సింగిల్ సెలబ్స్...
బాలీవుడ్ బీట్
పెళ్లి ప్రస్తావన తెస్తే చాలు చాలామంది హీరోయిన్లు ‘మాకింకా పెళ్లి చేసుకునే వయసు రాలేదు’ అని బుకాయిస్తారు. కెరీర్ ఇక చరమాంకంలో పడిన సూచనలు కనిపించగానే, చెప్పాపెట్టకుండా పెళ్లి చేసుకుని, తెరమరుగైపోతారు. కొందరు హీరోయిన్లు మాత్రం చాలా భిన్నంగా ఉంటారు. పెళ్లితో పనేముంది? సోలో బతుకే సో బెటరని డిసైడైపోయి, తమకు నచ్చినరీతిలో బతుకుబండిని బ్రహ్మాండంగా పూలతేరులా లాగిస్తుంటారు.
బాలీవుడ్‌లో అలాంటి అరుదైన సింగిల్ సెలబ్రిటీల గురించి...
ప్రీతీ జింటా
సాటి హీరోయిన్లతో పోల్చుకుంటే సొట్టబుగ్గల సుందరి ప్రీతీ జింటా చేసిన సినిమాలు తక్కువే అయినా, వార్తల్లో ఆమె రేపిన కలకలం తక్కువేమీ కాదు. సైనికాధికారి కూతురైన ప్రీతీ 1997లో మణిరత్నం దర్శకత్వంలోని ‘దిల్ సే’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తెలుగులో ‘ప్రేమంటే ఇదేరా’, ‘రాజకుమారుడు’ చిత్రాల్లో నటించింది. సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనే ప్రీతి... కింగ్స్ ఇలెవెన్ పంజాబ్ క్రికెట్ టీమ్ నిర్వహణతో సంతోషపడిపోతోంది. ఆ ధ్యాసలో పడి పెళ్లిని మర్చిపోయినట్లుంది.
సుస్మితా సేన్..
విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకోవడమే తడవుగా సుస్మితా సేన్‌కు బాలీవుడ్ రెడ్‌కార్పెట్ పరిచింది. ‘దస్తక్’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సుస్మితా తెలుగు సహా దక్షిణాది చిత్రాల్లోనూ నటించింది. కెరీర్ తొలినాళ్లలోనే 2000 సంవత్సరంలో తన పాతికేళ్ల వయసులో రెనీ అనే పాపను దత్తత తీసుకుంది. ఈ దత్తత వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో న్యాయపోరాటం సాగించి మరీ బాంబే హైకోర్టు తీర్పుతో దత్తత హక్కులు సాధించుకుంది. మళ్లీ 2010లో అలీసా అనే మరో పాపను దత్తత తీసుకుంది. సింగిల్ మామ్‌గా ఇద్దరు పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే, సినీ రంగంలోనూ తన సత్తా చాటుకుంటోంది.
టబు
నాలుగు పదులు నిండినా, వన్నెతరగని టబు విలక్షణ చిత్రాలతో ఇప్పటికీ తన ఉనికి చాటుకుంటోంది. తొమ్మిదేళ్ల వయసులో బాలనటిగా 1980లో ‘బాజార్’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఐదేళ్లకు ‘హమ్ నౌజవాన్’లో దేవానంద్ కూతురిగా నటించింది. తెలుగులో ‘కూలీ నం-1’ చిత్రం ద్వారా 1987లో హీరోయిన్‌గా పరిచయమైంది. పలు భాషల్లో కమర్షియల్ బ్లాక్‌బస్టర్లతో పాటు పలు విలక్షణ చిత్రాల్లో సత్తా చాటుకుంటోంది. కానీ పెళ్లి మాటెత్తడం లేదు.
రైమా సేన్
అమ్మమ్మ సుచిత్రా సేన్, తల్లి మూన్‌మూన్ సేన్‌ల నుంచి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రైమా సేన్, 1999లో ‘గాడ్‌మదర్’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. తెలుగులో ‘ధైర్యం’ చిత్రంలో నటించింది. హిందీ, బెంగాలీ చిత్రాల్లో అడపా దడపా నటిస్తూనే ఉన్నా, ఆమె ఖాతాలో చెప్పుకోదగ్గ బ్లాక్‌బస్టర్స్ పెద్దగా లేవు. రైమా చెల్లెలు రియా కూడా బాలీవుడ్‌లో రాణిస్తోంది. రైమాలో తల్లి పోలికల కంటే అమ్మమ్మ పోలికలే ఎక్కువ. ఈమె సోలో లైఫ్‌కు కారణాలైతే చెప్పనేలేదు.