భాషణం : అర్థం ఉంది... అనువాదమే లేదు!
భాష సముద్రమైతే అందులోని జీవ చరాలు పదాలు! సముద్రగర్భంలో వింతవింత ప్రాణులు ఉన్నట్లే ప్రపంచ భాషల్లోనూ మనకు తెలియని, మన వాడుకలో లేని పదాలు కోకొల్లలు. వాటి భావాలను ఇంగ్లిషు సహాయంతో తెలుసుకోగలం కానీ, మన భాషలోకి నేరుగా అనువదించుకోలేం. అలాంటి కొన్ని పదాలు ఈవారం ‘భాషణం’లో మీ కోసం. ఔత్సాహికులు ఎవరైనా ఈ పదాలకు తెలుగు అర్థాలను సృష్టించగలిగితే తెలుగు భాషకు అది గొప్ప ఉపకారం.
Sobremesa (సొబెరెమేసా - స్పానిష్): లంచ్‌గానీ, డిన్నర్ గానీ అయ్యాక భుక్తాయాసం తీర్చుకుంటూ ఎవరితో అయితే కలిసి కూర్చుని భోంచేశామో వారితో మాట్లాడుతూ గడిపిన సమయం ‘సొబెరెమేసా’.
Komorebi (కొమోరొబీ - జపనీస్): చెట్ల ఆకుల సందుల్లోంచి పడే సూర్యకాంతి ‘కొమోరొబీ’.
Age-otri (ఎజాట్రి - జపనీస్): హెయిర్ కట్ చేయించుకున్నాక ముఖం వింతగా, వికారంగా కనిపించడం.
Gigi (గిగిల్ - ఫిలిప్పినో): అందంగా ఉన్నదాన్ని గిల్లాలనిపించే కోరిక ‘గిగిల్’.
Backpfeifengesich్ట (బ్యాక్‌ఫౌఫింగెసిస్ట్ - జర్మన్): పచ్చడి పచ్చడి చేసి తీరవలసిన ముఖం ‘బ్యాక్‌ఫౌఫింగెసిస్ట్’.
L'esprt del'escalier (లెస్పార్టో డెస్‌క్లేయిర్ - ఫ్రెంచి): మాటకు మాట చెప్పలేక, ఆ తర్వాత... అరే ‘ఫలానా మాట అనివుంటే, ముఖం మీద కొట్టినట్టు ఉండేది కదా’ అని అదే పనిగా ఫీల్ అవడం ‘లెస్పార్టో డెస్‌క్లేయిర్’.
Waldeinsamkei్ట (వాల్డ్ ఐమ్‌జంకైట్ - జర్మన్): చెట్ల మధ్య ఒంటరిగా ఉన్నపుడు కలిగే భయం లాంటిది ‘వాల్డ్‌ఐమ్‌జంకైట్’.
Tretar (ట్రిటార్ - స్వీడిష్): ఇందులో టార్ అంటే కప్పులోని కాఫీ. స్వీడిష్‌లో patar (పాటార్) అంటే మళ్లీ ఒకసారి కప్పులో కాఫీ పోయడం. ఆ తర్వాత కూడా రెండోసారి, మూడోసారి (తాగేవాళ్లను బట్టి) నింపుతూ ఉండడం ‘ట్రిటార్’.
Cualacino (క్యువలాకినో - ఇటాలియన్): చల్లటి ద్రవం ఉన్న గ్లాసు అడుగుభాగం, టేబుల్ మీద ఏర్పరిచే తడి గుర్తు ‘క్యువలాకినో’.
Depaysement (డిపీజ్‌మెంట్ - ఫ్రెంచ్): సొంతదేశంలో లేనప్పుడు మగవాళ్లకు కలిగే ఒకలాంటి స్థిమితమైన భావన ‘డిపీజ్‌మెంట్’.
Mangata (మాంగాటా - స్వీడిష్): సముద్రపు నీటి ఉపరితలం మీద చంద్రుని కాంతి ఏర్పరిచే వెలుగుదారి ‘మాంగాటా’.
Pana po'o (పనపూ - హవాయియన్): మర్చిపోయిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నంలో బుర్రగోక్కోవడం ‘పనపూ’.
Jayus (జాయెస్ - ఇండోనేషియన్): నవ్వురాని జోకు, నవ్వొచ్చే విధంగా చెప్పబడని జోకు, విధిలేక నవ్వవలసి వచ్చిన జోకు ‘జాయెస్’.
Pochemuchka (పోకేమూకా - రష్యన్): నిర్విరామంగా ప్రశ్నలు అడుగుతుండే వ్యక్తి ‘పోకేమూకా’.
Iktsuarpok (ఎట్సూఆర్‌పోక్ -ఇన్యూట్ (ఆర్కిటిక్ ప్రాంతం): మాటిమాటికే బయటికి చూస్తూ ఎవరైనా వస్తున్నారేమోనని అనుకోవడం ‘ఎట్సూఆర్‌పోక్’.
Pisanzapra (పిసాన్ జప్రా - మాలే): అరటిపండు తినడానికి పట్టే సమయం ‘పిసాన్ జప్రా’.