ఆవిష్కరణం: వస్తువు విలువ పెరిగిన ప్పుడు పుట్టింది!
‘పర్స్’ విలువైన, ముఖ్యమైన వస్తువులను జాగ్రత్తగా దాచుకోవడానికి ఉపయోగించుకొంటున్నాం. మరి ఈ ఉపయోగాన్ని బట్టి మానవ నాగరికతలో ‘వస్తువు’కు విలువ పెరిగిన సమయంలో పర్స్ ప్రస్థానం మొదలైందని అనుకోవాలి. ఎందుకంటే... దీని పుట్టుక తేదీ ఇదీ అని ఎవరూ తేల్చలేదు. ద్రవ్యం లేదా కరెన్సీలు వాడకంలోకి వచ్చాక మాత్రం పర్స్ వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి అనేక రూపాంతరాలున్నాయి. తొలినాళ్లలో నాణెంలు దాచుకోవడానికి బుల్లిబుల్లి బ్యాగ్‌లను ఉపయోగించేవారట. పద చరిత్ర ప్రకారం‘బుర్సా’అనే లాటిన్‌పదమే పర్స్‌గా పరిణామం చెందింది.
ఇప్పుడు పురుషులు, మహిళలు, చిన్నపిల్లలు అంటూ రకరకాల పర్స్‌లు అందుబాటులోకి వచ్చాయి కానీ.. 17 వ శతాబ్దం వరకూ పర్స్ అంటే ఒకటే రూపమే, అందరూ ఉపయోగించుకొనేదే. 17 వ శతాబ్దంలో పర్స్‌లకు ఎంబ్రైడరీ వర్క్ చేయడం మొదలుపెట్టారు మహిళలు. అప్పటి నుంచి పర్స్‌లలో మహిళలు, పురుషులూ అంటే లింగభేదం మొదలైంది. మహిళల పర్స్‌లు హ్యాండ్‌బ్యాగ్‌లుగా రూపాంతరం చెంది స్టైల్స్‌తో భుజానికి తగిలించుకొనేవిగా మారితే, పురుషుల పర్స్‌లు జేబులో ఇమిడిపోయాయి. వీటికి ఒకే రూపం లేకపోవడం వల్ల పేటెంట్ చక్రంలో ఇవి బంధింపబడలేదు. పర్స్‌ల చరిత్ర విషయానికి వస్తే క్రీస్తు పూర్వం 3,300 సంవత్సరాల క్రితమే పర్స్‌లను ఉపయోగించినట్టు దాఖలాలు ఉన్నాయి. అప్పటి వాడైన ఓట్జి అనే వ్యక్తి మమ్మీలో తోలుతో కుట్టిన ఒక పర్స్ కనిపించింది. ప్రస్తుతానికి పర్స్ చరిత్రకు సంబంధించి ఉన్న దాఖలాలు అవే.