ఈ జీవితం వర్ణశోభితం | Holi Festival | Sakshi
Sakshi News home page

ఈ జీవితం వర్ణశోభితం

Published Sun, Mar 12 2017 12:14 AM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM

ఈ జీవితం వర్ణశోభితం

ఈ జీవితం వర్ణశోభితం

హోలీ పూర్ణిమ వసంత రుతు ఆగమనానికి సంకేతం. రాలే ఆకులు రాలుతూ ఉంటే, వచ్చే ఆకులు వస్తూ వుంటాయి. అదేవిధంగా,  పాతకోరికలు మరుగున పడుతూ ఉంటే కొత్త కోరికలు చిగురులు తొడుగుతూ ఉంటాయన్నమాట. రంగులు లేని లోకం లేదు. లోకంలో లేని రంగులూ లేవు. అందుకు ప్రతీకగా జరుపుకునే పండగే హోలీ. మనిషి జీవితం రాగరంజితంగా, సప్తవర్ణ శోభితంగా ఉండాలన్నది సందేశం. పురాగాథ ఏమిటంటే, లోకకల్యాణం కోసం దేవతల కోరిక మేరకు, తన స్నేహితుడైన వసంతుడిని వెంటబెట్టుకుని వెళ్లి, తపోదీక్షలో మునిగి ఉన్న పరమేశ్వరునిపై విరిబాణాలను సంధించి ఆయన మనస్సును చలింపజేసేందుకు ప్రయత్నిస్తాడు మన్మథుడు.

 తపోభంగం కావడంతో శివుడు తన మూడోకన్ను తెరిచి మన్మథుణ్ణి మసి చేస్తాడు. అయితే, మన్మథుడి భార్య రతీదేవి పార్వతీ దేవికి భక్తురాలు కావడంతో, సుమంగళిగా ఉండాలన్న వరాన్ని అనుగ్రహించింది పార్వతి ఆమెకు. ఆ వరభంగం కాకుండా ఉండేందుకు, మన్మథుణ్ణి తిరిగి బతికిస్తాడు పరమేశ్వరుడు. అయితే, అతను రతీదేవికి తప్ప మరెవరికీ తన రూపంలో కనిపించడు. రూపం కోల్పోయిన మన్మథుడు ఆనాటి నుంచి మనుషుల మనస్సులలో దాగి ఉండి, తన బాణాలద్వారా వారి అసలు పని నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇక్కడ మన్మథుడు అంటే మనస్సును మథించేవాడని అర్థం. మనిషిలో దాగి ఉన్న కామక్రోధలోభమోహమదమాత్సర్యాలనే ఆరు అంతః శత్రువులు మనస్సును మథిస్తాయి.

వాటినే అరిషడ్వర్గాలు అంటారు. మనిషిని పతనం చేసే ఈ ఆరుగుణాలనూ అదుపులో ఉంచుకోవాలని చెప్పేందుకే పరమేశ్వరుడు కామదేవుడిని భస్మం చేశాడు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకునేందుకే, ఈశ్వరుడు కాముణ్ణి భస్మం చేసిన రోజైన ఫాల్గుణ శుద్ధపూర్ణిమకు ముందురోజు, గ్రామాలలో కామదేవుని ప్రతిమను తయారు చేసి, ఊరేగింపుగా తీసుకెళతారు. యువకులంతా కలిసి కామదహనం చేస్తారు. ఫాల్గుణ పూర్ణిమనాడు పెళ్లికాని యువతీ యువకులు ఒకచోట చేరి, వసంతం కలిపిన నీటిని ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. దీనిద్వారా వారికి గల పరస్పర ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేసుకుంటారు. పెద్దలు వారి ప్రేమను ఆమోదిస్తారు.  

రాధాకృష్ణుల రంగుల కేళీ: రాధాకృష్ణులు ఓరోజున ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వనవిహారం చేస్తుండగా రాధ చేతిపక్కన ఉన్న తన చేయి నల్లగా ఉండటం చూసి దిగులు పడ్డాడట కృష్ణుడు. అప్పుడు యశోదమ్మ ‘నాయనా! రాధమ్మ అసలు రంగు తెలియకుండా నువ్వు ఆమెపై రంగులు కలిపిన నీళ్లు పోయి’ అని సలహా ఇచ్చిందట. దాంతో నల్లనయ్య రాధమీద రంగునీళ్లు పోశాడట. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన రాధ తను కూడా కృష్ణుని మీద రంగులు కలిపిన నీరు చిలకరిస్తూ కృష్ణునికి అందకుండా బయటకు పరుగులు తీసిందట. ఇలా రాధాకృష్ణులిద్దరూ ఒకరి మీద ఒకరు రంగునీళ్లు పోసుకోవడం చూసిన పురజనులు... ఆనందోత్సాహాలతో ఆనాడు రంగుల పండుగ చేసుకున్నారట. నాటినుంచి ప్రతి ఫాల్గుణ పున్నమినాడు ప్రజలందరూ ఒకరినొకరు రంగులతో ముంచెత్తుకోవడం, పెద్ద ఎత్తున పండుగలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

హోలికా పేరు మీదుగానే: హిరణ్యకశిపునికి హోలిక అనే సోదరి ఉండేదట. ఆమెకు అనేక దుష్టశక్తులతోపాటు మంటలలో దూకినా కాలిపోని వరం ఉంది. హోలిక చాలా దుష్టురాలు, దుర్మార్గురాలు. పసిపిల్లలను ఎత్తుకుపోయేది.  తన కుమారుడయిన ప్రహ్లాదుడు హరినామ స్మరణ మానకపోయేసరికి హోలిక తన మేనల్లుడైన ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిలో దూకిందట. అయితే, హోలిక మాడిపోగా, ప్రహ్లాదుడు సురక్షితంగా బయట పడ్డాడు. దుష్టరాక్షసి పీడ వదిలిందన్న సంతోషంతో ప్రజలంతా ఆనందంతో ఒకరిపై ఒకరు రంగునీళ్లు చిమ్ముకుంటూ ఉత్సవం చేసుకున్నారట. హోలిక అనే రాక్షసి పేరు మీదుగా ‘హోలీ’ అనే పేరు వచ్చిందట.

ఇవే కాకుండా హోలీ పండుగను వసంత రుతువు వస్తోందనడానికి సంకేతంగా భావిస్తారు. వసంతకాలం అంటే చెట్లు చిగిర్చి పూలు పూసే కాలం కదా! అంటే మనలోని దుర్గుణాలనే  ఎండుటాకులను రాల్చేసి, వాటి స్థానంలో ఉల్లాసం, ఉత్సాహం అనే సుగుణాలతో కూడిన లే లేత ఆకులను చిగురింపచేసుకోవాలి.ఈ రోజున ఏం చేస్తే మంచిదంటే... మహాలక్ష్మి ఫాల్గుణ పూర్ణిమ నాడే పాలకడలి నుంచి ఆవిర్భవించిందని, అందుకే ఈ వేళ లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే సకల సంపదలూ చేకూరతాయని పురాణోక్తి.

ఈ రోజున బాలకృష్ణుని ఊయలలో వేసి ఊపుతారు. అందుకే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో డోలోత్సవంగా జరుపుకుంటారు. అయ్యప్ప పంబల రాజుకు కనపడింది ఫాల్గుణ శుద్ధ పూర్ణిమనాడేనని, కనుక ఈ వేళ అయ్యప్పకు పూజలు చేస్తే మంచిదని విశ్వాసం. అలాగే ఈ వేళ రతీమన్మథులను పూజించడమూ మంచిదే. అదేవిధంగా పిల్లలకు ప్రాణహాని తలపెట్టే ఢుంఢి అనే రాక్షసి పీడను వదిలించుకునేందుకు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి. హోలీపండుగ రోజున లేలేత మావిచిగుళ్లు తింటే సంవత్సరమంతా సంతోషంగా ఉంటారని శాస్త్రోక్తి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement