గున్న గున్న మామిడి... గూడ్సుబండి దోపిడి! | Funday Laughing fun story | Sakshi
Sakshi News home page

గున్న గున్న మామిడి... గూడ్సుబండి దోపిడి!

Published Sun, May 27 2018 12:02 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

Funday Laughing fun story - Sakshi

మాది రైల్వేస్టేషన్‌ ఉన్న ఊరు. మా ఊరు మీదుగా ప్రయాణికులను తీసుకువెళ్లే రైలుబండ్లతో పాటు రకరకాల వస్తువులను ఒకచోటు నుంచి మరొకచోటికి రవాణా చేసే మాల్‌గాడీలు కూడా వెళుతుంటాయి.ఒక ఎండాకాలంలో నిమ్మకాయలు రవాణా  చేస్తున్న ఒక మాల్‌గాడి(గూడ్స్‌బండి) అగ్నిప్రమాదానికి గురైంది.ఆ బండిని లూప్‌లైన్‌లో పెట్టారు.బాగా కాలిపోయిన బోగీలతో పాటు  పెద్దగా ఏమీ కాని బోగీలు కూడా ఈ లూప్‌లైన్‌లో ఉన్నాయి. అగ్నిప్రమాదానికి గురైన మాల్‌గాడి డబ్బాలను చూడడానికి మా ఊరు నుండే  కాకుండా చుట్టు పక్కల ఊళ్ల నుంచి కూడా  జనాలు తండోపతండాలుగా తరలి వచ్చారు.అగ్నిప్రమాదానికి గురైన గూడ్స్‌ డబ్బాలను చూడడానికి  వాళ్లు అలా వస్తున్నారని  పుసుక్కున్న మీరు అనుకొని ఉంటే  వేడి వేడి నిమ్మకాయ తొక్కులో కాలేసినట్లే!లూప్‌లైన్‌లో ప్రమాదానికి గురైన డబ్బాలతో పాటు పెద్దగా ప్రమాదానికి గురి కాని డబ్బాలతో పాటు... అసలు ఏమీ కాని డబ్బాలు కూడా ఉన్నాయి. అందులో పెద్ద పెద్ద నిమ్మకాయలు ఉన్నాయి. డబ్బాలను చూడడానికి వచ్చిన వాళ్లు.... వాటిని చూసినట్లే చూసి నిమ్మకాయలను నొక్కేయడం మొదలు పెట్టారు. జేబులతో మొదలైన దోపిడి సంచుల వరకు వెళ్లింది.

అలా ఏ వీధిలో చూసినా  నిమ్మకాయ ముచ్చట్లే.ఏ ఇంటిలో చూసినా నిమ్మకాయ పచ్చడే.నిమ్మకాయల బండి ఎపిసోడ్‌కు ముందు మా ఊరికి బిచ్చగాళ్ల  తాకిడి విపరీతంగా ఉండేది. ఈ నిమ్మకాయ పచ్చడి పుణ్యమా అని ఒక్కరు కనబడితే ఒట్టు!‘ఒకప్పుడు.... అమ్మా ఇంత బువ్వెయమ్మా... అని అరిస్తే చాలు.... నూటొక్క రకాల కూరలు బొచ్చెలో పడేవి. ఇప్పుడు... ఏ ఇంటికి వెళ్లినా నిమ్మకాయ పచ్చడే వేస్తున్నారు. ఇక ఈ ఊరికి సచ్చినా రాకూదు’ అని ఒక సీనియర్‌ బిచ్చగాడు మా ఊరివాళ్ల మీద నిప్పులు చెరిగాడు కూడా!మరో విషయం ఏమిటంటే ఈ నిమ్మకాయలు కొన్ని సంసారాల్లో నిప్పులు కూడా పోశాయి. ఉదాహరణకు గొట్టిముక్కల లింగమూర్తి కేసు.ఒకరోజు పొరుగింటామె లింగమూర్తి భార్యతో....‘‘ఏమమ్మా... ఎన్ని నొక్కారు? సంచా? రెండు సంచులా?’’ అని అడిగింది. అంతే!

కోపంతో లింగమూర్తి భార్య కళ్లు ఎర్రబడ్డాయి.తన భర్తను తిట్టిన తిట్టు రిపీట్‌ కాకుండా తిట్టడం మొదలు పెట్టింది...‘‘మా ఆయన సంగతి నీకు తెలియదా! ఒట్టి దద్దమ్మ.... చేసి పెడితే తినడం తప్ప... ఊళ్లోకి నిమ్మకాయల బండి వచ్చిందనిగానీ, అది మన కోసమే వచ్చిందనిగానీ, అలా చూసినట్లు చూసి ఇలా సంచి నిండా  నిమ్మకాయలు కొట్టేయ వచ్చనిగానీ... ఇలాంటి కనీసం  జ్ఞానం ఈయనకు ఉండి చచ్చిందా!మన  ఇంటెనక ఈరయ్య ఇంటి నిండా నిమ్మకాయలేనట.ఈయన ఉన్నాడెందుకు... మనిషి జన్మ పుట్టినందుకు దమ్ము, ధైర్యం ఉండాలా... గొడ్డులా తినడం కాదు...’’ నాన్‌స్టాప్‌గా తిట్టడం మొదలు పెట్టింది.ఇక్కడ జరిగిన పెద్ద పొరపాటు ఏమిటంటే...భర్త బజారుకు వెళ్లాడని ఆమె తిట్లు అందుకుంది.కానీ ఆయన బజారుకు వెళ్లినట్లే వెళ్లి ‘స్టమక్‌ నెట్‌వర్క్‌’  నుంచి అర్జెంట్‌గా మెసేజ్‌ రావడంతో  ఉరుకులు పరుగుల మీద వెనక్కి వచ్చి టాయిలెట్‌లో దూరాడు. పాపం ఈ దృశ్యాన్ని  ఆయన భార్య చూడలేదు. టాయిలెట్‌లో ఉన్న లింగమూర్తి మాత్రం భార్య తిట్లను ఆకాశవాణి వార్తల్లా శ్రద్ధగా విన్నాడు.బయటకి వచ్చాడో లేదో...‘‘ఏమాన్నావు? నేను గొడ్డునా?’’ అని లుంగీ సర్దుకుంటూ భార్య వైపు ఆవేశంగా అడుగులు వేశాడు. అంతే! ఆయన భార్య జంప్‌. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు లింగమూర్తి భార్య పుట్టింటి నుంచి తిరిగిరానేలేదు!

అవసరానికి మించి, అవసరం లేకపోయినా  నిమ్మకాయలు వాడడం వల్ల  కొందరికి  ‘నీంబోరియా’ అనే వ్యాధి ఎటాక్‌ కావడంతో ఊళ్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరిగాయి. ఈ వ్యాధి లక్షణం ఏమిటంటే... ఒక వ్యక్తి అప్పటి వరకు ఏ టాపిక్‌ మాట్లాడుతున్నా సరే... సడన్‌గా నిమ్మకాయాల టాపిక్‌లోకి దూరిపోయి  ఏదో ఒకటి వాగుతుంటాడు. ఉదాహరణకు ‘నీంబోరియా’ సోకిన పెంచలయ్యను తీసుకుందాం.సపోజ్‌ ఈయనను ‘కర్నాటక రాజకీయాల గురించి నీకు ఏమైనా అవగాహన ఉందా?’ అని అడిగాము అనుకుందాం. ఆయన ఇలా స్పందిస్తాడు.‘‘కర్నాటక రాజకీయాలు ఊహకు అందనివేమీ కావు. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని... హంగు వస్తుందని అందరూ అనుకున్నదే. అయితే రిజల్ట్‌ తరువాత ఇంత హంగామా ఉంటుందని ఎవరూ అనుకోలేదు... లింగాయత్‌ ఓటు బ్యాంక్‌ గురించి మాట్లాడుకుంటే... నిమ్మ కాయలో విటమిన్‌ సి సమృద్ధిగా ఉంటుంది. ఇవి పసుపురంగులో ఉండి రుచికి పుల్లగా ఉంటాయి. ఇంతకీ కర్నాటకలో  ఏ పార్టీ గెలిచినట్లు, ఏ పార్టీ ఓడినట్లు! సీట్లు తక్కువ వస్తేనేం... ఓట్ల శాతం ఎక్కువ అని సంతోషించాలా?  ఓట్ల శాతం తక్కువ అయితేనేం... సీట్లు ఎక్కువ వచ్చాయని సంతోషించాలా? నిమ్మ గురించి మొదటిసారిగా పదవ శతాబ్దంలో అరబ్‌ సాహిత్యంలో పేర్కోబడింది. అస్సాం రాష్ట్రంలో మొదటిసారిగా నిమ్మకాయలు పండించారు.

కర్నాటక రాజకీయాలు, వాటి ఫలితాలు కేవలం ఆ రాష్ట్రానికి పరిమితమైన వ్యవహరం అనేది వాస్తవం కాదు. దేశరాజకీయాలు సరికొత్త సమీకరణలతో ముందుకు వెళతాయి... నిమ్మచెట్టు పొట్టిగా దట్టంగా ఉండి పది అడుగుల ఎత్తు పెరుగుతుంది. పత్రపుష్పాలు రాలిన తర్వాత చిన్న బుడిపె మాదిరిగా తయారై అది పండుగా మారుతుంది. నిమ్మపండు గుండ్రంగా ఉండి ఒక చివర సూదిలా ఉంటుంది...’‘నీంబోరియా’ వ్యాధి చాలాముంది యువకులకు ఎటాక్‌ కావడంతో... మా ఊళ్లో అబ్బాయిలకు పిల్లను ఇవ్వడానికి కూడా భయపడేవారు.ఏదైనా పని సులువుగా అయిపోతుందని  చెప్పడానికి...
‘అరచేతిలో నిమ్మకాయ పట్టినంత సులభంగా పని అయిపోతుంది’ అనేది మన జాతీయం.  ఈ దొంగ నిమ్మకాయలు మాత్రం రకరకాల సంఘటనలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేంత పనిచేశాయి!
– యాకూబ్‌ పాషా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement