
ముక్కాలా... మెహబూబా... ముకాబులా... ఓ మెహబూబా!
‘ప్రేమికుడు’ సినిమాలో ‘ముకాబులా’ పాటను పాడించడానికి గాయకుడు మనోను ఒక రాత్రి స్టూడియోకు పిలిపించాడు రెహమాన్.
‘ప్రేమికుడు’ సినిమాలో ‘ముకాబులా’ పాటను పాడించడానికి గాయకుడు మనోను ఒక రాత్రి స్టూడియోకు పిలిపించాడు రెహమాన్. పాటకు ఏవో రిపేర్లు జరుగుతుండడంతో సోఫాలో ఒక కునుకేశాడు మనో. కొద్దిసేపటి తరువాత ఆఫీసుబాయ్ నిద్రలేపి ‘సార్ రమ్మంటున్నాడు’ అన్నాడు. అప్పుడు సమయం రాత్రి ఒంటిగంట దాటింది. ‘‘ఈ టైమ్‌లో పాటేం పాడుతామురా దేవుడా’’ అని గొణుక్కుంటూ నిద్రమత్తుతో రెహమాన్ దగ్గరికి వెళ్లాడు మనో.
మరోవైపేమో రెహమాన్ మాంచి జోష్‌లో ఉన్నాడు. ‘బాస్ రెడీ కమాన్’ అంటున్నాడు. పియానో మీద ఒక ట్యూన్ వాయించి ‘లిరిక్స్ రాసుకో’ అన్నాడు. ‘‘సమ్‌థింగ్ డిఫరెంట్‌గా పాడాలి. అరిచినట్లుగా ఉండకూడదు. కానీ షౌటింగ్ ఉండాలి’’ అన్నాడు రెహమాన్. ఈ దెబ్బకు నిద్ర అడ్రస్ లేకుండా ఎగిరిపోయింది. ‘‘డిఫరెంట్‌గా అంటే ఎలా? ఘంటసాలలాగా, సౌందరరాజన్‌లాగా పాడమంటారా?’’ అడిగాడు మనో. ‘‘నో నో’’ అన్నాడు రెహమాన్.
అప్పుడు సమయం రెండున్నర దాటింది. ‘‘టీ తాగొస్తాను’’ అని ఆఫీసు నుంచి బయటికి వచ్చాడు మనో. ‘‘ఏ వాయిస్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది’’ ఆలోచించుకుంటూ వచ్చాడు. అక్కడొక వాచ్‌మన్ చిన్నట్రాన్సిస్టర్ పెట్టుకొని పాట వింటున్నాడు. ఆర్.డి. బర్మన్ ‘షోలే’ సినిమాలో పాడిన ‘మెహబూబా మెహబూబా’ పాట అది. ‘అబ్బ! దొరికేసింది’ అనుకొని వేడి వేడిగా టీ తాగి హుషారుగా వెళ్లి ‘మెహబూబా’ పాటలో బర్మన్ వాయిస్ ఫ్లేవర్‌తో ‘ముక్కాలా ముకాబులా’ పాట పాడి శబ్బాష్ అనిపించుకున్నాడు మనో!