దెయ్యాల దీవి | Ghost Island is the scariest place in Poveglia Island | Sakshi
Sakshi News home page

దెయ్యాల దీవి

Published Sun, Oct 19 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

దెయ్యాల దీవి

దెయ్యాల దీవి

నిజాలు దేవుడికెరుక: ఇటలీ... 1942. ‘‘అరే విన్నీ... అటు చూడు. అక్కడేదో ఐల్యాండ్ కనిపిస్తోంది.’’జెఫ్రీ మాట వింటూనే అటువైపు చూసింది విన్నీ. దూరంగా ఏదో దీవిలాగా కనిపిస్తోంది. ‘‘ఈ పడవలో తిరిగి తిరిగి అలసటగా ఉంది. అక్కడికెళ్లి విశ్రాంతి తీసుకుందాం’’ అన్నాడు జెఫ్రీ. ‘‘నిజమే. ఎలాగూ చీకటి పడుతోంది. ఈ రాత్రికి అక్కడే ఉందాం’’ అన్నాడు డానియెల్ హుషారుగా. ‘‘డ్యానీ... అదేం దీవో, ఎలా ఉంటుందో. తను చెప్పడానికీ, నువ్వు తలాడించడానికీ సరిపోయింది’’ అంది విన్నీ కాస్త కోపంగా. ‘‘నువ్వు మరీను విన్నీ. అన్నిటికీ అడ్డుపుల్ల వేస్తావ్. ఏదో జలచరాల మీద రీసెర్చ్ చేద్దామని జెఫ్రీ అంటే సరదాగా వచ్చాను. పొద్దుట్నుంచీ ఈ నీటిలో తిప్పుతూనే ఉన్నారు. ఇక నావల్ల కాదు. రెస్ట్ తీసుకోవాల్సిందే’’... పట్టుబట్టాడు డానియెల్. ఇక మాట్లాడలేకపోయింది విన్నీ.  
 
 పొవేలియా దీవిలో ఉన్న ఆస్పత్రిలోని ఒక గది ఇది. దీన్ని శుభ్రం చేయబోతే ఏవేవో ఆకారాలు కనిపించి భయపెట్టాయి. పనివాళ్లను తరిమేశాయి. అందుకే ఇలా వదిలేశారు.
 
 పడవ దీవిని సమీపించింది. పచ్చని పచ్చిక, ఎత్తయిన చెట్లు, వాటి మధ్య ఒక ఎత్తయిన భవనం ఉన్నాయి. చెట్లమీద, భవంతి మీద ఒత్తుగా అల్లుకుపోయిన తీగల్ని చూస్తుంటే... చాలాకాలంగా అక్కడ ఎవరూ ఉండటం లేదని అర్థమవుతోంది.
 ‘‘ఇదేదో భూత్ బంగ్లాలా ఉంది జెఫ్రీ. నాకు భయంగా ఉంది’’ అంది విన్నీ.  ‘‘మళ్లీ మొదలుపెట్టావా? ఇంత పిరికిదానివి నీకెందుకమ్మా ఈ రీసెర్చులు’’ అన్నాడు డ్యానీ వేళాకోళంగా. విన్నీ ముఖం చిన్నబుచ్చుకుంది. జెఫ్రీ అది గమనించాడు.
 ‘‘షటప్ డ్యానీ... కొత్త ప్రదేశం అంటే ఎవరికైనా భయం ఉంటుంది. అందులోనూ ఆడపిల్ల. ఆమాత్రం కంగారుపడదా ఏంటి’’ అంటూ విన్నీని దగ్గరకు తీసుకున్నాడు. అతడి చేతిని గట్టిగా పట్టుకుని దీవిలో అడుగు పెట్టింది విన్నీ. వారి వెనుకే ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు తీసుకుని నడుస్తున్నాడు డానియెల్. ముగ్గురూ భవంతిలో అడుగుపెట్టారు.
 
 లోపలంతా గత్తరగా ఉంది. ఎక్కడ చూసినా దుమ్ము, ధూళి, చెత్త పేరుకుపోయి ఉన్నాయి. బోలెడన్ని గదులున్నాయి. అన్నీ విశాలంగా ఉన్నాయి. కొన్ని గదుల్లో ఉన్న పాత ఇనుప మంచాలు, పచ్చరంగు దుప్పట్లు, తుప్పు పట్టిపోయిన కత్తెర్లు, వాషింగ్ బేసిన్లు చూడగానే అది ఆస్పత్రి అని అవగతమయ్యింది. ఖాళీగా ఉన్న ఓ గదిలోకి వెళ్లారు ముగ్గురూ. చీకటిగా ఉంది. స్విచ్ బోర్డులు ఉన్నాయి కానీ లైట్లు పని చేయడం లేదు. దాంతో తమ దగ్గరున్న టార్చ్ లైట్లని ఆన్ చేసి పెట్టుకున్నారు. గదంతా పరచుకుని ఉన్న ఆకుల్ని ఏరి పారేసి, ఓ పాత గుడ్డను తీసుకుని ధూళిని తుడిచారు సుష్టుగా భోంచేసి, అక్కడే నిద్రకు ఉపక్రమించారు. అలసిపోయి ఉండటంతో క్షణాల్లో నిద్ర పట్టేసింది. అర్ధరాత్రి కావస్తుండగా కెవ్వున కేక పెట్టాడు డ్యానీ. జెఫ్రీ, విన్నీలు ఉలిక్కిపడి లేచి, ‘‘ఏమైంది డ్యానీ’’ అన్నారు కంగారుగా. ‘‘నా కాలు, నా కాలు... ఏదో కరిచేసింది’’... అరుస్తూ ఏడుస్తున్నాడు డ్యానీ. వెంటనే టార్చ్ చేతిలోకి తీసుకుని చుట్టూ వేసి చూశాడు జెఫ్రీ. ఓ పాము జరజర పాకుతూ పోతోంది.
 
 ‘‘మైగాడ్... పాము’’ జెఫ్రీ మాట వినగానే ‘‘పామా?’’ అని అరిచారు ఇద్దరూ. వేగంగా కదిలాడు జెఫ్రీ. తన దగ్గరున్న ఖర్చీఫ్‌తో డ్యానీ కాలును గట్టిగా కట్టాడు. ఫస్ట్ ఎయిడ్ బాక్యులో ఉన్న చాకుని తీసి గాయం మీద కోసి విషాన్ని పిండేశాడు. కానీ అప్పటికే డ్యానీ సోలిపోతున్నాడు.
 
 ‘‘విన్నీ... ఆలస్యం చేస్తే లాభం లేదు. తనని హాస్పిటల్‌కి తీసుకెళ్లకపోతే చనిపోతాడు. మనం బయల్దేరుదాం’’ అంటూ డ్యానీని చేతుల్లోకి తీసుకున్నాడు జెఫ్రీ. ‘‘రా వెళ్దాం’’ అంటూ బయటకు నడిచారు. సామాన్లన్నీ తీసుకుని విన్నీ అతడిని అనుసరించింది. పదడుగులు వేసీ వేయగానే కాళ్లకు బ్రేకులు వేసినట్టు ఆగిపోయాడు జెఫ్రీ. ఎదురుగా ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. అది కూడా డాక్టర్ కోటు వేసుకుని.
 
 ‘‘ఏమైంది’’... అన్నాడు డ్యానీ వైపు చూస్తూ. ‘‘పా... పా... పాము కరిచింది’’... చెప్పాడు జెఫ్రీ వణుకుతున్న కంఠంతో. ‘‘అయితే ఇంజెక్షన్ చేయాలి. నాతో రండి’’ అన్నాడా డాక్టర్. ‘‘మీరెవరు?’’... అడిగింది విన్నీ. ‘‘నేనో డాక్టర్‌ని. ఇది నా హాస్పిటలే. ఎప్పుడో మూతబడిపోయింది. కానీ నేను మాత్రం ఇక్కడే ఉంటున్నాను. మీలాగే పడవ ప్రయాణాలు చేస్తూ కొందరు ప్రమాదాలకు గురై ఇక్కడికొస్తుంటారు. వారికి వైద్యం చేస్తుంటాను. అవన్నీ తర్వాత... ముందు మీ ఫ్రెండ్‌ని తీసుకురండి. చికిత్స చేయకపోతే ప్రమాదం’’ అంటూ గదిలోకి నడిచాడు. అతడి వెనుకే వెళ్లబోతోన్న జెఫ్రీని ఆపింది విన్నీ. ‘‘నీకేమైనా పిచ్చా? అతనెవరో ఏంటో. డ్యానీకి ఏదైనా అయితే? మాట్లాకుండా పోదాం పద’’ అంది. జెఫ్రీ ఆలోచనలో పడ్డాడు.
 
 ‘‘ఇంకా ఆలోచిస్తావేంటి జెఫ్రీ! అయినా ఇలాంటిచోట ఓ డాక్టర్ ఉన్నాడంటే నమ్మశక్యంగా ఉందా! అతనే పిచ్చోడో అయివుంటాడు. త్వరగా పోదాం జెఫ్రీ. నాకు భయంగా ఉంది’’ అంది తొందరపెడుతూ. జెఫ్రీ ఇక మాట్లాడలేదు. గబగబా బయటకు అడుగులు వేయసాగాడు. విన్నీ కూడా పరుగులాంటి నడకతో అతణ్ని అనుసరిస్తోంది. ఉన్నట్టుండి ఆమె కాలికి ఏదో అడ్డుపడినట్టయ్యి ఉలిక్కిపడింది. టార్చ్ వేసి చూసి గావుకేక పెట్టింది. అస్థిపంజరం! అది ఇందాక తాము వచ్చినప్పుడు లేదు. ఇప్పుడెలా వచ్చింది? గుండె జారిపోయింది. దాన్ని ఒక్క తన్ను తన్ని పరుగుదీసింది.  ‘‘ఆగండి... ఎక్కడికి వెళ్లిపోతున్నారు?’’... వెనక నుంచి ఓ గంభీరమైన కంఠం వినిపించింది. ఇద్దరూ వెనక్కి చూశారు. అంతే... వారి పై ప్రాణాలు పైనే పోయాయి. డాక్టర్ నిలబడి ఉన్నాడు. కానీ ఇందాకటిలా ప్రసన్నంగా లేడు. ముఖం ఎర్రగా ఉంది.
 
  కళ్లు భయంకరంగా ఉన్నాయి. పళ్లు కోరల మాదిరిగా కనిపిస్తున్నాయి. చేతి గోళ్లు వాడికత్తుల్లా పదునుగా ఉన్నాయి. వాళ్లు చూస్తూండగానే ఒక వ్యక్తి వచ్చి అతడి వెనకాల నిలబడ్డాడు. అతడూ అలానే ఉన్నాడు. ఆ తర్వాత జుత్తు విరబోసుకున్న ఒక మహిళ వచ్చింది. అలా ఒక్కొక్కరుగా వచ్చి చేరుతున్నారు. అందరూ భయంకరంగా ఉన్నారు.
 
 ‘‘విన్నీ... రా. త్వరగా రా’’ అన్నాడు జెఫ్రీ. ఇద్దరూ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా పరుగందుకున్నారు. వెనక నుంచి బరువైన పాదాల చప్పుళ్లు, భీతిగొల్పే అరుపులు వినిపిస్తున్నారు. గుండెలు అదిరిపోతూ ఉంటే ధైర్యాన్ని కూడదీసుకుని ఒడ్డుకు చేరుకున్నారు. డ్యానీని పడవలో వేసి, గబగబా పడవ ఎక్కి ఇంజిన్ ఆన్ చేశాడు జెఫ్రీ. వీన్ని కూడా ఎక్కగానే పడవ క్షణాల్లో నీటిలోకి దూసుకుపోయింది. కాస్త దూరం వెళ్లేవరకూ వెనకనుంచి ఆ అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ శబ్దాలు ఆగాక... ‘‘థాంక్ గాడ్... క్షేమంగా బయటపడ్డాం’’ అన్నాడు జెఫ్రీ. ‘‘అవును. ఇంకెప్పుడూ ఇటువైపు రావొద్దు’’ అంది విన్నీ అతడి గుండెల మీద వాలిపోతూ.   అసలా దీవి గురించి తెలిస్తే వాళ్లు ఆ అటువైపు వెళ్లేవారే కాదు. ఎందుకంటే అది పొవేలియా ఐల్యాండ్. ఈ భూమిమీద ఉన్న అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో ఒకటి!
   
ఇటలీలోని ఓ సముద్రపు పాయలో ఉన్న పద్దెనిమిది ఎకరాల దీవి... పొవేలియా. కొన్ని వేల యేళ్ల క్రితం ఇది ప్రకృతి సౌందర్యానికి నిలయంలా ఉండేది. కానీ పదిహేనో దశాబ్దంలో ఇటలీ అంతటా ప్లేగు వ్యాధి వ్యాపించడంతో పొవేలియా తలరాత మారింది. ప్లేగు వ్యాధి అత్యంత వేగంగా ప్రబలుతూ ఉండటంతో, వ్యాధిగ్రస్తులందరినీ పడవల్లో పొవేలియా దీవికి తరలించి, అక్కడ వదిలేసేవారు. వారంతా అక్కడే మరణించేవారు. అలా లక్షా యాభై వేల మందికి పైగా ఆ దీవిలో అసువులు బాశారు. వాళ్లందరినీ అక్కడే పాతేశారు. చివరికి ఆ దీవి అంతటా ప్లేగు వ్యాధిని కలిగించే వైరస్ ఎంతగా వ్యాపించిందంటే, ఆ చుట్టుపక్కల నుంచి ఏదైనా పడవ కానీ, ఓడ కానీ ప్రయాణిస్తే... అందులోని వారు కూడా జబ్బుపడేవారు. దాంతో ఆ చుట్టుపక్కలకు వెళ్లడమే మానేశారంతా.
 
 చాలా యేళ్ల తర్వాత, పొవేలియాలో ప్లేగు వైరస్ అంతరించిపోయిందని నిర్ధారించుకున్న ఓ వైద్యుడు... 1922లో అక్కడో పిచ్చాసుపత్రి కట్టాడు. పట్టణాల్లో, నగరాల్లో తనకు ఉన్న ఆసుపత్రుల్లోని మానసిక రోగులను ప్రత్యేక వైద్యం కోసమంటూ ఇక్కడికి తరలించేవాడు. అయితే అతడు వారిమీద చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేసేవాడని, వికృతమైన వైద్యం చేసేవాడని సిబ్బంది అనేవారు. అతడి చేతుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారని కూడా చెప్పేవారు. దానికి తోడు అక్కడ పాతిపెట్టిన ప్లేగు వ్యాధిగ్రస్తులు కొందరు దెయ్యాలై సంచరిస్తున్నారని, రాత్రిళ్లు భయానక అనుభవాలు ఎదరవుతున్నాయని కూడా తెలిపేవారు. కానీ విన్నవాళ్లు దాన్ని అపోహ అని కొట్టి పారేశారు. ఓరోజు ఆ వైద్యుడు భవంతి పై నుంచి పడి మరణించాడు. అది దెయ్యాల పనేనని భావించిన సిబ్బంది పారిపోయారు. దాంతో అధికారులు రోగుల్ని  వేరే చోటికి తరలించేశారు. మళ్లీ జనాలు ఆ దీవిలో అడుగు పెట్టడం మానేశారు.
 
 కొంతమంది ఔత్సాహికులు మాత్రం పరిశోధనల కోసం అక్కడికి వెళ్లేవారు. వాళ్లంతా కూడా దెయ్యాలకు, వికృతమైన శబ్దాలకు భయపడి వచ్చేసేవారు. ఒక వ్యక్తి అయితే ఐల్యాండ్‌ను కొనుక్కుందామనుకుని, ముందు కొన్నిరోజులు కుటుంబంతో సహా అక్కడే ఉండి చూద్దామనుకున్నాడు. మూడు రోజులు గడిచాక అతడి కూతురి తలకు పెద్ద గాయమైంది. పాప కింద పడలేదు. తలమీద ఏదీ పడనూ లేదు. దాంతో భయపడి నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అప్పటినుంచి పొవే లియాను ‘హాంటెడ్ ఐల్యాండ్’గా ప్రకటించారు. నేటికీ దాని పేరు చెప్పినా, అక్కడికి వెళ్లాలన్నా అందరూ వణికిపోతుంటారు. అయితే ఈ యేడు మే నెలలో ల్యూగీ బృంగారో అనే వ్యాపారస్తుడు ప్రభుత్వానికి 16.25 మిలియన్ డాలర్లు చెల్లించి, 99 యేళ్లకు పొవేలియాను లీజుకు తీసుకున్నాడు. దానిని టూరిస్టు ప్రాంతంగా మారుస్తాను అంటున్నాడు. అతడు అనుకున్నది చేయగలడో లేదో, భయపడకుండా అక్కడ ఉండగలడో లేదో చూడాలి మరి!
 - సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement