దండగమారి ‘మండళ్లు’! | ABK Prasad Article On Dissolution Of AP Legislative Council | Sakshi
Sakshi News home page

దండగమారి ‘మండళ్లు’!

Published Tue, Jan 28 2020 12:25 AM | Last Updated on Tue, Jan 28 2020 12:25 AM

ABK Prasad Article On Dissolution Of AP Legislative Council - Sakshi

‘భారత రాజ్యాంగ చట్టంలోని 168వ అధికరణ రాష్ట్రాలలో లెజిస్లేచర్ల ఏర్పాటు గురించి ఏమి చెప్పినప్పటికీ... పార్లమెంటు చట్టం ద్వారా రాష్ట్రాలలోని ఎగువ సభల (లెజిస్లేటివ్‌ కౌన్సిల్స్‌)ను రద్దు చేయవచ్చు లేదా వాటిని ఏర్పర్చనూవచ్చు. అయితే సంబంధిత రాష్ట్ర శాసనసభ (అసెంబ్లీ) మెజారిటీ సభ్యులు ఆ మేరకు నిర్ణయించిన ప్పుడు అందుకు పార్లమెంటు సమ్మతి ఉంటుంది’’
– భారత రాజ్యాంగంలో 169వ అధికరణ నిర్దేశం
‘‘గత కొన్నేళ్లుగా ఈ ఎగువ సభలను రద్దు చేయాలన్న ఆలో చనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పక్షాలేగాక ప్రజాస్వామ్య సంఘాల్లో కూడా ఎగువ సభలవల్ల అనర్థాలు, అనవసర వ్యయం మినహా ప్రయోజనాల్లేవన్న భావన పెరిగింది... రాజ్యాంగ నిపుణులు ఎగువ సభకు నిర్దేశించిన లక్ష్యం గాలికి కొట్టుకుపోయింది. 3 లక్షల మంది ఓటర్ల విశ్వాసం పొందిన ఎమ్మెల్యే కంటే ఎన్నికల్లో ఓటమి పాలై పార్టీ పెద్దల ప్రాపకంతో ఎమ్మెల్సీలు అవుతున్న వారికే ప్రొటోకాల్‌ ప్రకారం పెద్దపీట వేస్తున్నారు’’
– ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి
‘‘రాష్ట్రాలలో నూతనంగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలకు అంతకు ముందు అక్రమంగా చోటు చేసుకున్న కాంట్రాక్టులను, అవినీతితో కూడిన ప్రాజెక్టులను సదుద్దేశంతో సమీక్షించే హక్కు ఉంది’’
– హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్‌ జనరల్‌గా పనిచేసిన సీనియర్‌ దౌత్యాధికారి క్యాథరిన్‌ హడ్డా. ‘ది హిందూ’ (18.1.2020)

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇంతవరకూ రాష్ట్రం కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రజామోదం పొందిన అనేక సంక్షేమ పథ కాలు ‘ఉత్తుత్తి’ హామీలు కాకుండా వాస్తవ జీవనంలో క్షేత్ర స్థాయిలో అమలులోకి వచ్చి, నిలదొక్కుకోవడం ప్రారంభించి ఏడు మాసాలు కూడా పూర్తి కాలేదు. కాగా, ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిగా వదిలించు కుని కుట్రలు, కుహకాల ద్వారా అధికారంలోకి వచ్చిన ‘తెలుగుదేశం’ పార్టీ నాయకుడు చంద్రబాబు 2019 జనరల్‌ ఎన్ని కల్లో ఘోర పరాజయంవైపు పార్టీని నడిపించి అభాసుపాలయ్యాడు. వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్న నూతన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో బాబుకు కూర్చో వడమే కంపరమెత్తిపోతున్నట్లుంది. అంతేకాకుండా అసంఖ్యాక మెజారిటీతో గెలుపొందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యులను సభా చర్చలలో ఎదుర్కొనే దమ్మూ, సత్తా లేక కేవలం 23 మంది సభ్యు లతో మిగిలి కుమిలిపోతున్న ప్రతిపక్షంగా ‘దేశం’ రోజులు గడప వలసి వస్తోంది. కాగా, ఈ పరాభవాన్ని భరించలేని బాబు నేతృ త్వంలోని టీడీపీ కుట్రలతో, డబ్బులు ఎరబెటి,్ట ఎగువసభ అయిన కౌన్సిల్‌లో దింపుడుకల్లం ఆశగా మిగిలిపోయిన బలంతో జగన్‌ అఖండ విజయాన్ని తారుమారు చేసే కుట్రకు తలుపులు తెరిచింది. 

తొలిరోజుల్లో శాసనసభ–శాసన మండలి బాంధవ్యాన్ని కొందరు రాజనీతిజ్ఞులు ‘కప్పు–సాసర్‌’ మధ్య బంధంగా భావిం చేవారు. అంటే– ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న దిగువ సభ అయిన శాసనసభలో చర్చలు వేడిగా, వాడిగా, ఉద్రేకంతో సాగుతాయి కాబట్టి ఆ ఉద్రేక వాతావరణాన్ని ‘పెద్దల సభ’ (కౌన్సిల్‌) విజ్ఞతా పూర్వక చర్చల ద్వారా తగ్గిస్తుందన్న నమ్మకం ఉండేది. అలా కప్పులో వేడిగా ఉండే కాఫీ సాసర్‌లోకి పోసినప్పుడు చల్లబడుతుందన్నది పాతకాలపు నానుడి. ఇప్పుడు భారత ప్రజాస్వామ్య విలువలన్నీ చౌరస్తాలో ‘చాకి రేవు’లో ఉతుకుడుకి, బాదుడికీ భారీ స్థాయిలో గురి అవుతున్నాయి. చంద్రబాబు కుళ్లు రాజకీయం రాష్ట్ర శాసనమండలిలో మరింత వికృత రూపం దాల్చింది. శాసనసభ ప్రత్యక్ష ఎన్నికల్లో తమకు కలిగిన శృంగభంగాన్ని కౌన్సిల్‌లో ప్రతిపక్ష తాత్కాలిక మెజారిటీ ద్వారా మభ్యపరుచుకుందామని భావించారు, అసెంబ్లీ ఆమోదం పొందిన ప్రజాహితమైన బిల్లులను పరోక్ష మార్గంలో ఎన్నికైన శాసనమండలిలో తన బలంతో అడ్డుకుందామని బాబు వర్గం చూసింది. ఆ ప్రయత్నంలో కౌన్సిల్‌ అధ్యక్షుణ్ణే బెదిరింపులతో ఇరకాటంలో పెట్టింది. నోటీసూ పాడూ లేని తీర్మాన ప్రతిపాదనను మూజువాణీగా తీసుకొని అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని సలహాల ద్వారా తప్ప తిరస్కరించే అధికారంలేని కౌన్సిల్‌ ఛైర్మన్‌ను ‘దేశం’ సభ్యులు ఇరకాటంలోకి నెట్టారు. ఆమోదం లేని ‘దేశం’ ప్రతిపాద నను సెలెక్టు కమిటీకి పంపినట్టు అబద్ధమాడి ప్రచారంలో పెట్టగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను అసలు సెలెక్టు కమిటీకే పంపలేదని కౌన్సిల్‌ అధ్యక్షుడే ప్రకటించారు, అయితే బెదిరింపులవల్ల ఛైర్మన్‌ అని శ్చిత స్థితిలో దఫదఫాలుగా మాట మార్చవలసిన దుస్థితి వచ్చింది. ఇదీ–పెద్దల సభ ఎలా మారగలదో నిరూపించిన వైనం.

దేశంలోని కౌన్సిళ్ల దుష్ట చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం. అసలు దేశంలో 28 రాష్ట్రాలకుపైగా ఉంటే, వాటిలో కేవలం ఆరు రాష్ట్రాలలో మాత్రమే (1956–1985 మధ్య 25 ఏళ్ల పాటు) అంటే ఎన్టీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిని రద్దు చేసేవరకు బతికి ఉండ టానికి కారణం ఏమిటి? ఇతర రాష్ట్రాలలో ఆ కౌన్సిళ్లు ఎందుకు లేవు? అసలు ‘కౌన్సిళ్ల’ లేదా ‘పెద్దల సభ’ పేరిట ఏర్పడినవి.. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలు ఎన్నుకునే శాసనసభలకే ప్రాధాన్యమివ్వాల న్నది 1941 డిసెంబర్‌ 9 నుంచి 1948 జనవరి 27 మధ్య జరిగిన రాజ్యాంగ నిర్ణయ సభా చర్చల సారాంశమూ, నిర్ణయమూ.  సర్వే పల్లి రాధాకృష్ణన్, నెహ్రూ, రాజేంద్రప్రసాద్, అంబేడ్కర్, గోపాల స్వామి అయ్యంగార్, మౌలానా హజ్రత్, సిబిన్‌లాల్‌ సాక్సేనా లాంటి హేమా హేమీలు మాసాల తరబడి కౌన్సిళ్ల ఏర్పాటుపై చర్చించి, వ్యతిరేకిం చారు. కారణం–ఎగువ సభలు, దిగువ సభలన్న వివక్షకు వారు వ్యతి రేకులైనందుననే, స్వాతంత్య్రానంతర భారతంలో ప్రగతి శాసనాలకు అడ్డుపుల్లలుగా తయారైన కౌన్సిళ్లు ఎన్టీఆర్‌ రద్దు చేసే వరకు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనూ, తరువాత బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళ నాడు, ఉత్తరప్రదేశ్‌లలో మాత్రమే కొనసాగుతూ వస్తున్నాయి. మిగతా దేశమంతటా ఈ కౌన్సిళ్లు రాష్ట్రాల్లో ఏర్పడక పోవడానికి కార ణం–ప్రధాన రాజ్యాంగ నిర్మాతగా ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సహా పలువురు సభ్యులు ఎగువ సభల పేరిట ‘కౌన్సిళ్ల’ నిర్మాణం అన్నది బ్రిటిష్‌ వలస పాలనావశేషంగా భావించడంవల్లనే నని మరచి పోరాదు. 

అలాగే, శాసనమండలి (కౌన్సిల్‌) అన్నది ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకునే శాసనసభకు దాని నిర్ణయాలకూ మాత్రమే బద్ధమై ఉండాలని గోపాలస్వామి అయ్యంగార్‌ ప్రతిపాదించారని మరచి పోరాదు (రాజ్యాంగ సభ డిబేట్స్‌: వాల్యూం 1–6, పేజీ 860) అంతే గాదు, రాజ్యాంగ సభ సీనియర్‌ సభ్యులలో ఒకరైన మహ్మద్‌ తహీర్‌ ఇక్బాల్‌ కవిత ‘సారే జహాసే అచ్చా.. హిందూస్తాన్‌ హమారా’ను ఉటంకిస్తూ ‘మనల్ని పీడించి వదిలిన ఇంగ్లిష్‌వాడు ఇండియాను వదిలిపోయినా వాడు దెయ్యం రూపంలో మన దేశాన్ని వెంబడిస్తూనే ఉన్నాడని’ విమర్శించాడు.బ్రిటిష్‌ వలస పాలనావశేషంగా మనకు సంక్రమించిన ఇలాంటి ఎగువసభల (ఇంగ్లిష్‌ ప్రభువుల, సంపన్న వర్గాల కోసం ఏర్పడిన) సంప్రదాయాన్ని మనం విడనాడవలసిందేనని చెప్పాడు. ‘ఎగువ సభలు, అలాంటి ఇతర పెట్టుబడిదారీ వర్గ సాధనాలు సామ్రాజ్య వాదుల సృషి’్ట అని కూడా తహీర్‌ నిండు సభలో ప్రకటించాడు. అందువల్ల ‘ఇండియా లాంటి పేద దేశం ఇప్పటికీ ఎంతో రక్తమోడు తోందనీ, పేదలు రెక్కలు ముక్కలు చేసుకుని బతుకులీడుస్తున్నారనీ, ఈ భారాన్ని మెజారిటీ పేద వర్గాలు అసంఖ్యాకంగా ఉన్న ఇండి యాలో ఖర్చుతో కూడుకున్న ఎగువసభ లాంటి విలాస సంస్థలకు చోటివ్వరాదనీ’ హితవు చెప్పాడు.  అలాగే ప్రొఫెసర్‌ శిబిన్‌లాల్‌ సాక్సేనా లాంటి మేధావి ‘ప్రపం చంలోని ఏ దేశంలోనూ ఈ ఎగువ సభలు సమాజాభ్యున్నతికి దోహదం చేయలేదు, ఈ విషయంలో ఇప్పటినుంచే జాగ్రత్తపడక పోతే, ప్రపంచంలోనే పెద్ద దేశమైన ఇండియా, రష్యా, అమెరికాలతో అభివృద్ధిలో పోటీ పడలేదు.

సభాధ్యక్షులు గోపాలస్వామి అయ్యం గార్‌ మన నూతన రాజ్యాంగంలో రెండు సభల (అసెంబ్లీ కౌన్సిల్‌) కాకుండా ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకొనే శాసనసభ మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలి’ అని ప్రొఫెసర్‌ సాక్సేనా కోరారు. ఎందుకంటే హుందాగా, ఆచరణయుక్తమైన చర్చలకు తప్ప గిల్లి కజ్జాలకు, ప్రతిష్టంభనల ద్వారా ప్రగతిని నిరోధించే, లేదా జాగర ణతో బిల్లులను నిర్వీర్యం చేసే కౌన్సిళ్లను మనం ప్రోత్సహించరాదని మెజారిటీ సభ్యులు కోరారు. అసెంబ్లీలు గానీ, కౌన్సిళ్లు గానీ అసంఖ్యాకులైన పేద, మధ్యతర గతి, బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడుతూ అభ్యు న్నతిని సాధించనప్పుడు, విఫలమైనప్పుడే సామాజిక, రాజకీయ విప్లవాలు ఆవిష్కరించుకుంటాయి. ఫ్రెంచి అసెంబ్లీ, ఎగువ సభలు, రష్యన్‌ పార్లమెంటు (డ్యూరా), బ్రిటిష్‌ పార్లమెంటులో సకాలంలో ప్రజాభీష్టాన్ని గౌరవించి మెలగనందువలనే, అణచివేతలకు, నిర్బంధ విధానానికి గజ్జె కట్టినందువల్లనే– ఫ్రెంచి విప్లవం వచ్చి, బాస్టిలీ దుర్గాన్ని కూల్చివేసింది, అందుకు అనుగుణంగానే తదనం తరం బ్రిటిష్‌ కాలనీగా ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలూ వలస పెత్తనానికి వ్యతిరేకంగా అమెరికన్‌ విప్లవమూ, ఆంగ్లో–అమెరి కన్‌–చాంగైషేక్‌ ప్రజా వ్యతిరేక నిర్బంధ విధానాలపైన చైనా విప ్లవమూ బిళ్లాబీటుగా విరుచుకుపడాల్సి వచ్చింది. ఇది చరిత్ర పాఠం. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో నేడు పరాన్నభుక్కు వర్గాలే మెజారిటీ ప్రజ లపై పెత్తనం కోసం పడుతున్న పెనుగులాటకు కొనసాగింపే నేటి వైసీపీ సంస్కరణవాద ప్రభుత్వంపైన, దాని కొన్ని ప్రగతిశీల విధా నాలపైన ప్రతిపక్ష విదూషకులు పన్నుతున్న కుట్రలూ విఫలం కాక తప్పదుగాక, తప్పదు!!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement