
నా వయసు 35 సంవత్సరాలు. రెండు సాధారణ కాన్పులు. ఇప్పుడు నాకు యోని వదులుగా అనిపిస్తుంది. దగ్గినా, తుమ్మినా కొద్దిగా మూత్రం కారిపోతోంది. యోని లూజుగా ఉండటం వల్ల కలయికలో నాకు, మా ఆయనకు తృప్తి అనిపించడం లేదు. యోని బిగుతుగా అవడానికి ఇప్పుడు లేజర్ ట్రీట్‌మెంట్ ఉందని విన్నాను. దాని గురించి చెప్పగలరు. – ప్రజ్ఞ, హైదరాబాద్
కొంతమందిలో సాధారణ కాన్పుల వల్ల, ఆ సమయంలో తలెత్తే ఇబ్బందుల వల్ల యోనిలోని కండరాలు, టిష్యూ బాగా సాగిపోయి మళ్లీ పూర్వ స్థితి రాకపోవచ్చు. అలాగే కొందరిలో రక్తహీనత, ప్రొటీన్స్ తక్కువగా ఉండటం వంటి అనేక కారణాల వల్ల యోని వదులుగా అయిపోయి, మూత్రాశయానికి సపోర్ట్ లేకపోవడం వల్ల దగ్గినా, తుమ్మినా మూత్రం కారడం, కలయికలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. దీనికి చికిత్సలో భాగంగా పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు, పౌష్టికాహారం, వెజైనోప్లాస్టీ ఆపరేషన్, వెజైనల్ టేపులు వంటి ఆపరేషన్ల ద్వారా యోని భాగాన్ని బిగుతు చేయడం జరిగేది. ఇప్పుడు వీటికి పీఆర్‌పీ చికిత్స, లేజర్ చికిత్స కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. పీఆర్‌పీ అంటే ప్లాస్మా రిబ్ ప్లేట్‌లెట్స్. సమస్య ఉన్నవారి రక్తంలోని ప్లాస్మా, ప్లేట్‌లెట్స్ కణాలను వేరు చేసి, వారి యోని భాగంలోకి ఇంజెక్షన్ ద్వారా పంపడం వల్ల అక్కడి కణాలు వృద్ధి చెంది యోనిభాగం బిగుతుగా అవుతుంది. అలాగే లేజర్ ద్వారా యోనిలోకి పంపించే కిరణాలకు యోని కణజాలం వేడి చెంది, తద్వారా అందులోని గ్రోత్ ఫ్యాక్టర్స్, ఫైబ్రోబ్లాస్ట్ వంటి అనేక కణాలు ప్రేరేపణ చెంది, రక్తప్రసరణ వృద్ధి చెంది యోని బిగుతుగా అవుతుంది. దీనివల్ల చాలా వరకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
ఎండాకాలంలో చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటాను. ఏ.సి రూమ్ నుంచి బయటికి రాను. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్. ఈ టైమ్‌లో అదేపనిగా ఏసీ రూమ్‌లో ఉండడం మంచిదేనా? రాబోయే ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ద్రవాలు తీసుకోవాలనేది తెలియజేయగలరు. – కె.సంగీత, కాకినాడ
ఎండాకాలంలో ఎక్కువ వేడి వాతావరణం కారణంగా గర్భిణులలో చెమటలు పట్టడం, డీహైడ్రేషన్ ఎక్కువగా ఉండటం, వడదెబ్బ తగలడం, బీపీ తగ్గడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, తొందరగా అలసట చెందడం, కాళ్ల వాపు వంటి సమస్యలు ఉండవచ్చు. కాబట్టి ఎండాకాలం వీలైనంత వరకు మధ్యాహ్నం పూట బయటకు వెళ్లకపోవడం మంచిది. బయటి పనులు పొద్దున్నే లేదా సాయంత్రం ఎండ చల్లబడిన తర్వాత చేసుకోవడం మంచిది. మరీ ఎక్కువగా వేడి ఉంటే ఫ్యాను దగ్గర లేదా ఏసీలో ఉండవచ్చు. దీనివల్ల కడుపులోని బిడ్డకు జలుబు చేయడం వంటివేమీ ఉండవు. ఎండాకాలంలో ద్రవపదార్థాలు– మంచినీళ్లు, మజ్జిగ, పండ్లరసాలు, ఎలక్ట్రాల్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవచ్చు. గొడుగు పట్టుకు వెళ్లాలి. మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉండాలి. ముఖం మీద నీళ్లు చల్లుకుంటూ ఉండాలి. రోజూ రెండుసార్లు మంచినీళ్లతో స్నానం చేయడం మంచిది. కాఫీ, టీ, పచ్చళ్లు, కారాలు, మసాలాలు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఆహారం కొద్ది కొద్దిగా తీసుకోవడం మంచిది. చర్మం పొడారిపోతుంది కాబట్టి మాయిశ్చరైజర్లు, యాంటీ ఫంగల్ పౌడర్లు వాడుకోవచ్చు. లైట్ కలర్ దుస్తులు వదులుగా ఉండేలా వేసుకోవడం మంచిది. ఈ సమయంలో మరీ ఎక్కువగా వ్యాయామాలు చేయకూడదు. పనులు కూడా వెంట వెంటనే కాకుండా మెల్లగా చేసుకోవడం మంచిది. మరీ అధికంగా ఎండకు ఎక్స్‌పోజ్ అయినట్లయితే మొదటి మూడు నెలల్లో అబార్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే బిడ్డ వెన్నుపూసలో లోపాలు ఏర్పడవచ్చు. తర్వాతి నెలల్లో జాగ్రత్తలు తీసుకోకుంటే ఉమ్మనీరు తగ్గడం, నెలలు నిండకుండానే కాన్పులు జరిగే అవకాశాలు కొంతవరకు ఉంటాయి.
ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సి సమయంలో iodine సప్లిమెంట్స్ తీసుకుంటే మంచిది అని చదివాను. దీనివల్ల కలిగే ఉపయోగాలు తెలియజేయగలరు.– శ్రీ, వేటపాలెం
అయోడిన్ అనే ఖనిజలవణం గర్భంలో ఉన్న శిశువు మెదడు ఆరోగ్యకరంగా ఎదగడానికి, పుట్టిన తర్వాత కూడా బిడ్డ మెదడు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. థైరాయిడ్ హార్మోన్ తయారీకి అయోడిన్ ఉపయోగపడుతుంది. తద్వారా శరీరంలో అనేక రసాయనిక చర్యలకు దోహదపడుతుంది. తల్లిలో థైరాయిడ్ హార్మోన్ సక్రమంగా విడుదల అయితేనే అది శిశువుకు చేరి, శిశువు ఆరోగ్యంగా పుట్టడానికి దోహదపడుతుంది. తల్లిలో అయోడిన్ సరిగా లేకపోతే, బిడ్డలో థైరాయిడ్ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం, § éనివల్ల శిశువులో మానసిక, శారీరక లోపాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాన్పు తర్వాత కూడా తల్లి పాల ద్వారా అయోడిన్ బిడ్డకు చేరి బిడ్డ మెదడు పనితీరుకు, శారీరక పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అయోడిన్ ఎక్కువగా పాల ఉత్పత్తులు, గుడ్లు, కూరగాయలు, అయోడైజ్డ్ ఉప్పు, సముద్రపు ఆహారం వంటి వాటిలో ఉంటుంది. పైన చెప్పిన ఆహారం సరిగా తీసుకుంటే అయోడిన్ సప్లిమెంట్స్ తప్పనిసరిగా తీసుకోవాలనేమీ లేదు.
డా‘‘ వేనాటి శోభబర్త్‌రైట్ బై రెయిన్‌బో
హైదర్‌నగర్ హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment