‘ఆకాశవాణి కడప కేంద్రం... ఇపుడు మీరు వినబోయే పాట లక్ష్మి నివాసం చిత్రం లోనిది... గీత రచన శ్రీ ఆరుద్ర. సంగీతం శ్రీ కె.వీ.మహదేవన్. ధనమేరా అన్నిటికీ మూలమ్... ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం....ధనమేరా అన్నిటికీ......... మూ ల...మ్....l
ఎం నారాయణమ్మవ్వా కూడు తిన్యావూ?
అబుడే ఆకేసుకొని నిమ్మలంగా రేడియో ఇంటా కూకున్యవ్? బట్టీ కాడికి బోలా? అంటా చేతిలో గిన్నె బట్టుకుని వచ్చింది ఎదురింటి సత్తెమ్మ.
‘ల్యా, తిన్లా, నువ్ ఎందో తెచ్చావ్, నాకు పెడ్తవనీ కాస్కోని అట్టే కూకుని వుండాలేమ్మే’ అంది నారాయణమ్మ ఎగతాళిగా నవ్వుతా!
‘నీకు పెట్టకేం లేవ్వా! రోంత చెనిక్కాయ ఊరిబింమ్డి నూరుకుందెమని నీ రోటికాటికి వచ్చినా లే! అద్దో తుమ్మమాను కింద పొయ్యి మీంద, సట్టిలో సంగటికి పెట్టినా! అయితానె గెలికి యేడేదిగా నీగూఢ్ఖ పెడ్తాలే’ అంది సత్తెమ్మ గూడా నవ్వుతా!
‘పెట్టినంత మాట జెప్పినావు లేమ్మే! సాల్లే! నేను తిన్యా గానీ..నువ్ బోయ్ బెన్నా దినుబో, కుడేళ దాటి పాయ’ అంది నారాయణమ్మ.
నారాయణమ్మకు నా అనే వోళ్లు ఎవరూ లేరు. భర్త వెంకటయ్య చాల యేండ్ల కిందటే కాలంజేశాడు. పిల్లలు గూఢ్ఖా లేరు. వున్నీకి మాత్తరం తనకి ముసలాయన కాలంలో కట్టిన రెండు బోధ కొట్టాలు వుండాయి.
వొక్క దానికి రెండేమిటికి అనీ...వోటి తను ఉండీ, పక్కనున్న కొట్టం ఇంగోటి కాలేజీలో బుద్దిగా సదువుకునే పిల్లోలకి నూటాభై రూపాయల్కి బాడుక్కిచ్చింది.
అరబై సంచ్చరాలు దాటినా నారాయణమ్మ ఆరోగ్గింగా ఉంటుంది. చూన్నీకికెప్పుడూ గుళ్లో దేవతికి మల్లే పశాంతంగా చిర్నవ్వతాంటది.
నారాయణమ్మ వారొంలో మూడు దినాలు సున్నం బట్టీ బెడుతుంది. మిగతా దినాలు గంపదీసకపొయ్ పచ్చి సున్నం రాళ్ళు గొట్టిదెచ్చుకోనీకీ బోతాది. ఆదోరం వొక దినం మాత్తరమే ఊల్లో రచ్చబండగాడ సిమెంటు పట్టా పర్సుకొనీ, ఓ పక్క కాల్చిన సున్నం రాళ్ళూ, ఇన్గో పక్కన సున్నం పొడి అమ్ముతా....అట్టా కాలం ఎల్లదీస్తుంది.
నారాయణమ్మ కొట్టంకి ఎదురుమల్లే వున్న ముప్పై సెంట్ల స్థలమంతా ఆమెదే కావడంతో తుమ్మ కంప పెరిగి, తొండలు గుడ్లు పెట్టి అట్టా ఉత్తగా పడుండడం ఏంటికిలేనీ, సైకిల్ పై ఊరంతా తిరుగతా పాత ఇనప, పిలాస్టికు డబ్బా రేకులకూ, అంటు మాడికాయలూ, తెల్లవాయలూ అమ్ముకుని బతికే సంచారులకీ, చిక్కెంట్రుకలకి పిన్నీసులూ, బుడగలు అమ్ముతా దిరిగే బీద, బిక్కీ జనెంకి ఊల్లో వున్నెంతకాలం వుండనీకి గుడిసెలేసుకునే దానికి ఆ స్థలమిచ్చింది. అందుకే ఆ జనెమంతా నారాయణమ్మవ్వా అంటా ఆదరంగా జూచ్చారు.
నారాయణమ్మ ఇచ్చిన తావులో గుడిసెలు బేసుకున్న సంటిబిల్లల తల్లులు బొద్దున్నే బిడ్డలకి నెత్తికి సమురంటి, కొడుపు నిండుతా పాలిచ్చి, సిలవరి సెరవళ్ళో కట్టెల పొయ్యిపై బాగా మసల్నిచ్చిన ఉడుకునీళ్లతో తానం జేపిచ్చి, అక్కడ గుడిసెల మద్దెన వుండే యాపమాన్లకి చీరలతో ఉయ్యాల గట్టి, పిల్లోలని బండేసి, నిద్ర బోంగానే సైగ్గా తప్పుకుని కూలికి బోయేవాళ్లు.
కోట్టం దెగ్గరున్నపుడు నారాయణమ్మ గుఢ్ఖా వాళ్ళని ఒక కంట కాపెట్టుకొనుండేది. అందుకే వాళ్లకి అవ్వంటే ఇంగా గౌర్వం.
నారాయణమ్మ ఇంటి చుట్టూత పెద్ద పెద్ద శింత, యాపమాన్లూ దండిగా వుండాయి. తనకీ, ఆ మాన్లకి ఏందో దెలీని అనుబంధం ఉందని బో గట్టి నమ్మకం నారాయణమ్మకి.
తాను సూడని అశోకొనంలో సీత కాటిన్నూండీ, తాను ఇష్టంగా వినే ఒసేయ్ రాములమ్మ సినిమాలో...‘రామ చక్కని తల్లి రాములమ్మ పాట’ విన్నెప్పుడూ, కార్ణం(కారణము) ల్యాకున్యా...ఎందుకో మాట్రాని మాన్లే ఆడదాని కట్టాలినే నేచ్చగత్తేలు అనిపిచ్చాది తనకి.
అసలు తనని అడిగితే, మాన్లన్నీ ఆడియే అనిపిచ్చాది తనకి.
‘మొక్క మొలిచింది, మాను అయ్యింది, పువ్వు పూచిందీ, పిందే పెట్టింది’.....అంటాం గానీ మొలిచాడు, పూచాడూ అనం గదూ! అని తనలో తానే అనుకుంటా...తన ఆలోచనకి తానే నవ్వుకుంటా ఉంటాది.
తన కొట్టం ముందురున్న యాప్మాను కిందున్న నడుములెత్తుండే పెద్ద రోట్లో చుట్టు పక్కల వాళ్లందరూ కారమో, పచ్చడో ఎదో ఒకటి ఉదర,బదరా నూరుకుని టిపిను డబ్బాల్లో బెట్టుకుని కూలికి బోయేటోళ్లూ.
కొందరు సనువున్నోల్లయితే అవ్వగ్గుడా రోంత గిన్నెలో దీసి, లోపలకు బోయి గుడిసెలో »ñ ట్టి బొయ్యేటోళ్లూ.
ఓ దినం ఎదురు గుడిసెలోండే ముత్తాలు..ఊరిబింమ్డి నూరుకోనికి రోలు కడగి పొడి గుడ్డతో రోటిని దుడస్తా..‘రోట్నీండా యాపాకు చెత్త పడ్తంది గానీ, ఎవులన్నా మొగోళ్లకి జెప్పువ్వా! ఆ పక్క వొంగిన కొమ్మలు రోంత నరకమనీ’ అంది.
నూన్లో ఏంచి దెచ్చిన ఎండిమిరబకాయల్తో బాటూ, ఒక్క రవ్వ గళ్ళుప్పునూ రెండు తెల్ల వాయలనుగలిపి, తుడిసిన రోట్లో ఏసి దంచతా!
అది వింటానే నారాయణమ్మ ఎం కయ్యాల్లో వుందో ముత్తాలు మీదకు తోక దొక్కిన తాచులా ఇంతెత్తున లేచింది.
‘ఏం మే సూచ్చాంటే నీదేందో బో కథలాగుందే! పోనీలే పాప్మని మీకుండనీకి తావిచ్చే బాగుందే నీ కథ’ అంటా తిట్ల దండకం అందుకునింది.
‘ఆ మానుకేమన్న మనం కూడు పెడతాండామా? నీళ్లు బోచ్చాన్నెమా? ఆ మాను. మీ పిలకాయలకే కదూ మే నీడనిచ్యాందీ...’
ఎండ పొద్దన ‘అబ్బా ఉడకబెడతందవ్వా’ అంటా ఆ మానుకిందే గదూ! మంచం వాల్చుకుని చల్లగా ఆరేసుకుని పొడుకుంటావే’ అని దెప్పిపొడుస్తూ తనే మళ్ళీ ఇలా అంది.
‘అసలు యాప్మానుకి ఎందుకు పూజలు జేచ్చారు మే నాకు దెలీకడగుతా! యామన్నా దేవత దాంట్లో దూరుకుని ఉంటదా ఆ మాన్లో, ఇమ్గ యాడా తావు లేనట్లూ. లేదు మ్మే! అట్టా జెప్తే మీ లాంటోళ్లు నరక్కండా వుంటారని గదూ.
మే ముత్తాలూ! నీకు దెలీదా? మాన్లలో ఎన్ని మేలు చేసే లచ్చనాలుండాయనీ. సల్లగాలిచ్చాయి, నీడ నిచ్చాయి. కొట్టాన్కి కావల్సిన కట్టే ఇచ్చాది. ఆఖరిన మన కట్టే కాల్చేందుకు గూడా అదే పనికొచ్చాది గదమ్మే’ అంది కోపంగా.
‘రాలినాకు పక్కకు దోసేసి, రోన్ని నీళ్లు బోసి రోలు కడుక్కోనీకి పెద్ద వగలు బడ్తండావే పిల్లవూ, పని అయిపాతానే అట్ట తిప్పుకుంటా లేచి బోకుంటే ఆ పక్కన పాలీసు బండ పెట్టిన గదా! అది రోటి మీంద మూపెట్టరు గానీ! కొమ్మలు నరకమంటంది పిల్ల’ అంది ఇంగా ఇంగా అట్టే గొనుగతా!
‘అబ్బా ఎదో దభిక్కీన ఒక్క మాట జారి అన్యా లే వ్వా తల్లీ! బొరపాటయింది, ఇమ్గ ఎబ్బుడూ అట్టా అన్నులే గానీ! ఇన్గ నన్ను ఇడిసిబెట్టూ’ అంటా నూరుకున్న ఎండిమిరక్కాయల కారం దబా దబా... గిన్నెకెత్తుకుని అట్టే సక్కా అదే పాయ.
నారాయణమ్మంటే అందరికి ఎంత అభిమోనమో, అంతే భయం గూడా! తమకి ఆమే పెద్దదిక్కాయే! అదిగాకా ఎక్కడ ఆ స్థలం ఇడ్సమంటాదో అని! అందుకే ఎవరూ ఎదుర్తిగి మాట్లాడనుగూడ్క మాట్లార్రు.
నారాయణమ్మకి తన భర్త వెంకటయ్య తరపునుండీ కొందరు దూరెం వర్సెకి దాయాదులుండారు. ఆమెను దగ్గరికి దీచ్చే ఆ స్థలం అంతా కొట్టేయవచ్చు అని వాళ్ళ పథకం. అది అర్ధమైన నారాయణమ్మ వోళ్ళను దగ్గరకిదీసేది గాదు.
‘మంచిగా ఉంటే నేనే వాళ్ళను సూద్దును గదా!’ అని అనుకుంటుంది.
ఆ దాయాదులు రబోవూ కాలంలో ఆ ముప్పై సెంట్ల భూమి ఎంత ఇలువ జేచ్చాదో లెక్కలేచ్చా అంతటి ఆచ్చి చేజారి బోద్దెమోని బో బాధబడేవాళ్లు.
అసూయతో ఒక దశలో అసల్కి ఆమె వెంకటయ్య భార్యే గాదు, ఉంపుడుగత్తే అని గూడా తెగించి ప్రచారం జేశారు వాళ్లు.
దేనికి బెదర్ని నారాయణమ్మ ‘యా నా కొడకనో రమ్మను, సున్నం బట్టిలో యేసి కాలచ్చ ఒక్కొక్కర్నీ’ అనేది ఆవేశంగా.
‘మేంమంతా నీతో బాటూ వుండంగా అట్ట యేం జరగనీయంలే నారాయణమ్మవ్వా’ అంటూ అందరూ అవ్వకి దైర్నం జెప్పేవాళ్ళు.
దుడ్లతోనే పెపంచకమంతా నడుచ్చాందని ఎప్పుడూ బాధ పడతాండేది నారాయణమ్మ. కానీ నారాయణమ్మ మనసులో బాగా ఆలోచించి ఒక గట్టి నిర్ణయం దీసుకుని హాయిగా ఉపిరి పీల్చుకునింది.
నీళ్లకిబ్బంది బడకుండా తన స్థలంలో నడిమద్దెన బాయి తవ్వించింది. నారాయణమ్మ మనసులాంటి సచ్చమైన, కొబ్బరి నీళ్ల తీర్ణుండే తియ్యటి నీరు రివ్వున ఊరింది. అదేంశిత్రమో ఏ కాలమైనా సరే బాయిలో సగాన్కి పైగా ఎప్పుడూ నీళ్లతో నిండుగా వుండేది.
‘నారాయణమ్మ బాయి’గా అందరి నోళ్ళలో పిలువబడేది.
‘కొళాయిలొచ్చే ఈ రోజుల్లో బాయేందివ్వా’ అని అన్నోళ్లు గూడా తరువాత ‘బో మంచి పని జేశినవ్ వ్వా’ అని మెచ్చుకున్నేరు.
ఒకరోజు పొద్దన్నే...వాతావొరణంలో ఏందో మార్పుందని అందరికి అనిపించబట్టే! అయినా రోజులాగే ఎవ్వరి పనుల హడావిడిలో వాళ్లువుండారు. మేస్త్రీ టాకిటేరు దీసుకుని వచ్చేతలికి తయారుగా వుండాలని ఆడోళ్లు బెరీన వంటలు జేయబట్టిరి. మట్టి పనులకు బోయ్యేటోళ్లూ పారా,తట్టా తీసి బయట పెట్టుకున్యారు.
‘పొద్దన్నే ఏందీ నల్లకుక్క అట్టా ఒకటేమైయంగా ఈడీడే తచ్చాడుతా ఏడుచ్చాంది..దీని ధూమ్దగలా! దాని రద్దుకి నారాయణమ్మ తోలన గూడా బేటీకి రాలే’... యపపుల్లతో మోఖం తోమతా పెళ్ళాన్ని పిలిసి,అవ్వ ఏం జేచ్చాన్దో లోపల్కిబోయ్ జుడమన్యాడు పక్కనుండే రాముడు.
రాముడికి ఈ మద్దెనే బిల్డింగ్ పని జేచ్చా మిద్దెపై నుండీ కింద బడీ, రెండు కాళ్లు సచ్చుబడిపోయె!
సచ్చి బతికిన రాముడంటే అవ్వకి బో జాలి. రాముడు హాస్పటేల్ నుండీ కోలుకొని ఇంటికి దిరిగి వచ్చేందాకా అంతో, ఇంతో వున్నికాడికి డబ్బిచ్చా సాయంగుండీ, దైర్నం జెప్పేది.
కష్టకాలంలో తనను అమ్మలా జూసుకునిందని నారాయణమ్మంటే రాముడికీ ఇన్గ వల్లమాలిన అభిమానం.
ఎదురుగుండే చంద్రమ్మ గూడా ‘అవ్ బ్బా! అదేందీ! ఇంత పొద్దయింది నారాయణమ్మ అలికిడి లేదూ..శిత్రంగా ఉండాదే! ఈ యాల్కి ఇన్గ అపుడే బట్టీ కాడికి కూడా బోదు ముసల్ది..పా ఎందో సూజ్జం’ అనుకుంట గుడిసెలోకి బోయి ఇద్దరూ ఆడోళ్ళు గోళ్ళున ఏడస్తా బయటికి వచ్చిరి.
వెంటనే ఊళ్లో అందరికీ విషయం దెలిసిపాయ.
నారాయణమ్మ నిద్దర్లోనే పాణంబాయ.
‘ఏం సుగం సావు సచ్చే ముసల్ది’ అని అందరూ గోడు,గోడున ఏడ్చబట్టే.
అవ్వని తన నులక మంచంలోనే అవ్వకి ఇష్టమైన ‘రామబాణం పూల చెట్టూ, యాప్మానూ’ కలిసిన పెద్ద మాను కింద పడుకోబెట్టిరి.
దాయాదులంతా అవ్వ సుట్టూత జేరి వగలేడుపులు ఏడ్చబట్టిరి.
ఆ ఏడ్పులేమిటికో అందరికీ దెల్సినా ఏమీ జేయలేక అందరూ గమ్మున సూచ్చాండారు.
అంతలో రెండు కార్లు రయ్యిన వచ్చి నారాయణమ్మ గుడిసె ముందు ఆగె. దాంట్లోంటి నల్ల సూటూ, బూటూ వేసుకున్న వొక లాయరూ, కొందరు సారోళ్లు కిందకు దిగిరి.
నారాయణమ్మకి పూలదండ యేసి..ఎనుదిరిగి, అక్కడ జనాలనందరిని సూచ్చా...
‘నా పేరు రంగనాథ్...నేను లాయర్నీ....
అవ్వ పక్కన కొట్టంలో ఉండే కాలేజీ అబ్బాయి నాకు ఈ విషయం ఫోన్ చేసి చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చాను’
‘నారాయణమ్మ తన స్థలం దురాక్రమణకు గురి కాకుండా, వీలునామా రాసి, ఆ బాధ్యతను మాకు అప్పగించింది. వీళ్లు శాంతినికేతన్ అనాధ శరణాలయం నుంచీ వచ్చారు’ అంటా తనతో పక్కనే నించుకున్న వోళ్ళని పరిచయం జేసి...
‘నారాయణమ్మ వీలునామాలో ఎం రాసిందో మీకు అందరికీ ఇప్పుడు వినిపిస్తాను’ అంటా.
నారాయణమ్మ తన స్థలంలో సగభాగంలో అనాధ పిల్లల కోసం, తన లాంటి ముసలి వాళ్ల కోసం వొక ఆశ్రమం కట్టించమని శాంతి నికేతన్ సంస్థ వాళ్లకు రాసిచ్చింది.
మిగతా సగం .....
ఇన్నాళ్లు తనని నమ్ముకుని తనని అవ్వా అంటూ ఆదరించిన వాళ్లందరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదనీ...తాన జాగాలోనే స్థిరంగా వుండాలని తన వీలునామాలో రాసింది’
ఇంకా .....
‘తన అకౌంట్లో వున్న లక్ష రూపాయలనూ బేల్దారి రాముడికి చిల్లర కొట్టు పెట్టుకోనికి ఆర్ధిక సహాయంగా రాసి ఇచ్చింది’.
అని లాయర్ సదవొడం ఆపగానే...
అందరూ వొక్కసారిగా ‘నారాయణమ్మ వ్వా’ అంటూ నేలపై పడి, పొర్లి పొర్లి ఏడస్తా ‘మా మింద ఇంత జాలి, పేమ ఉండాయనుకోల, మా తల్లికి’ అని ఏడ్చబట్టిరి.
అప్పటి దాక ఆశతో వున్న దాయాదులు ‘తూ....నీ..దీనమ్మా! సచ్చా గూడా సాధించి బోయిందిరా ముసిలిది’ అంటా కోపంగా అక్కడి నుండీ లేశి వెళ్ళిపోయిరి.
హోరుమని పెద్ద గాలొకటి వీచడంతో....
చెట్టుపై నుండీ వొక్కసారిగా ‘రామబాణం పూలూ, ఎండిన యాపాకూ కింద ప్రశాంతంగా శాశ్వత నిద్రలోన్న అవ్వపై జల జలా రాలుతున్నెయి తమ చివరి వీడ్కోలుగా!
Comments
Please login to add a commentAdd a comment