షాంపూని కనిపెట్టింది మనమే!
ఫ్లాష్ బ్యాక్
సౌందర్య పోషణలో తలకట్టుదే పెమైట్టు. శిరసున కేశసంపద అలరారుతున్నప్పుడే సౌందర్యం ఇనుమడిస్తుంది. మన పూర్వీకులకు ఈ సంగతి ముందే తెలుసు. అందుకే వాళ్లు కేశ సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిచ్చేవారు. శిరోజాలను శుభ్ర పరచుకోవడానికి వేల ఏళ్ల కిందటే షీకాయ, కుంకుడు కాయలు వంటి వాటిని మన దేశంలో విరివిగా వాడేవారు. తడి నెత్తికి పట్టిస్తే, నురగనిచ్చే ఈ పదార్థాలు 18వ శతాబ్ది వరకు పాశ్చాత్యులకు తెలియనే తెలియవు.
వాస్తవానికి హిందీలోని ‘చాంపో’ పదమే ఇంగ్లిష్‌లోని ‘షాంపూ’పదానికి మూలం. క్రీస్తుశకం 1762లో ఇది ఇంగ్లిష్ వారికి పరిచయమైంది. అయితే, ఇరవయ్యో శతాబ్ది వరకు ‘షాంపూ’ జన సామాన్యానికి అందుబాటులోకి రాలేదు. అంతకు ముందు బ్రిటన్ సహా పలు యూరోప్ దేశాలలో షేవింగ్ కోసం ఉపయోగించే సబ్బును మరి గించిన నీటిలో వేసి, దాని ద్వారా వచ్చే నురగతో తలలు శుభ్రం చేసుకునేవారు.
అమెరికాలోని హెచ్.ఎస్.పీటర్సన్ అండ్ కంపెనీ ‘కాంత్రాక్స్’ పేరిట 1914లో షాంపూను అందుబాటులోకి తెచ్చింది. పత్రికల్లో విరివిగా ప్రకటనలు గుప్పించింది. టిన్ డబ్బాల్లో అమ్మే ఈ షాంపూ... పొడిగా ఘనరూపంలో ఉండేది. ఆ తర్వాత 1926లో జర్మన్ పరిశోధకుడు హాన్స్ స్క్వార్జ్‌కాఫ్ చిక్కని ద్రవరూపంలో షాంపూను తయారు చేశాడు.
ఇది అందుబాటులోకి వచ్చాక, చాలా దేశాలు ఇదే పద్ధతిలో వివిధ పరిమళాలతో షాంపూలను తయారు చేయడం మొదలుపెట్టాయి. ఇక అప్పటి నుంచి కేశ సంరక్షణలో విప్లవాత్మక మార్పులే వచ్చాయి. ఇప్పుడు మార్కెట్ నిండా రకరకాలు ఆక్రమించాయి.