ఆలయాల సంరక్షణ ఎలా? | C S Rangarajan Article On Temples Development | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 24 2018 12:39 AM | Last Updated on Tue, Apr 24 2018 12:39 AM

C S Rangarajan Article On Temples Development - Sakshi

ఆ భగవంతునికి అర్చకుడు భగవత్‌ కైంకర్యంలో తన సర్వస్వాన్ని అర్పిస్తాడు. తనను, తన అధీనంలోని చేతన అచేతన సంపదను నిశ్శేషంగా సమర్పిస్తాడు. ఈ సమర్పణలో అర్చకుని భార్య, పిల్లలు, చుట్టాలు, ధన, కనక వస్తు వాహనాలు మొదలైనవి అతీ తం కావు, అన్నీ స్వామికి సమర్పించి, ఆయన ప్రసాదంగా స్వీకరిస్తాడు.

అర్చకుడు ఆలయంలో సేవ చేసినపుడు అతనితోపాటుగా అతని కుటుంబం కూడా శారీరకంగా, మానసికంగా పాలుపంచుకుంటుంది. అర్చకత్వం అనేది ఒక బృహత్తర బాధ్యత. సమాజం సుఖశాంతులతో, సహ భావనలతో వర్ధిల్లాలని భగవంతుని అనునిత్యం ప్రార్థించే అర్చకుడు తిరిగి తనకు అదే సమాజం వస్తు రూపకంగా ఏదైనా తిరిగి ఇవ్వాలని కోరుకోడు. నిస్వార్థంగానే సమాజ శ్రేయస్సును ఆకాంక్షిస్తాడు. అటువంటి అమాయక అర్చకుని బాగోగుల గురించి సమాజం ఆలోచించాలి. అవును. తప్పకుండా ఆలోచించాలి.

అర్చకుని గురించిన ఈ ఉపోద్ఘాతానికి కారణం ఉంది. ప్రస్తుత సమాజంలో క్షీణించిపోతున్న అర్చక వర్గ సంఖ్య గురించి వాడిగా వేడిగా చర్చలు జరుగుతున్నాయి. యువతరంలో అర్చకత్వంపట్ల సన్నగిల్లుతున్న సుముఖత, అర్చకుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేని ఆడపిల్లలు వగైరా. అర్చక కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలు సైతం, అర్చకుని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేరు.

ఈ పరిణామం అత్యంత భయావహం. ఇప్పుడు బరువెక్కిన హృదయంతో ఇటువంటి నాజూకు విష యం గురించి పాఠకులతో తన భావాలను పంచుకోవాలనుకుంటున్నాము. మా ఉద్దేశం సమాజం ఈ సమస్యవైపు తన దృష్టి సారించలేదని కాదు. అర్చకులు ఆలయాలను విడిచిపెట్టి వెళ్లడానికి ప్రేరేపిస్తున్న కారణాల చిక్కుముడులను విప్పడానికి సమాజం కృషి చేస్తూనే ఉన్నది.

1987లో, నాటి ప్రభుత్వం ఆలోచనా రహితంగా చేసిన చట్టంతో వంశపారంపర్య అర్చకత్వం రద్దు అయింది. ఇది సరైన నిర్ణయం కాదని ఎలుగెత్తి చాటిన దేవాలయాల పరిరక్షణ ఉద్యమం, వంశపారంపర్య అర్చకత్వం మళ్లీ పునః అర్చకులకు ఇవ్వాలని భగీరథ ప్రయత్నం చేస్తున్నది. దేవాలయాల పరిరక్షణ ఉద్యమం స్ఫూర్తితో భక్తులను ఈ దిశలో ఆలోచించేలా చేసింది.

తాము అర్చకత్వ బాధ్యతల నుండి తప్పుకోవడానికి వంశపారంపర్య అర్చకత్వ రద్దే ప్రముఖ కారణంగా పలు వంశపారంపర్య అర్చక కుటుంబాలు పేర్కొన్నాయి. జీవనోపాధికై ఇతర ఉద్యోగాలను చూసుకోవాల్సి వచ్చిందని వారు వాపోయారు. ‘‘అర్చకుని కొడుకు తండ్రికి వారసుడుగా పనికిరాడని ప్రభుత్వమే చట్టం చేస్తే మేమేమి చెయ్యాలి’’ అని ప్రభుత్వంపై నింద మోపారు. తమ బాధ్యతల నుండి తప్పించుకున్నారు. గ్రామీణ దేవాలయాలను మూతపెట్టి వలసలు వెళ్లిపోయారు.

1996లో అమలు చెయ్యడానికి సాధ్యపడని తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు, ఒక అద్భుతమైన తీర్పును చెప్పినట్లుగా తమను తామే అభినందించుకుంది. ఎట్టకేలకు 2007లో వైఎస్‌ఆర్‌ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచనా రహిత చట్టాన్ని సవరించి వంశపారంపర్య అర్చకత్వానికి పునః అవకాశం కల్పించింది. ‘ధార్మిక పరిషత్‌’ను ప్రవేశపెట్టింది. కానీ దురదృష్టవశాత్తు దేవాదాయ శాఖలోని కొద్దిమంది స్వార్థపరులైన అధికారులు తమ ధోరణిని మార్చుకోని కారణంగా ఆ చట్టం కూడా అమలుకు నోచుకోలేదు. అర్చకులు వీధినపడ్డారు. దేవాలయాలు మూతపడ్డాయి. దేవాదాయ చట్టంలో సూచించినట్లుగా భక్త సమాజాల స్థాపనే ఇక మనకు మిగిలిన ఏకైక ఆశ.

అయితే ఇక్కడ ఇంకొక పెద్ద సమస్య ఉంది. ఈ ధోరణి ఇంకా భయపెట్టేదిగా ఉంది. గ్రామీణ ఆలయాలన్నీ మూతపడ్డాయి. అక్కడ పూజలు చెయ్యడానికి అర్చక కుటుంబాలు లేవు. స్థానికులు ఆలయాలను పూర్వస్థితికి తీసుకురావాలని ముందుకు వస్తున్నా కూడా, అర్చకులు తిరిగి తమ పూర్వ బాధ్యతలు స్వీకరిస్తారా అనేది ప్రశ్నార్థకం. దీనికి పరిష్కారం ఏమిటి?

మనం, అవును. భక్తులమైన మనమే దీనికి తగిన పరిష్కారం ఆలోచించాలి. అర్చకులు గ్రామీణ ఆలయాలను వదిలి వెళ్లకుండా ఆపాలి. వారి కుటుంబ బాధ్యత మనం స్వీకరించాలి. ఈ పని ప్రభుత్వం ఏవో కొన్ని స్కీములు ప్రవేశపెట్టడం ద్వారా చెయ్యలేదు. దీనికి ఒకే మార్గం. భక్త సమాజాల స్థాపన. ఆలయాల నిత్య విధులకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ భక్త సమాజాలు ఆర్థిక సహాయాన్ని ఇవ్వగలవు.
ప్రతి గ్రామంలోనూ, అక్కడి స్థానికులైనా, లేకపోతే అక్కడి మూలాలు ఉన్నవారైనా కనీసం 15 కుటుంబాలు కలిసి సంవత్సరానికి కనీసం కొంత ధనాన్ని సేకరించగలిగితే, గ్రామంలోని ఆలయంలో నిత్య విధులు, ఉత్సవాలు సక్రమంగా జరిపించవచ్చు. నిజంగానే ఇది సాధ్యం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా... మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం. ఈ లక్ష్య సాధనకై అందరం పాటుపడదాం.


సి.ఎస్‌. రంగరాజన్‌
వ్యాసకర్త ఆలయాల సంరక్షణ ఉద్యమ కన్వీనర్‌ మొబైల్‌ : 98851 00614


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement