వెలుగు అప్‌గ్రేడ్ అయ్యింది ! | upgrade of lights | Sakshi
Sakshi News home page

వెలుగు అప్‌గ్రేడ్ అయ్యింది !

Published Sat, May 31 2014 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

వెలుగు అప్‌గ్రేడ్ అయ్యింది !

వెలుగు అప్‌గ్రేడ్ అయ్యింది !

అబ్రహాం లింకన్ వీధి దీపాల కింద చదువుకున్నాడట. కానీ మనం...రకరకాల దీపాల కింద చదువుకున్నాం. స్కూల్లో ఒక లైటు ఉండేది, హైస్కూల్లో ఇంకోలైటు మారింది. కాలేజీలో మరోలైటు వెలుగు చూశాం... ఇపుడు ఎల్‌ఈడీ వెలుగులు చూస్తున్నాం. మన చిన్నప్పుడు చూసిన ఇన్‌కాండిసెంట్ బల్బ్ (బల్బు) తర్వాత ఎన్నో వచ్చాయి. అయినా ఇప్పటికీ ఇన్‌కాండిసెంట్ దొరుకుతోంది? అసలు వీటి మధ్య తేడా ఏమిటి? ఎలా పనిచేస్తాయి?
 
 ఎక్కువ నీళ్లు ఎక్కువ మంది దాహాన్ని తీరుస్తాయి. ఇది సాధారణ సూత్రం. కానీ, టెక్నాలజీ చేసే అద్భుతాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. అలాంటి మార్పే బల్బుల్లోనూ వచ్చింది. ఎక్కువ కరెంటు తీసుకునే బల్బు తక్కువ వెలుగునివ్వగా, తక్కువ కరెంటు తీసుకుంటున్న బల్బులు ఎక్కువ వెలుగులు ఇస్తున్నాయి.
 
 ఇన్‌కాండిసెంట్: ఇది మనం మొదట చూసిన బల్బ్. దీనికి ఫిలమెంటు ఉంటుంది. ఆక్సిజన్ చొరబడకుండా అందమైన ఆకారంలోని ఒక గాజు సీసాలో ఫిలమెంటు బిగిస్తారు. ఆ ఫిలమెంటు ద్వారా విద్యుత్తు ప్రవహించడంతో అత్యధిక ఉష్ణోగ్రత రావడం వల్ల ఆ ఫిలమెంటు మండుతూ ఉండి వెలుగులు ఇస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బల్బుల్లో అతిఎక్కువ కరెంటు వాడేది ఇదే. ఇవి 1.5 వోల్టుల నుంచి 300 వోల్టుల వరకు వివిధ సామర్థ్యాల్లో దొరుకుతాయి. బహుశా చాలామందికి దీపం తర్వాత పరిచయం అయిన తొలి విద్యుత్ బల్బు ఇదే.
 
 ఇప్పటికీ అలంకరణల్లో వీటికి డిమాండ్ బాగా ఎక్కువ. ఈ బల్బులు వేడిని ఎక్కువ సృష్టిస్తాయి. దీనికి కారణం ఏంటంటే... ఇవి తీసుకునే విద్యుత్తులో ఐదు శాతం వెలుగు ఇవ్వడానికి ఉపయోగపడితే, మిగతా 95 శాతం వేడి రూపంలో వృథా అయిపోతుందట! అందుకే ఈ బల్బుని వెలుగుతున్నపుడు ముట్టుకోలేం.
 
 హాలోజెన్ బల్బ్: ఇన్‌కాండిసెంట్ కంటే కాస్త అడ్వాన్స్‌డ్. ఇవి దానికంటే రెట్టింపు వెలుగును ఇస్తాయి. ఈ బల్బుల్లోని ఫిలమెంటు కరెంటును పునర్వినియోగం చేయడం వల్ల కొంత తక్కువ విద్యుత్తును వాడుకుంటాయి. ఇవి గృహావసరాలకు ఉపయోగపడలేదు. ఆస్పత్రుల్లో కొన్ని పరిమిత అవసరాల్లో... కమర్షియల్‌గా మాత్రమే పరిమితంగా వాడుకలో ఉన్నాయి.
 
 ట్యూబ్‌లైట్: ఇది పొడవైన కాంతి పైపు. దీన్ని ట్యూబ్ ఫ్లోరొసెంట్ అంటారు. దీనివల్ల విద్యుత్‌ను పొడవాటి పైపు మొత్తం ప్రసరింప జేయడం ద్వారా వెలుగు వృథాని అరికట్టడం జరుగుతుంది. ట్యూబ్‌లైట్ పగిలినపుడు మన చేతికి పొడిపొడిగా అంటేది ఫాస్పర్. ట్యూబ్‌లోని వెలుగు దీనిమీద పడటం వల్ల ఉత్పత్తి అయిన వెలుగు మరింత ఎక్కువగా, తేటగా, కాంతివంతంగా వస్తుంది.
 
  ట్యూబ్‌కు రెండు వైపుల మాత్రమే వెలుగు ఉత్పత్తి అయినా మొత్తం ట్యూబ్ అంతా ఉత్పత్తి అయినట్టు మనకు అనిపిస్తుంది. ఇది ఇన్‌కాండిసెంట్‌కంటే తక్కువ కరెంటును తీసుకుని ఎక్కువ వెలుగు ఇస్తుంది. ట్యూబ్‌లైట్‌లో చోక్, స్టార్టర్ ఎందుకు ఉంటాయంటే ట్యూబ్ ఆన్ చేసినపుడు మాత్రమే పూర్తి కరెంటు తీసుకుంటాయి. ఆ తర్వాత అవసరం ఉండదు. కాబట్టి వేసిన తర్వాత ఇవి ఎనర్జీని నియంత్రిస్తాయి.
 
 ఫోర్లొసెంట్ బల్బ్: ఇవి వేడి రహిత కాంతిని ఇస్తాయి. పగటి వెలుతురులా సహజ వెలుగును ఇస్తుంది. ఫ్లోరెసెంట్ బల్బుల్లో పాదరసపు వాయువు వల్ల వెలుగు ఉత్పత్తువుతుంది. వీటిలో చుట్టూ లోపల పూసిన ఫాస్పర్ దానిని మనం చూడదగిన వెలుగుగా మారుస్తుంది. ఇవి అత్యంత విసృ్తతంగా ఉపయోగంలోకి వచ్చాయి. అందంగా ఉండటం, ఆకర్షణీయమైన ఆకారాల్లో ఉండటం కూడా వీటి ఆదరణకు కారణం. ఇందులో మామూలు హోల్డర్‌లో పెట్టుకోవడానికి అనుగుణంగా సీఎఫ్‌ఎల్ (కాంపాక్ట్ ఫ్లోరొసెంట్ ల్యాంప్)... బల్బులు వచ్చాయి. ఇవి విద్యుత్తును బాగా ఆదాచేస్తాయి. ట్యూబ్‌కంటే వేగంగా, తక్కువ విద్యుత్తుతో పనిచేస్తాయివి.
 
 ఎల్‌ఈడీ బల్బు: ఎల్‌ఈడీ అంటే లైట్ ఎమిటింగ్ డియోడ్. ఇవి అన్నిటికంటే తక్కువ విద్యుత్తును తీసుకుని ఎక్కువ కాంతిని శక్తివంతంగా ప్రసరింపజేస్తాయి. అయితే వీటి ధర సీఎఫ్‌ఎల్ కంటే చాలా ఎక్కువ. వాటిలా ఎల్‌ఈడీ కాంతిని ఎక్కువ ప్రదేశానికి విస్తరించదు. ఇటీవలే ఇది గృహావసరాలకు అనుగుణంగా తయారవుతోంది. పూర్తిగా జనాలకు చేరువ కాలేదు. ఇవి కాకుండా ఇపుడు హెచ్‌ఐడీ (హై ఇంటెన్సిటీ డిశ్చార్జ్ ల్యాంప్స్) వచ్చాయి. ఇవి వాహనాల లైట్లలో బాగా వాడుతున్నారు. ఇందులో గ్యాస్, మెటల్ సాల్ట్స్ నింపుతారు. ఇవి సుదూరంగా కూడా వెలుగును ఇవ్వగలవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement