బలరామ సత్యభామల గర్వభంగం! | Satyabhama garvabhangam | Sakshi
Sakshi News home page

బలరామ సత్యభామల గర్వభంగం!

Published Sat, Oct 22 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM

బలరామ సత్యభామల గర్వభంగం!

బలరామ సత్యభామల గర్వభంగం!

ముక్కోపిగా, ముఖస్తుతికి లోబడే వ్యక్తిగా మహాభారతంలో కనిపించే బలరామునిలో తన శౌర్యపరాక్రమాలపై మితిమీరిన విశ్వాసం. కృష్ణుని ప్రియపత్నిగా పేరొందిన సత్యభామకు తన అందచందాలమీద ఎనలేని నమ్మకం. వీరికి తగిన గుణపాఠం చెప్పేందుకు శ్రీకృష్ణుడు సమయం కోసం ఎదురు చూస్తుండగా తగిన అవకాశం ఆంజనేయుడి రూపంలో రానే వచ్చింది.
 
 త్రిలోక సంచారి అయిన నారదుడు నారాయణ నామస్మరణ చేస్తూ వెళ్తుండగా ఆ దాపులనే  రామనామాంకిత ధ్యానంలో మునిగిపోయి ఉన్న ఆంజనేయుడు కనిపించాడు. నారదుడు కావాలనే  శ్రీరామ స్మరణ చేశాడు. రామనామం వినగానే ఆంజనేయుడు పరుగున వచ్చి నారదుని ముందు వాలి, ‘‘ఓ రుషిపుంగవా, నా రామయ తండ్రి నామాన్ని స్మరిస్తున్నావంటే నీకు తప్పకుండా రామునితో అవినాభావ సంబంధం ఉండే ఉంటుంది. నా స్వామిని చూసి చాలా కాలం అవుతోంది. ఒక్కసారి ఆయనను దర్శించుకోవాలని నా మనస్సు కొట్టుకులాడుతోంది. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పగలవా?’’ అంటూ అర్థించాడు.
 
 ‘‘ఓ వానరా! రాముణ్ని నేను చూసి కూడా చాలా కాలమయింది. అయితే రామునికంటే అధిక శౌర్యపరాక్రమాలు కలవాడు, సీతమ్మకన్నా అందమైనదీ అయిన శ్రీకృష్ణ సత్యభామలు సమీపంలోనే ఉన్నారు. చూడాలనుంటే చెప్పు, తీసుకెళతాను’’ అన్నాడు.‘‘ఏమిటీ, నా రామయ్య తండ్రి కన్నా బలమైనవాడు, సీతమ్మ తల్లికన్నా సౌశీల్యమైన  స్త్రీ మరొకరున్నారా? నన్నొకసారి అక్కడికి తీసుకెళ్లు. నేను చూసిన తర్వాత వారు అలా లేకపోవాలీ, నీ పని చెబుతాను’’ అంటూ నారదునితో కలసి ద్వారకను చేరాడు.
 
 ఆంజనేయుడు బయటేఉండి, ‘‘రామబంటునైన నేను అన్యుల మందిరానికి రాను. నీవే నీ కృష్ణుని ఇక్కడకు రమ్మను’’ అంటూ నారదుని లోనికి పంపించాడు. నారదుడు రాజప్రాసాదానికేగి, సత్యభామాసమేతంగా బలరాముడి చెంత ఆసీనుడైన గోపాలకృష్ణుని చూస్తూ ‘‘కృష్ణా! హనుమంతుడనే ఒక వానరాగ్రగణ్యుడు నీ దర్శనం కోసం ద్వారంలో వేచి ఉన్నాడు. అతడు మిమ్మల్నే తన కడకు రమ్మంటున్నాడు. ఒకవేళ రాకపోతే నీ మందిరాన్ని నాశనం చేసి, ద్వారకను సముద్రంలో ముంచేస్తానంటున్నాడు. నువ్వు త్వరగా పద, ఆ వానరాగ్రేసరుడిని దర్శించుకుందువు’’ అంటూ తొందర చేశాడు నారదుడు.
 
 అహకారంలోనూ, మితిమీరిన ఆత్మాభిమానంలోనూ ఒకరికొకరు ఏమాత్రం తీసిపోని సత్యభామ, బలరాములు వెంటనే అమితాగ్రహంతో ‘‘నారదా! ఒక వానరం వస్తే, వానిని చూడటానికి కృష్ణుడే స్వయంగా వెళ్లాలా? అలా రాకపోతే ఆ కోతి ద్వారకనే పెళ్లగించి సముద్రంలో పడేస్తుందా? ఏమిటీ వింత? ముందు నేనెళ్లి, వాడి సంగతి తేలుస్తాను’’ అంటూ తన హలాయుధాన్ని భుజానేసుకుని బయటికొచ్చాడు బలరాముడు. అతణ్ణి అనుసరించబోయింది సత్యభామ.
 
 బలరాముడు బయటకు వచ్చి, ఆంజనేయుణ్ణి చూసి, ‘‘ఓయీ, వృద్ధ వానరమా! నా తమ్ముడు కృష్ణుని చూడటానికి వచ్చి అతనినే బయటకు రమ్మంటున్నావా? నీకెంత అహంకారం? నువ్వు ద్వారకనే సముద్రంలో ముంచెయ్యగలిగేంత మొనగాడివా? ముందు నన్ను గెలువు, ఆ తర్వాత బతికుంటే చూద్దువుగాని’’ అంటూ దూసుకురాబోయిన బలరాముణ్ణి హనుమ తన తోకతో చుట్టి విసిరికొట్టబోతుండగా, నారదుడు ‘‘హనుమా! లోపల ఉన్నది రాముడే, ఈయన అతనికి ప్రియ సోదరుడు సుమీ’’ అంటూ హెచ్చరించాడు. హనుమ వెంటనే బలరాముణ్ణి తన భుజాల మీద కూర్చుండబెట్టుకుని లోపలకు దారితీశాడు. ఈ లోగా కృష్ణుడు సత్యభామతో ‘‘భామా! నువ్వు సీతమ్మలా అలంకరించుకునిరా’’ అంటూ తాను రామునిలా రూపు మార్చుకున్నాడు.
 
 ఈలోగా హనుమలోనికి రానే వచ్చాడు. వస్తూనే కృష్ణునికి నమస్కరించి, ‘‘ఎన్ని యుగాలయ్యింది స్వామీ నిన్ను చూసి?’’ అంటూ గాఢాలింగనం చేసుకుని, ‘‘నీ పక్కనే ఉన్న ఈమె ఎవరు స్వామీ ఎంతో వికారంగా ఉన్నా, ఇన్ని నగలు అలంకరించుకుని ఉంది? ఇంతకూ నా తల్లి సీతమ్మ ఎక్కడ’’ అంటూ ప్రశ్నించాడు.
 
 సరిగ్గా అప్పుడే మందిరంలోనికి అతి సామాన్యమైన చీర, కట్టుబొట్టు... ప్రశాంతమైన ముఖం, పెదవులపై  చిరునగవే ఆభరణాలుగా ప్రవేశించిన రుక్మిణిని చూస్తూనే హనుమ ‘‘వచ్చావా సీతమ్మా’’ అంటూ చివాల్న ఆమె పాదాల మీద వాలిపోయాడు. హనుమ తోకతో చుట్టివేయడంతోనే ఒళ్లంతా ఉండచుట్టుకుపోయిన వీరాధివీరుడు, బలాఢ్యుడు అయిన బలరాముడు, అతిలోక సౌందర్యరాశి, ఐశ్వర్యవంతురాలు అయిన సత్యభామలు సిగ్గుతో తలలు వంచుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement