అమ్మపాలే అమృతం | World milk week on august 1st to 7th | Sakshi
Sakshi News home page

అమ్మపాలే అమృతం

Published Sun, Jul 31 2016 2:05 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

అమ్మపాలే అమృతం

అమ్మపాలే అమృతం

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1 - 7 వరకు
పసిపిల్లలకు అమ్మపాలే అమృతం. శిశువు పుట్టిన గంట సేపట్లోగా మొదట తల్లిపాలనే పట్టాలి. రెండేళ్ల వయసు వచ్చేంత వరకు పిల్లలకు తల్లిపాలే ప్రధాన పోషకాహారం. చిన్నారులకు కనీసం ఆరు నెలల వయసు వచ్చేంత వరకైనా తల్లిపాలు పట్టాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. మిల్క్ ఫార్ములాలు అందుబాటులోకి రాని కాలంలో ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు అందరూ తల్లిపాలనే పట్టేవారు. మిల్క్ ఫార్ములాలు అందుబాటులోకి వచ్చాక ఫ్యాషన్ల ప్రభావంలో పడి అగ్రరాజ్యాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను చాలామంది తల్లులు పిల్లలకు ఫార్ములా పాలను అలవాటు చేయడం ప్రారంభించారు.

కొన్ని దశాబ్దాలు ఇదే ధోరణి కొనసాగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు అంతర్జాతీయ సంస్థలు చొరవ తీసుకుని, తల్లిపాల ప్రాధాన్యంపై విస్తృతంగా ప్రచారం సాగించడంతో ఇటీవలి కాలంలో మహిళలు తల్లిపాలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఫార్ములా పాలపొడులను తయారు చేసే కంపెనీలు తమ ఉత్పత్తుల ప్యాకెట్లపై ‘శిశువులకు తల్లిపాలే అత్యంత శ్రేష్ఠమైనవి’ అని తప్పనిసరిగా ముద్రించే పరిస్థితి అనివార్యంగా మారింది. శిశువులకు తల్లిపాలు పట్టడం ఇటు శిశువుల ఆరోగ్యానికీ, అటు తల్లుల ఆరోగ్యానికీ మంచిదని పలు వైద్య పరిశోధనల్లో రుజువవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదే అంశాన్ని తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తోంది.
ఇదీ పరిస్థితి
శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలను మించినవేవీ లేవు. తల్లిపాలకు ప్రత్యామ్నాయం కూడా ఏదీ లేదు. తల్లిపాల ద్వారా శిశువుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా ఆరు నెలల లోపు వయసున్న శిశువుల్లో దాదాపు 40 శాతం మంది తల్లిపాలు లభించక అల్లాడుతున్నారు. రోగనిరోధక శక్తి సన్నగిల్లి వ్యాధుల బారిన పడుతున్నారు.

ఈ పరిస్థితి వల్ల కొందరు శిశువులు నిష్కారణంగా కన్నుమూస్తున్నారు. ప్రపంచంలోని శిశువులందరికీ తల్లిపాలు అందే పరిస్థితే ఉన్నట్లయితే, ఏటా 8 లక్షల శిశుమరణాలను నివారించే అవకాశాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అయితే, తల్లిపాల వినియోగంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, వెనుకబడిన దేశాలే ముందంజలో ఉన్నాయి. తల్లిపాల వినియోగంలో తొలి పది స్థానాల్లో నిలుస్తున్న దేశాలు, వాటి వివరాలు...


తల్లిపాలను నిల్వచేయవచ్చు
ఉద్యోగాలు, ఇతర పనుల కోసం బయటకు వెళ్లే మహిళలకు పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు పట్టే అవకాశం దొరక్కపోవచ్చు. అలాంటి తల్లులు తమ పాలను బయటకు తీసి, ఫ్రిజ్‌లో భద్రపరచి ఉంచే పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. తల్లిపాలను తేలికగా బయటకు తీసేందుకు పంపులు వంటి పరికరాలూ అందుబాటులోకి వచ్చాయి. ముందుగానే తీసి, నిల్వచేసిన తల్లిపాలను పిల్లలకు అవసరమైనప్పుడు పట్టవచ్చు.
 
కొందరు తల్లులకు తగినంతగా పాలు పడకపోవచ్చు. అలాంటప్పుడు దాతల నుంచి సేకరించిన తల్లిపాలను కూడా పిల్లలకు పట్టే పద్ధతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. నెలలు నిండకుండా పుట్టిన వారికి తల్లిపాలు తగినంతగా అందకపోవచ్చు. అలాంటి వారికే కాకుండా, రకరకాల కారణాల వల్ల తల్లిపాలు అందని శిశువులకు తల్లిపాలు సరఫరా చేయడానికి ఇటీవల పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మెర్) సంస్థ ఇటీవల తల్లిపాల ఏటీఎం ప్రారంభించింది. ‘అముదం తైప్పాల్ మయ్యమ్’ (ఏటీఎం) పేరిట ఏర్పాటు చేసిన ఈ తల్లిపాల నిల్వ కేంద్రాల ద్వారా అవసరమైన శిశువులకు తల్లిపాలు సరఫరా చేస్తోంది.
 
తల్లిపాల గురించి అవీ ఇవీ...తల్లిపాలు చాలా విలువైనవి. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌లో కొందరు తల్లిపాలను అమ్ముతున్నారు.
ఔన్సు తల్లిపాల ధర 4 డాలర్లు (సుమారు రూ.270) పలుకుతోంది.

 
* తల్లిపాలు తాగే శిశువులు వందమందిలో ఉన్నా తమ తల్లిని ఇట్టే గుర్తుపడతారు. ఒకవేళ తల్లిని పోలిన మనిషి తమ తల్లి పక్కనే ఉన్నా, వాసన ఆధారంగా తమ తల్లిని గుర్తుపట్టేస్తారు.
* పాలిచ్చే తల్లుల్లో ‘ఆక్సిటోసిన్’ అనే హార్మోన్ సహజంగానే ఉత్పత్తవుతుంది. ఇది తల్లులే కాకుండా, వారి శిశువులు కూడా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండేందుకు దోహదపడుతుంది.
* అమెరికాలో ఫ్యాషన్లు రాజ్యమేలిన 1960-70 దశకాల కాలంలో పాలిచ్చే తల్లుల సంఖ్య మరీ తక్కువగా... అంటే దాదాపు 20 శాతం మాత్రమే ఉండేది. తల్లిపాల ప్రాశస్త్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్తృత ప్రచారం సాగించడంతో ఇప్పుడు ఈ పరిస్థితి చాలావరకు మెరుగుపడింది.
* పిల్లలకు పాలు పట్టడం ద్వారా తల్లులకు వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుంది. రోజులో అవసరమైనన్ని సార్లు పిల్లలకు పాలుపట్టడం వల్ల ఏడు మైళ్ల నడక సాగించినంత వ్యాయామం లభిస్తుంది.
* పిల్లలకు పాలు పట్టే తల్లులకు తరచూ దాహం వేస్తూ ఉంటుంది. ఇది సహజమే. దాహం వేసినప్పుడల్లా పుష్కలంగా నీరు తాగుతుంటేనే పిల్లలకు కావలసినంత పాలు ఉత్పత్తవుతాయి.
* తల్లిపాలలో ప్రధానంగా వే, కీసిన్ అనే ప్రొటీన్లు ఉంటాయి. పిల్లల రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement