెస్తూ అతనూ చనిపోయాడు యాక్సిడెంట్‌లో.దీంతో ఊళ్లో వాళ్లకు మల్లయ్య నిజంగానే దయ్యమయ్యాడనే రుజువు దొరికినట్టయింది. కాని అన్నదమ్ములిద్దరూ నమ్మలేదు. పొలం అమ్మే బాధ్యతను తమ చిన్నాన్నకు అప్పగించి పెద్దోడు ఒమన్‌కు, చిన్నోడు భివండికి బయలుదేరారు. తర్వాత చాలా రోజులు ఆ పొలం అలాగే ఉంది. మల్లయ్య ఉన్నప్పుడు మూడు ఎకరాలు తీసుకున్న కౌలు రైతు కూడా భయపడి కౌలు చేయడం మానేశాడు. ఈ వ్యవహారమంతా వ్యవసాయం చేస్తున్న స్నేహితుల ద్వారా తెలుసుకున్న రాహుల్ చాలా చవకకు ఆ పొలాన్ని కొనేశాడు. ఆ సందర్భంగానే సర్పంచ్‌కి ఇచ్చిన పార్టీ అది. ప్రెజెండ్ డే... ఉదయం... తాత్కాలికంగా సర్పంచ్ ఇంట్లోనే అద్దెకు ఉంటున్న రాహుల్ నిద్ర లేచాడు. సెల్ ఫోన్‌లో టైమ్ చూశాడు. ఎనిమిది అయింది. ‘‘అమ్మో’’ అంటూ దిగ్గున లేచాడు. పక్కనున్న మంచం మీద అజయ్ కనిపించలేదు. బాత్రూమ్‌కి వెళ్లాడేమో అనుకొని ఓనరకి, టెనెంట్‌కు కామన్‌గా ఉన్న వసారాలోకి వచ్చాడు. పేపర్ చదువుతూ కనిపించాడు సర్పంచ్. ‘‘గుడ్ మార్నింగ్ సర్పంచ్ సాబ్!’’‘‘గుడ్ మార్నింగ్ సార్.. గిప్పుడు లేచిండ్రా..? మీ తమ్ముడు ఎప్పుడో పొలంకి పాయే’’ అన్నాడు నవ్వుతూ సర్పంచ్. ‘‘అవునా?’’ ఆశ్చర్యపోయాడు రాహుల్. ‘‘మాటలే గాదు.. షేతల్లో చూపిస్తుండు మీ తమ్ముడు’’ మెచ్చుకోలుగా సర్పంచ్ పేపర్లోంచి తల తిప్పకుండానే. ఆదరాబాదరాగా దినచర్యకు దిగాడు రాహుల్. అరగంటలో అన్నీ పూర్తి చేసుకొని పొలానికి వెళ్లాడు. అక్కడ..ఎవరో స్త్రీ మూర్తితో మాట్లాడుతూ కనిపించాడు అజయ్ అల్లంత దూరం నుంచి. దగ్గరకు వచ్చాక చూస్తే.. మల్లయ్య భార్య. చాలా నవ్వుతూ మాట్లాడుతోంది అజయ్‌తో.
ఆమె ఇక్కడికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది?ఆ సందేహాన్నే ప్రశ్నలుగా సంధించాడు ఆమె వెళ్లిపోయాక. ‘‘మనం ఈ పొలం కొన్నమని ఎవరో చెప్పిన్రట అన్నా. మంచిగ పండించుకోండ్రి అని చెప్పడానికొచ్చింది’’ అన్నాడు అజయ్ అదేదో అంతగా పట్టించుకునే విషయం కాదన్నట్టు. ‘‘ఊ’’ అంటూ చెట్టు కిందకు వెళ్తున్న రాహుల్ ఫోన్ మోగింది. విస్మయం.. ఆ భావంతోనే ఫోన్ లిఫ్ట్ చేశాడు రాహుల్. ‘‘హలో అన్నగా.. ఏంరా.. నేను రాకుండా.. లేకుండానే కల్టివేషన్ చేస్తవా? నేను వచ్చేదాకా ఆగు. ఈ వారంలో వస్తున్నా. జాబ్‌గీబ్ అన్నిటికీ గుడ్‌బై చెప్పేశ్న. కలిసి వ్యవసాయం చేసుకుందాం..మన దేశం.. మన మట్టి..’’ అంటూ ఇంకేదో చెప్తూనే ఉన్నాడు అవతల నుంచి. రాహుల్ మొహం నిండా చెమటలు. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. చెవి దగ్గరున్న ఫోన్‌ని పట్టుకున్న చేయి వణుకుతోంది. కాళ్లూ కంపిస్తున్నాయి.
- సరస్వతి రమ
ఆకలి పొలం
Published Sun, Jan 20 2019 12:55 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment