బాపు దర్శకత్వంలో కృష్ణ–జయప్రద జంటగా నటించిన సినిమా ఇది. ‘నా పేరు బికారి నా దారి ఎడారి’ పాట ఉన్న ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...
బాగా ఆకలితో ఉన్న ఆ నిరుద్యోగి హోటల్లో కూర్చున్నాడు. అతని వాలకం చూస్తే ఎంతపెడితే అంత తినేలా ఉన్నాడు. కానీ జేబులో డబ్బులు అంతంతమాత్రంగానే ఉన్నాయి...అందుకే ఆచితూచి తినాలి...ఆకలి తీర్చుకోవాలి. సర్వర్ పోయాల వద్దా అన్నట్లు ఇడ్లీలో సాంబారు పోస్తున్నాడు.‘‘ఏమయ్యా...కనీసం తడవనన్నా లేదు. ఇంకొంచెం పొయ్యవయ్యా...ఏంటయ్యా నీ తాతగారి సొమ్ము పోయినంతంగా ముఖం పెడుతున్నావు... ఇంకాస్త పొయ్యి. ముక్కలేయవయ్యా’’ అరుస్తూనే ఉన్నాడు నిరుద్యోగి.‘‘సాంబార్‌లో ముక్కలెక్కడ వస్తాయి! ఆరోజులు ఎప్పుడో పోయాయి’’ అన్నాడు సర్వర్.ఆ తరువాత ‘‘కాఫీయా టీయా’’ అని అడిగాడు.‘‘కాఫీలో పాలెమన్నా ఉన్నాయా? అవి కూడా నీళ్లా?’’ సందేహంగా అడిగాడు నిరుద్యోగి.‘‘కాఫీలో పాలా! పోసేవాడే నీళ్లు పోస్తుంటే ఇక పాలెక్కడివి!!’’ అని గొప్ప సత్యం చెప్పి కాఫీ తీసుకురావడానికి కిచెన్ రూమ్‌లోకి వెళ్లాడు సర్వర్.
కాఫీ తాగి బిల్లు కట్టి వెళుతున్నప్పుడు ఒక పెద్దాయనను చూశాడు. అతడి వాలకంబట్టి చూస్తే అతడే ఈ హోటల్‌కి ఓనర్ అనిపిస్తుంది. అతడు గట్టిగా అరిచాడు...‘‘ఒరే రంగయ్యా...నరసింహం ఏడిరా?’’‘‘అదిగోనండి...’’‘‘ఒరేయ్ నరసింహం....వెంకాయమ్మ ఈ సరుకులేవో కావాలంటుంది. ఇదిగో చూడు...’’నరసింహాన్ని చూడగానే నిరుద్యోగి కళ్లు సంతోషంతో మెరిశాయి.ఈలోపు బయటికి వెళ్లాడు నరసింహం.అతడిని అనుసరిస్తూ వెళ్లాడు నిరుద్యోగి.కొబ్బరిచెట్ల దగ్గర ‘‘ఒరేయ్ సింహం...నరసింహం’’ అని గట్టిగా పిలిచాడు.నరసింహం వెనక్కి తిరిగిచూశాడు.‘‘అరే మ్యాచూ...నువ్వా!’’ అన్నాడు ఆశ్చర్యంగా నరసింహం.‘‘నిన్ను చూడగానే నా ప్రాణం లేచివచ్చినట్లుయిందిరా. హోటలంతా నీ చేతుల మీదే నడుస్తున్నట్లుగా ఉందే’’ అన్నాడు మ్యాచూ.‘‘ఇప్పుడు నేను ఆ హోటల్‌కి మేనేజర్‌ని’’ కాస్త గర్వంగా అన్నాడు నరసింహం.‘‘అమ్మానాన్నా బాగున్నారా? ఏంపని మీద ఊరికి వచ్చావు?’’ అని అడిగాడు.
‘‘ఉద్యోగం కోసం వచ్చాను. ఆ సంగతే నీతో మాట్లాడుదామని...’’ గొణికాడు మ్యాచూ.‘‘ఇప్పుడు అర్జంటుగా పనిమీద వెళుతున్నాను. సాయంత్రం నెహ్రూపార్క్‌లో కలుసుకుందాం.అక్కడ మాట్లాడుకుందాం’’ అని అర్జంటుగా వెళ్లాడు నరసింహం.∙∙ పార్క్‌లో...‘‘నెల అయిందా వచ్చి! అది సరే 50 రూపాయలతో నెల రోజులు ఎలా లాక్కొచ్చావు!’’ ఆశ్చర్యంగా స్నేహితుడిని అడిగాడు నరసింహం.‘‘ఏముందీ..భోజనం మానేశాను. టిఫిన్ మాత్రమే తింటున్నాను. జేబులో ఇంకా పది రూపాయలు ఉన్నాయి. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. సిఫారసు లేనిదే ఉద్యోగం దొరికేట్లు లేదు. ఇదీ నా కథ. నిరుద్యోగి కథ’’ ఉన్నదంతా చెప్పాడు మ్యాచూ.‘‘ఇదా సంగతి. నువ్వేదో పే..ద్ద ఉద్యోగం చేస్తున్నావని మమ్మల్ని మించిపోయావని అనుకున్నాను’’ అన్నాడు నరసింహం.‘‘కాలేజీలో ఉండగా చదువుకోని వాళ్లు నాకు మనుషులుగానే కనిపించేవారు కాదు. ఇక డిగ్రీ వచ్చిన రోజు సరేసరి. ఈ డిగ్రీ చేతబట్టుకొని ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నట్లుగా కలకన్నాను. నా చూపులు పైనే ఉండేవి కాని కిందకు దిగేవి కావు. నాఅంత లేడనుకునేవాడిని.
ఇప్పుడు నేను ఉద్యోగం కోసం తిరుగుతున్నప్పుడు తెలిసింది నేనెంత అల్పుడినో! ఆఖరికి ఆఫీసు బంట్రోతు కూడా నన్ను పురుగులా చూస్తున్నాడు’’ మనసులోని ఆవేదనంతా స్నేహితుడితో చెప్పుకున్నాడు మ్యాచూ.‘‘నీ కథ వింటుంటే బాధగానే ఉంది. కానీ ఇప్పుడు ఉద్యోగాలేమీ లేవు కదా’’ బాధపడుతూనే చేతులెత్తేశాడు నరసింహం.‘‘లేకేం! ముందు నాకో సర్వర్ ఉద్యోగం పారేయ్. తింటానికి ఉంటానికి ఒక చోటు దొరుకుతుంది’’ అడిగాడు మ్యాచూ.‘‘రేయ్...నీకేమైనా మతిపోయిందా! బీయే పాసై సర్వర్ ఉద్యోగం చేస్తావా?’’ ఆగ్రహించాడు నరసింహం.‘‘మహారాజులా చేస్తాను. అదిమాత్రం ఉద్యోగం కాదా’’ అన్నాడు మ్యాచూ.నరసింహానికి మళ్లీ కోపం వచ్చింది.‘‘చేయడానికి నీకు అభ్యంతరం లేకపోయినా...ఇవ్వడానికి నాకు సిగ్గుగా ఉంది’’ తప్పించుకోవాలని చూశాడు నరసింహం.అంతమాత్రాన మ్యాచూ ఊరుకుంటాడా ఏమిటి?‘‘నీకెందుకురా సిగ్గు! మేడ మీద ఉద్యోగం సంపాదించాలనుకున్నాను. దొరకలేదు. ఇప్పుడు కింది నుంచి మొదలుపెట్టాను. ఇది మొదటి మెట్టు. ఎవరూ నిచ్చెన ఒక్కసారి ఎక్కలేరు కదా!’’ అంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు మ్యాచూ.
కొద్దిసేపు వాదోపవాదాల తరువాత ఎట్టకేలకు నరసింహం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.∙∙ మొత్తానికైతే మ్యాచూకు సర్వర్ ఉద్యోగం దొరికింది.‘‘ఏయ్ అబ్బాయ్, ఇదేమిటి? ఇడ్లి తెమ్మంటే దోశ తీసుకొచ్చావు’’ విసుక్కున్నాడు కస్టమరుడు.‘‘ఇడ్లి చల్లారిపోయిందండీ. మసాల దోశ వేడివేడిగా ఉంది....బాగుంది’’ అన్నాడు సర్వర్ మ్యాచూ.నిజానికి ఇడ్లి చల్లగా లేదు. అతనొకటి ఆర్డర్ ఇస్తే ఇతనొకటి విన్నాడు! తప్పును కవర్ చేసుకునేందుకు ‘వేడి వేడి దోశండీ. ప్రొప్రైటర్‌గారి కోసం స్పెషల్‌గా చేయించామండీ’’ అని కస్టమర్‌ను బుట్టలో వేశాడు మ్యాచూ.హోటల్లో పనిచేసే వాళ్లు ఆ రాత్రి డాబాపై సంగీత కచేరి పెట్టారు. వాళ్లదగ్గరికి వెళ్లారు మ్యాచూ, నరసింహం.‘‘ఆపండ్రా మీ కాకిగోల’’ అరిచాడు నరసింహం.‘‘కాకిగోలా ఇది? కోకిలగానం’’ అని ఆత్మవిశ్వాసం ప్రకటించాడు ఆ సంగీతకారుడు.‘‘మీ పాటకు కింద గాడిదలు చేరుతున్నాయి’’ అని కూడా అన్నాడు నరసింహం.‘‘ఔరంగజేబును చంపి పుట్టావయ్యా. సంగీతం చచ్చిపోయింది అని ఆయనకు ఎవరో చెబితే లోతుగా పూడ్చిపెట్టమని చెప్పాడట’’ వ్యంగ్యంగా అన్నాడు సంగీతకారుడు.అందరూ పెద్దగా నవ్వారు!
Comments
Please login to add a commentAdd a comment