క్యారెట్ ఇడియాప్పం
కావలసినవి: బియ్యప్పిండి – రెండున్నర కప్పులు; క్యారెట్ గుజ్జు – 1 కప్పు; వేడి నీళ్లు – ఒకటిన్నర కప్పులు; మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము – 1 టేబుల్ స్పూన్; నూనె – కొద్దిగా; ఫుడ్ కలర్ – అభిరుచి బట్టి
తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, క్యారెట్ గుజ్జు వేసుకుని గరిటెతో తిప్పుతూ కలుపుకోవాలి. తర్వాత కొద్దికొద్దిగా వేడి నీళ్లు వేసుకుంటూ ముద్దలా చేసుకుని, వేడి తగ్గేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అభిరుచిని బట్టి ఫుడ్ కలర్ కూడా వేసుకుని.. ఆ మిశ్రమాన్ని చేత్తో బాగా కలుపుతూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాన్‌లోని ప్రతి బౌల్‌కి బ్రష్‌తో నూనె పూసుకోవాలి. తర్వాత జంతికలు లేదా కారప్పుస మేకర్‌కి సన్నని హోల్స్ ఉంటే ప్లేట్‌ని అటాచ్ చేసుకుని, అందులో ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా నింపుకుని ఇడ్లీ పాన్‌లో చిత్రంలో కనిపిస్తున్న విధంగా(నూడుల్స్‌లా) చేసుకోవాలి. ఉడికిన తర్వాత కొద్దిగా కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.
టేస్టీ కీమా బాల్స్
కావలసినవి : మటన్ కీమా – అర కిలో(మెత్తగా ఉడికించుకోవాలి); కినోవా – ఒకటిన్నర కప్పు (మార్కెట్‌లో లభిస్తాయి); చిలగడదుంప ముక్కలు – 2 కప్పు(ఉడికించినవి)
పెసలు – అర కప్పు (రాత్రిపూట నానబెట్టుకోవాలి); వెల్లుల్లి గుజ్జు – అర టీ స్పూన్; అల్లం తురుము – పావు టీ స్పూన్; మిరియాలు – 5 లేదా 6; పసుపు – 1 టీ స్పూన్; సోయాసాస్ – ఒకటిన్నర టీ స్పూన్లు; ఎండు మిర్చి పేస్ట్ – 1 టీ స్పూన్; ధనియాల పొడి – 1 టీ స్పూన్; టమాటా గుజ్జు – 2 కప్పులు; టమాటా సాస్ – 2 కప్పులు; నీళ్లు – 2 కప్పులు; కొత్తిమీర తురుము – 1 టేబుల్ స్పూన్; తాళింపు సామాన్లు – కొద్దిగా; ఉప్పు – కొద్దిగా; నూనె – సరిపడా.
తయారీ : ముందుగా కినోవా శుభ్రం చేసుకుని సరిపడా నీళ్లు వేసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన కినోవా, చిలగడదుంప ముక్కలు, నానబెట్టిన పెసలు, వెల్లుల్లి గుజ్జు, అల్లం తురుము, మిరియాలు వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ కీమా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని, అందులో కినోవా, పసుపు, ఉప్పు, సోయాసాస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా తయారుచేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాత్రలో నూనె వేసుకుని, ఆ బాల్స్‌ని గరిటెతో ముందుకీ వెనక్కి తిప్పుతూ దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత మరో పాత్ర తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసుకుని, తాళింపు సామాన్లు వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా గుజ్జు, టమాటా సాస్, నీళ్లు, ఎండు మిర్చి పేస్ట్, ధనియాల పొడి వేసుకుని మూత పెట్టి 15 నిమిషాల పాటు ఆ బాల్స్‌ని ఉడికించుకోవాలి. కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఈ బాల్స్ భలే రుచిగా ఉంటాయి.
బాదం పూరీ
కావలసినవి: మైదాపిండి – 1 కప్పు; బాదం పేస్ట్ – పావు కప్పు(బాదం గింజలను 8 గంటల పాటు నానబెట్టి మిక్సీ పట్టుకోవాలి); నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా; నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు; బియ్యప్పిండి – అర కప్పు; ఉప్పు – తగినంత; ఏలకుల పొడి – అర టీ స్పూన్; నీళ్లు – 1 కప్పు; పంచదార – 2 కప్పులు;కుంకుమ పువ్వు – కొద్దిగా; లవంగాలు – పూరీల సంఖ్యను బట్టి;
తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, బాదం పేస్ట్, బియ్యప్పిండి, నెయ్యి, ఉప్పు వేసుకుని బాగా కలుపుతూ ముద్దలా చేసుకోవాలి. ఈ సమయంలోనే పక్కన స్టవ్ వెలిగించుకుని పంచదార, నీళ్లు వేసుకుని పాకం దగ్గర పడేముందు(తీగలుగా రాగానే) ఏలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బాదం–మైదా మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని, వాటిని చిన్నచిన్న పూరీలుగా తయారు చేసుకోవాలి. వాటిని రెండు సార్లు (త్రిభుజాకారం వచ్చేలా) ఫోల్డ్ చేసి, మరోసారి చపాతీ కర్రతో ఒత్తాలి. ఇప్పుడు లవంగాలను తీసుకుని.. ఒక్కో పూరీకి ఒక్కొక్కటి పెట్టి వాటిని నూనెలో వేయించి, వేడివేడిగానే పాకంలో వేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే వీటిపైన పిస్తా, బాదం వంటి డ్రైఫ్రూట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment