జీవితపు కొత్త సరిహద్దు | new border line to life | Sakshi
Sakshi News home page

జీవితపు కొత్త సరిహద్దు

Published Sun, Dec 22 2013 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM

జీవితపు కొత్త సరిహద్దు

జీవితపు కొత్త సరిహద్దు

ఆజన్మం

 ఈ క్షణంలో బతకడాన్ని కొంతమంది గ్లోరిఫై చేస్తారెందుకు? (‘ఈ రోజే నాకు ముఖ్యం’. ‘రేపటి గురించి ఆలోచించను’.)
 ఈరోజు గురించే ఆలోచించేవాళ్లయితే... ఇవ్వాళ్టికోసం నిన్న డ్రెస్ ఎందుకు ఉతుక్కోవాలి? ఇన్సూరెన్స్ ఎందుకు చేయించాలి? గ్యాస్ కోసం ఫోన్ ఎందుకు చేయాలి?
 ‘ఈ క్షణం’ అని వాచ్యంగా చెబుతున్నది కాకుండా- దీనికి మించినదేదో తీసుకోవాలన్న అవగాహన నాకుంది. కానీ, నాకు అనిపిస్తున్నదేమంటే- పట్టింపు లేనట్టుగా ఉండటంలో ఒక ఫిలాసఫర్‌లాగా కనబడతాం; ఒక యోగిక్ గ్లామర్ ఏదో అందులో ఉంది; అంతే తప్ప మళ్లీ అన్నీ కావాలి!
 పోనీ, ఈ క్షణంలో జీవించడం, అంటున్నప్పుడు- రేపు చనిపోయినా సరే, అన్న భావనైనా దృఢంగా ఉంటుందా! మృత్యుభయాన్ని ఏ కొంతైనా అనుభవించినవాళ్లు అలా మాట్లాడగలరా? ఇటీవల కొన్ని అకాల మరణాలను చూస్తున్నాను. తీవ్రమైన వెన్నునొప్పి బాధించినప్పుడు- అలాంటి ‘మృత్యుభయం’ నాక్కలిగింది!
 
 శరీరం చిన్నగా కంపిస్తుంది. శ్వాసవేగం తగ్గుతుంది. కొక్కెం వేసి బలంగా లాగితే తప్ప ముందుకు రాదన్నట్టుగా ఊపిరి బరువుగా వస్తుంది. స్థిరత్వాన్ని పొందడంలో మనసు విఫలమవుతుంది. నిర్లిప్త దృశ్యాల సమాహారం కదలాడుతుంది. గుండెలు పొడిబారుతాయి. చెవులు వేడెక్కుతాయి. చర్మానికీ లోపలి భాగాలకూ సంబంధం తెగిపోయినట్టు ఉంటుంది. అరికాళ్ల నుంచి మెదడుదాకా ఏదో ఖాళీతనం!
   
 ‘డిగ్రీ’లో నేనో ఆటోగ్రాఫ్ బుక్ డిజైన్ చేశాను. అందులో ఒక కాలమ్ ఇలా ఉంటుంది: ‘మీరెప్పటిదాకా బతకాలనుకుంటున్నారు?’ జీవితం మీద పెద్ద అంచనాలేమీ లేవన్న కసిని చాటాలనేమో! 2010 వరకు ఉంటే చాలని రాసినవాళ్లు కూడా ఉన్నారు.
 
 మనిషి ఆయుఃప్రమాణం వందేళ్లని చెప్పుకోవడంలో ఇంకా అర్థం లేదు. ఎన్నాళ్లీ వందేళ్ల మిత్? మా తరం వాళ్లం ‘అరవై’ అనే హద్దుకే సరిపెట్టుకోవాలేమో! కాలుష్యం, ఒత్త్తిళ్లు, విషపుతిళ్లు, రివిజనిజం లేని నాగరికతలను ఈ ‘తగ్గింపు’కు కారణంగా చూపించడం తేలికే! కానీ, ఏది ఎందుకు జరుగుతుందో- అది అందుకే జరుగుతుంది; తిరిగి, ఏది ఎందుకు విరుగుతుందో- అది అందుకే విరుగుతుంది. కాకపోతే, వాటి ప్రభావాన్ని విధిగా భరించాల్సినవాళ్లముగా ఈ ‘నిర్ణయం’ తీసుకోక తప్పడం లేదు. కాబట్టి, రేపెప్పుడో రాజిరెడ్డి అర్ధంతరంగా కన్నుమూస్తే- ఈ కొత్త నిష్పత్తి ప్రకారం, 36 ఏళ్లు కాదు, ‘అరవై శాతం’ బతికాడనే అర్థం! ఇది కొంత దుఃఖం కలిగిస్తున్నమాట నిజమే! కొంతేమిటి, చాలానే దుఃఖం కలిగిస్తోంది. కానీ ఇంతకంటే వాస్తవం భిన్నంగా ఉండబోదని నమ్మకంగా అనిపిస్తున్నప్పుడు దీన్ని నిరాకరించడం ఎలా?
   
 మొన్న దసరాకు ఊరెళ్లినప్పుడు- మా కొత్త లింగయ్య తాత- చాలా ఏళ్ల కిందటి తన ‘ఆత్మహత్య అనుభవం’  చెప్పాడు. ఆయన అలాంటి దుడుకు సాహసానికి ఒడిగట్టబోయాడని అంతకుముందు తెలీదు. ‘‘పెద్ద గత్తరకు ముందు- నా.లు.గెడ్లు దొడ్లెకురికచ్చి సచ్చినై. గడ్డికుప్ప గాలింది. రెండు ఇంజిన్లు కరాబైనై. నాలుగెకరాల పంట పెట్లెండింది. ‘ఛీ, ఇగ బతుకద్దురా’ అనుకున్న. పగ్గం దెచ్చుకున్న. ఎవలకు జెప్పలె. ఈళ్లందరు (రాత్రి) నిదుర వోయినంక ఎటన్న వోయి ఏసుకుందమనుకున్న. అ.ట్ల. ఒరిగిన. అటే నిద్ర వట్టింది. ఇద్దరచ్చిండ్రు. ఇద్దరు లాగులే ఏసుకున్నరు. నలుపు వర్ణంలున్నరు. ‘వారీ ఈ పగ్గం దీస్కపోతన్నం,’ అన్నరు. ‘నీకింక ముందట మంచిరోజులున్నై,’ అని జెప్పిన్రు. తెల్లారి జూస్తే- ఇంట్లేసిన పగ్గం దొడ్లుంది!’’
 తన లోపలి బతకాలన్న కాంక్షను కల ఊతంగా తిరిగి బలోపేతం చేసుకునివుంటాడా! అలాంటి కారణమేదైనా గట్టిగా లాగేదాకా, నేను ఈ ‘అరవై’లోనే ఉండిపోకతప్పదు!
 కలనీ, మెలకువనీ కలిపేస్తోన్న ఆ పగ్గం గురించిన ప్రశ్నలు మాత్రం- ఆయనకూ, నాకూ మధ్యగల విశ్వాసభేదాల్లోకి తీసుకెళ్లాయి. ఆయనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు; నేను నిజమని నమ్మాల్సిన బలవంతం లేదు. సెలవు.
 
 పోనీ, ఈ క్షణంలో జీవించడం, అంటున్నప్పుడు- రేపు చనిపోయినా సరే, అన్న భావనైనా దృఢంగా ఉంటుందా! మృత్యుభయాన్ని ఏ కొంతైనా అనుభవించినవాళ్లు అలా మాట్లాడగలరా?
 - పూడూరి రాజిరెడ్డి
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement