
ముంబై, బాంద్రా: షారుఖ్‌ఖాన్ నివాసం ‘మన్నత్’లో...
‘‘ఏమైనా సౌత్ సౌతేనండీ’’ పొడవాటి సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్.
‘‘ఏ విషయంలో బ్రో...’’ అడిగాడు సల్మాన్‌ఖాన్ సకినాలు నములుతూ.
(ఫుట్‌నోట్: సల్మాన్‌ఖాన్‌కు సంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి అనే వీరాభిమాని ఉన్నాడు. ఇతడు ప్రతి సంక్రాంతికి సల్మాన్‌కు సకినాలు కొరియర్‌లో పంపుతాడు)
‘‘మనం, అంటే బాలీవుడ్ వాళ్లం ఎవరి లోకం వారిదే అన్నట్లుగా బతుకుతున్నాం... అదే సౌత్‌లో చూడండి తెలుగు సినిమా వాళ్లు ‘మా’ పేరుతో ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, అటు తమిళ సినిమా వాళ్లు ‘నడిగర్ సంఘం’ పేరుతో, కన్నడ సినిమా వాళ్లు ‘ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్’గా ఏర్పడి మంచి మంచి పనులు చేస్తున్నారు. తమ మధ్య ఉన్న సోదరభావాన్ని, సుహృద్భావాన్ని అదేపనిగా చాటుకుంటున్నారు. మనం మాత్రం మన పనిలో మాత్రమే మునిగిపోయి ఒకర్నొకరం పట్టించుకోవడం లేదు. అందుకే మనం కూడా ఒక అసోసియేషన్‌గా ఏర్పడి సోదరభావాన్ని చాటుకోవాలి. ఏమంటావ్?’’ అన్నాడు షారుఖ్‌ఖాన్.
‘‘కేక. మంచి ఐడియా బ్రో... ఇప్పుడే ఇండస్ట్రీలో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరికీ ఫోన్ చేసి చెబుదాం. రేపు పొద్దున షార్పుగా పదిగంటలకు మెహబూబ్ స్టూడియోలో సమావేశమై ఆవేశం లేకుండా అసోసియేషన్‌ను ఏర్పాటుచేద్దాం.’’ అన్నాడు సల్మాన్‌ఖాన్.
సంతోషంతో చప్పట్లు కొట్టాడు షారుఖ్ ఖాన్.
మరుసటి రోజు....
బాలీవుడ్ వాళ్లకు కాస్త క్రమశిక్షణ ఎక్కువ కదా... పది దాటింది. పన్నెండు దాటింది, మూడు దాటింది, ఆరు దాటింది... షారుఖ్, సల్మాన్‌లతో సహా ఒక్కరూ స్టూడియోకు రాలేదు.
రాత్రి పదిగంటల సమయంలో మాత్రం ఒక్కరొక్కరుగా తూలుతూ వస్తున్నారు....
‘‘చలి చంపేస్తుంది గురూ’’ అంటూ సిగరెట్ వెలిగించాడు షారుఖ్ ఖాన్.
‘‘చలి అంటే గుర్తుకొచ్చింది....టైగర్ జిందా హై సినిమా షూటింగ్ మాంచి చలికాలంలో స్విట్జర్లాండ్‌లో జరిగింది. అడుగు తీసి అడుగు వేస్తే మంచు... విపరీతమైన చలి... ఆ చలి తట్టుకొని షూటింగ్ చేయాల్సి వచ్చింది...’’ చెప్పుకుంటూ పోతున్నాడు సల్మాన్.
సల్మాన్ సుత్తికి కత్తిలా అడ్డుపడ్డాడు అమీర్‌ఖాన్ తన చేతిలోని మైక్‌ను సవరిస్తూ...
‘‘మనం ఈ స్టూడియోకి వచ్చింది ఒక అసోసియేషన్‌గా ఏర్పడడానికి తప్పించి, చలి తీవ్రత గురించి చర్చించడానికి రాలేదు. నేను...అనగా అమీర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమా పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నాను. అయినప్పటికీ అసోసియేషన్‌పై రస్పక్ట్‌తో ఇక్కడికి వచ్చాను. డోన్ట్ వేస్ట్ మై టైమ్’’ అన్నాడు.
‘‘మా ఆయన చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం’’ అన్నది కిరణ్‌రావు సెల్‌ఫోన్ చూస్తూ.
సల్మాన్‌ఖాన్‌కి అంత చలిలోనూ చుర్రుమని మండింది. వెంటనే అమీర్‌ఖాన్ చేతిలోని మైక్‌ని లాక్కొని....
‘‘అక్కడికేదో నీ ఒక్కడికే పని ఉన్నట్లు... మేమేమో మా సినిమాలన్నీ ఫ్లాపై... సినిమాలు లేక ఇంట్లో ఖాళీగా కూర్చొని, ఏంతోచక నెట్‌ఫ్లిక్స్ చూస్తున్నట్లు... ఏం మాట్లాడుతున్నావయ్యా! చక్కర్ మే డక్కర్...డక్కర్ మే లిక్కర్..’’ అని కండలు చూసుకున్నాడు సల్మాన్.
సల్మాన్ చేతిలోని మైక్‌ని విసురుగా లాక్కొని...
‘‘సినిమాలు తీయడమంటే మీసం తీసినంత తేలిక కాదు మిత్రమా! అదో తపస్సు... నాన్నగారు అన్నట్లు అదో ఉషస్సు... లేనిచో... అంతా తుసు తుస్సూ! తీస్తే నాలా సినిమాలు తీయాలి... డిష్యూం డిష్యూం సినిమాలు కాదు’’ అన్నాడు అమీర్‌ఖాన్ కాలర్ ఎగరేస్తూ.
‘‘మా ఆయన చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం’’ అని మళ్లీ సెల్‌ఫోన్‌లో మునిగిపోయింది కిరణ్‌రావు.
‘‘తీశావులే మా గొప్ప సినిమా! నీ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా 1000 కోట్లు వసూలు చేసింది. థియేటర్లు కుయ్యో మొయ్యో అని అరుస్తున్నా... ఇంకా ఆడుతూనే ఉంది...’’ అని అమీర్‌ఖాన్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా అన్నాడు సల్మాన్‌ఖాన్. సల్మాన్ చేతిలోని మైక్‌ను ఫోర్స్‌గా లాక్కున్న అమీర్‌ఖాన్...
‘‘సినిమా ఫ్లాపా హిట్టా? అనేది పాయింట్ కాదన్నయా! ఎంత బాగా తీశాము, ఎంత పేరు వచ్చింది అన్నదే పంచె’’ అన్నాడు.
అమీర్‌ఖాన్ నుంచి మైక్ లాక్కున్న షారుఖ్‌ఖాన్...
‘‘మీ పాయింట్లు, పంచెలు, లాగుల గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి రాలేదు. బయట మాకు బోలెడు పనులు ఉన్నాయి...’’ అన్నాడు ఆవేశంగా.
షారుఖ్ నుంచి మైక్‌తో పాటు సిగరెట్ లాక్కున్న అమీర్‌ఖాన్...
‘‘కోతలు కోయకు మిత్రమా... ‘జీరో’ సినిమా మీద ఎన్నో ఆశలు, ఆశయాలు, కర్తవ్యాలు పెట్టుకున్నావు. అది కాస్త తుస్సుమనేసరికి సినిమాలు లేక ఇంట్లో టీవీ చూసుకుంటూ కూర్చుంటున్నావు. నీ విషయం గౌరీఖాన్‌కి తప్ప ఎవరికీ తెలియదనుకుంటున్నావా? రహస్యం అంటే బీరువాలో పెట్టి దాచేది కాదు... అది బారులో తాగే బీరు. అందరికీ తెలుస్తుంది... తెల్సియాల్సిందే’’ అన్నాడు.
అమీర్‌ఖాన్ జేబులో నుంచి పెన్ను లాక్కున్న గౌరీఖాన్...
‘‘మా ఆయన్ని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు. ఇది కలం అనుకుంటున్నారా? కాదు కత్తి... మరో మాట ఎక్కువ మాట్లాడితే ఈ కలం అనే కత్తితో...’’ అని హెచ్చరించింది.
అప్పుడే లెఫ్ట్‌సైడ్ నుంచి దూసుకొచ్చిన కిరణ్‌రావు, గౌరీఖాన్ చేతిలోని మైక్‌ను లాక్కొని....
‘‘మా ఆయన్ని ఉత్తపుణ్యానికే ఆడిపోసుకుంటే ఊరు కునేది లేదు, సిటీ కునేది లేదు. ఏం? కలాలు మీ దగ్గరే ఉంటాయా? మా దగ్గర ఉండవా? కలాలను కత్తులుగా చేసుకునే బోడి తెలివితేటలు మీకు మాత్రమే ఉన్నాయా? మాకు లేవా?’’ అని అరిచింది.
ఈలోపు రైట్ సైడ్ నుంచి రాధాఖాన్ దూసుకువచ్చింది (ఫుట్‌నోట్: ఈవిడ గౌరిఖాన్ పిన్ని కూతురు)
కిరణ్‌రావు చేతనిలోని మైక్ లాక్కొని....
‘‘చేతిలో మైక్ ఉంది కదా అని మైకం కమ్మినట్లు ఎడా పెడా మాట్లాడడం తెలివి కాదు. మా అక్కయ్యను ఏమన్నా అంటే ఊరుకునేది లేదు... అక్కయ్య సన్నిధి అదే నాకు పెన్ని«ధి...’’ అని పాడుతూ కళ్లు తిరిగి అడ్డం పడిపోయింది రాధాఖాన్.
‘‘మా చెల్లి అంతే, మా చెల్లి అంతే’’ అని చిన్నగా అరిచింది గౌరీఖాన్.
‘‘అంతే అంటే?’’ అని అడిగారు అక్కడున్న ఒకరు.
‘‘మా చెల్లికి ఆవేశం వచ్చినప్పుడల్లా ఇలా పడిపోతుంది. ఆ తరువాత అయిదు నిమిషాల్లో తనే లేస్తుంది. నాకు ఏమైంది? నేను ఎందుకు కిందపడిపోయాను? అసలు ఏం జరిగింది? అని అడుగుతూ చంపుకు తింటుంది’’ అని చెప్పింది గౌరీఖాన్.
గౌరీఖాన్ చేతిలో మైక్ లాక్కున్న సల్మాన్‌ఖాన్ ఆవేశంగా...
‘‘మనం ఇక్కడికి వచ్చింది కళ్లు తిరిగి అడ్డం పడిపోవడానికి కాదు, మంచి చెడు మాట్లాడుకోవడానికి. ఒక అసోసియేషన్‌గా ఏర్పడడానికి. కొత్త సంవత్సరం రోజు డైరీలు విడుదల చేసుకోవాలంటే, మనందరం ఒక అసోసియేషన్‌గా ఏర్పడాలి కదా! మీకు డైరీలు కావాలా? వద్దా?’’ అని సభికులను ఉద్దేశించి కాస్త గట్టిగానే అడిగాడు.
‘‘కావాలి... కావాలి... కూరగాయ ఖర్చులు, ఇతర చిల్లర ఖర్చుల గురించి రాసుకోవడానికి పేపర్లు లేక ఛస్తున్నాం. డైరీలే కాదు క్యాలెండర్లు కూడా ఇవ్వాలి...’’ అని సభికులు గట్టిగా అరిచారు.
‘‘మన అసోసియెషన్ ఏర్పాటయిన తరువాత సంవత్సరానికి ఒకసారి ఏం ఖర్మ... ప్రతి నెలా డైరీలు, క్యాలెండర్‌లు ఇవ్వబడతాయి...’’ అని సల్మాన్ మాట్లాడుతుండగానే....అప్పుడే లేచిన రాధాఖాన్ అతని చేతిలో నుంచి మైక్ లాక్కొని...
‘‘అసలు నాకు ఏం జరిగింది? ఎందుకు కిందపడిపోయాను. నామానాన నేను పడిపోయానా? లేక ఎవరైనా తోశారా?....’’ ప్రశ్నల ఈటెలు విసురుతూనే ఉంది.
అప్పుడే కొక్కరో కో...అని తెల్లవారింది. అసోసియెషన్ ఏర్పాటు 12–1–2021 వరకు వాయిదా పడింది. – యాకుబ్ పాషా
Comments
Please login to add a commentAdd a comment