సుదీర్ఘంగా సాగే మహాయాత్ర కూడా ఒక చిన్న అడుగుతోనే మొదలయ్యేది. ఆ అడుగెలా పడిందన్నది ముఖ్యం. అందుకే, ఫ్రెంచ్ రచయిత, తాత్వికుడు వాల్టేర్ ‘ఈ ప్రపంచంలో... మనం వేసే తొలి అడుగును బట్టే మన తదుపరి పయనం ఆధారపడి ఉంటుంది’ అంటారు. పూర్ణ విశ్వాసంతో అధికారంలోకి తెచ్చిన ప్రజలకు, ‘మీరు మెచ్చే పాలన అందిస్తా’నని తొలిరోజే మాటిచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, మాట నిలబెట్టుకుంటూ గట్టి తొలి అడుగు వేశారు. నేటితో ఆయన పాలనకు ఏడాది. గద్దెనెక్కే నాటికి అత్యధికుల్లో వ్యక్తమైన నమ్మకాన్ని నిలబెడుతూ, అతి కొద్ది మంది సందేహాలు పటాపంచలు చేస్తూ ఏడాది పాలన సాగింది. సుదీర్ఘ పాదయాత్రలో, ఇతరత్రా ఇచ్చిన హామీలతో రూపొంది, ప్రకటించిన ఎన్నికల ప్రణాళికే తన కార్యపత్రమైంది. ఎంతో ప్రాధాన్యత ఇచ్చి దాన్నే ఆచరించారు. అప్పుడప్పుడు ఓ అడుగు ముందుకేసి కొత్త నిర్ణయాలకూ వెళ్లారు. అందుకే, ఇంటా బయటా ఆయన ఆశించిన ‘మెప్పు’ అపారంగా లభిస్తోంది.
కొన్ని అంశాల్లో దేశానికే ఆదర్శ ప్రాయ విధానాలు ఏపీలో అమలుపరుస్తున్నారు. అది కూడా స్వయంగా సంక ల్పించి, ప్రకటించిందే! ఏడాది కింద ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే, తనను కలిసిన ఆత్మీయ బృందంతో జగన్‌మోహన్‌రెడ్డి పిచ్చాపాటి మాట్లాడుతున్నపుడు పరిపాలనాంశం ప్రస్తావనకొచ్చింది. ఆయన తండ్రి డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి నాటి ఉమ్మడి రాష్ట్రంలో పాలనను కనీస ప్రామాణికం (బెంచ్ మార్క్) చేశారన్న మాటకు స్పందిస్తూ, ‘దేశంలోనే ఏపీని మనం ఆదర్శప్రాయం (రోల్ మాడల్) చేద్దాం’ అని వెల్లడించిన సంకల్పమాయనది. తర్వాత బహిరంగం గానూ ప్రకటించారు. రాష్ట్ర విభజనతో తలెత్తిన సమస్యలు, కిందటి ప్రభుత్వం ధ్వంసం చేసిపోయిన వ్యవస్థల–అవస్థలు, ఆర్థిక ఇబ్బం దులు ముప్పిరిగొన్నా.. సడలని ఆత్మవిశ్వాసంతో సాగిన పాలన. అను భవానికి–ఆవేశానికి మధ్య పొంతనా? అంటూ పడని వారు చేసిన దుష్ప్రచార కుట్రలన్నీ భగ్నమయ్యాయి. ప్రజాహితంలో లేని, పని కొచ్చేది కాని అనుభవం కన్నా... విజన్, విశ్వసనీయత కలిగిన నిబద్ధతే నిలుస్తుందని నిరూపితమైన పరీక్షా సమయమిది. ఫలితాలే అందుకు నిదర్శనం. అన్నం ఉడికిందా లేదా అని మొత్తం చూడనక్క ర్లేదు, నాలుగు మెతుకులు ముట్టి చూస్తే చాలు!
గ్రామ స్వరాజ్యం
వ్యవసాయాధారిత రాష్ట్రంలో రైతుకు దన్నుగా నిలుస్తూనే సమగ్ర గ్రామీణ వికాసం ఎజెండా చేశారు. గ్రామ–వార్డు సచివాలయం, వాలంటరీ సర్వీసు వ్యవస్థతో గ్రామీణ విప్లవానికి నాందిపలికి దేశానికి ఆదర్శమయ్యారు. ‘నా ఆలోచనల్లో గ్రామ స్వరాజ్యం అంటే, పూర్తి గణతంత్రం, తనకు కావాల్సింది సమకూర్చుకునే స్వేచ్ఛ, స్వతం త్రాలతో గ్రామం శక్తివంతం అవడం... సహకార పద్దతిలో పనిచేస్తే ప్రతి గ్రామం ప్రగతిపథంలో సాగుతుంది. అన్నీ అక్కడే సమకూరాలి. ఊళ్లో ఎవరూ ఖాళీ ఉండొద్దు. వాళ్లకు వాళ్లే గ్రామస్తులు జాగ్రత్తప డాలి...’ అని జాతిపిత గాంధీ సేవాగ్రామ్‌లో ప్రసంగం (22.10.41), హరిజన్ పత్రికలో వ్యాసం (26.6.1942), నెహ్రూకు లేఖ (5.10. 1945) వేర్వేరు సందర్భాల్లో చెప్పారు. గాంధీజీ కలలు నిజం చేసే కార్యాచరణ ఏపీలో మొదలైంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులెవరూ తమ అవస రాలకు నాయకుల, అధికారుల, పైరవీకార్ల వెంట తిరిగే పనిలేకుండా ముంగిట్లోకే సౌకర్యాలన్నీ సమాకూర్చే వ్యవస్థను తెచ్చారు. 15003 సచివాలయాలు ఏర్పడ్డాయి. వాటిల్లో 1.34 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. 2.70 లక్షల మంది వలంటీర్లు లబ్ధిదారులకు చేయూతనిస్తున్నారు. సంక్షేమ ఫలాలను ఇంటికి వెళ్లి అందిస్తున్నారు, వారి వినతులు–ఫిర్యాదుల్ని స్వీకరిస్తున్నారు, పరిష్కరించే సంధాన కర్తలుగా వలంటీర్లు వ్యవహరిస్తున్నారు.
తాజా సమీ క్షల్లో మాట్లాడుతూ ‘80 శాతం పైగా వలంటీర్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నుంచి రావటం... ఆయా వర్గాలే ప్రభుత్వ పథకాల్లో ముఖ్య లబ్ధిదారులవడంతో అవినీతి, అవకతవకలకు ఆస్కారం లేని సామాజిక న్యాయసాధనకు అవకాశం పెరిగింది’ అని సీఎం చేసిన వ్యాఖ్య అక్షరసత్యం. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అర్హు లైన అందరికీ ప్రభుత్వ పథకాల మంజూరీ ఆన్ లైన్‌లో 72 గంటల్లోనే జరిగేలా చూస్తున్నారు. ఈ సచివాలయ–వలంటరీ వ్యవస్థ పలు సర్వేలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి గ్రామ స్థాయిలో ఇటు కాళ్లూ–చేతు లుగా అటు కళ్లూ–చెవులుగా ఉంటోంది. కోవిడ్–19 వంటి విపత్కర కాలంలో వారి సేవలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి.
విద్యతోనే భవిత
ఎవరి జీవితాల్నైనా శాశ్వత ప్రాతిపదిక బాగుచేయాలంటే వారికి కచ్చి తమైన విద్యావకాశాలు కల్పించాలని ఏపీ సీఎం తరచూ అంటుం టారు. ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా రాష్ట్రంలో ఒక సమగ్ర విద్యావిధానానికి ఆయన రూపమిచ్చారు. ‘విద్యే భవితకు యోగ్యతా పత్రం, దానికోసం ఇవాళ సంసిద్ధమైన వాళ్లకే రేపు దక్కుతుంది’ అని అమెరికా పౌరహక్కుల పోరాట యోధుడు మాల్కమ్ ఎక్స్ అంటారు. పేదలకు సరైన విద్య దక్కాలంటే ఎన్ని కష్టాలో ప్రభుత్వం గుర్తించింది. పిల్లలందరినీ బడికి పంపేలా తల్లులకు ఆర్థికంగా సహాయ పడే ‘అమ్మఒడి’, బడుల్లో మౌలిక సదుపాయల్ని పెంచే ‘నాడు నేడు’, పిల్లలు పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫామ్ తదితరాలు సమకూర్చు కునేలా ‘విద్యాదీవెన’, బయటుండి చదివే పెద్ద పిల్లల ఖర్చుల నిమిత్తం ‘వసతి దీవెన’ ఇలా ఎన్నో కార్యక్రమాల్ని తలిదండ్రులే కాక ఇరుగుపొరుగు రాష్ట్రాల నిపుణులు, విద్యావేత్తలూ ప్రశంసిస్తున్నారు.
ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు ఇంగ్లిష్ మాధ్యమ బోధన లభించక ఉద్యోగావకాశాల్లో, ఇతర పోటీల్లో వెనుకబడి పోతు న్నామనే భావన బలంగా ఉంది. ఈ కష్టం పేదలది మాత్రమే కాదు. దిగువ, మధ్య తర గతి కుటుంబాలు కూడా తమ స్థాయిని మించిన వ్యయంతో ప్రైవేటు ఇంగ్లిష్ చదువులు చెప్పించాల్సి వస్తోంది. పరిష్కారంగా రాష్ట్రంలోని 44,512 సర్కారు బడుల్లో దాదాపు 42 లక్షలమంది విద్యారులకు మేలు జరిగేలా ఆంగ్లమాధ్యమ విద్యావకాశాన్ని ప్రభుత్వం కల్పి స్తోంది. ఆహార నాణ్యత మెరుగయ్యే ‘మెనూ’ స్వయంగా ముఖ్య మంత్రే నిర్ణయిస్తూ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పకడ్బందీగా అమలు పరచడం విద్యాప్రమాణాలు పెంచేదే! పేదలకు ఉన్నత విద్యావకాశం కల్పించే ‘ఫీజు రీయింబర్స్ మెంటు’ను పూర్తిస్థాయిలో అమలుపరచడమూ దేశంలో రికార్డే!
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్
డాక్టర్ వైఎస్సార్ విప్లవాత్మకంగా చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడు ఏపీలో విస్తృతపరిచారు. అనుమతించే జబ్బుల సంఖ్య, ఆస్ప త్రుల సదుపాయం, అర్హుల ఎంపిక, మందుల లబ్ది... ఇలా పలు విధా లుగా ఈ పథకం విస్తృతి పెంచారు. ఆరోగ్యశ్రీ కింద ప్రత్యేక వైద్య సేవలు రాష్ట్రంలోనే కాక బయట ఎక్కడైనా పొందవచ్చు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రధాన చికిత్స ముగిసి, కోలుకునే సమయంలో రోజుకు రూ.225 చొప్పున ‘ఆరోగ్య ఆసరా’ కింద డబ్బిచ్చే విధానాన్ని కొత్తగా తీసుకువచ్చారు. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవారికి నెలకు రూ. 5వేల పెన్షన్ ఇస్తున్నారు. ‘మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం, వరం’ అన్న గౌతమ బుద్ధుడి మాటల స్ఫూర్తి పాలనలో ప్రతిబింబిస్తోంది. వైద్య సదుపాయాల్ని వికేంద్రీకరిస్తూ, జబ్బొస్తే సామాన్యులు నలిగిపోకుండా సేవలు–సదుపాయాల్ని పెంచే ఏర్పా ట్లలో సర్కారుంది. ‘నాడు–నేడు’ పథకం ద్వారా మౌలిక సదుపా యాల్ని పెంచుతున్నారు. పీహెచ్‌సీలు 989 భవనాల పునర్నిర్మాణం, 149కి కొత్త భవనాలకు రూ.671 కోట్లు వ్యయం చేయనున్నారు. ‘108 అంబులెన్స్’, ‘104 అత్యవసర వైద్య వాహన’ సదుపాయాల్ని ప్రతి మండలానికీ అందుబాటులోకి తెస్తున్నారు. 52 ఏరియా ఆస్పత్రుల్లో, 117 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సదుపాయాల వృద్ధికి రూ.1,236 కోట్లు వ్యయం చేస్తున్నారు. గ్రామ–వార్డు సచివాలయాలకు అను బంధంగా 10,060 విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటుకు నిర్ణయించారు. వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల సంఖ్య పెంచుతున్నారు. కోవిడ్ పరీక్ష ల్లోనూ దేశంలోనే రికార్డు సామర్థ్యం ఏపీ సాధించింది. పాజిటివ్ కేసుల, మరణాల రేటు తగ్గించి, రికవరీ రేటు పెంచగలిగింది.
మహిళాభ్యుదయం
ప్రత్యేక చర్యలు, కార్యక్రమాలు ద్వారా ఏపీ ప్రభుత్వం మహిళల్లో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మహిళా ప్రగతి రాష్ట్రానికి పలు రెట్లు మేలని సీఎం తరచూ చెబుతుంటారు. వారిపై అఘాయిత్యాల్ని నిరోధించేందుకు పకడ్బందీ ‘దిశ’ చట్టం తెస్తూ దేశానికే ఆదర్శమ య్యారు. ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు హోంమంత్రిత్వ శాఖ ఇస్తూ మహిళలకు మంత్రివర్గంలో పెద్ద పీట వేశారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్... పథకాల్లో నగదు లబ్ధిని మహిళల అకౌంట్లలోకే జమ చేస్తున్నారు. జీరో వడ్డీ రుణ సదుపాయంతో పాటు రేపు పెద్ద సంఖ్యలో జరిపే ఇళ్లనిర్మాణం కూడా మహిళల పేరిటే జరుగుతోంది. నిజమైన మహిళాసాధికారత ద్వారా రాష్ట్రంలో కుటుంబ వికాసాన్ని ప్రభుత్వం ఆశిస్తోంది. ‘జనాభాలో సగ భాగాన్ని అలా వెనక్కి వదిలేసిన ఏ దేశమూ నిజమైన ప్రగతి సాధించ లేదు’ అంటారు బ్రిటన్ మాజీ మంత్రి జస్టిన్ గ్రీనింగ్.
ఇవి మచ్చుకు కొన్నే! రైతు భరోసా, ఉచిత విద్యుత్తు, దశల వారీ మద్యనిషేధం, చేతి వృత్తులకు చేయూత వంటి ‘నవరత్నాల’తో ఏపీ పాలన పురోగమిస్తోంది. సీఎం చెప్పినట్టు తొలి ఏడాదే ఎన్నికల ప్రణా ళికను 90 శాతం నెరవేర్చడం రికార్డు. తండ్రి వైఎస్సార్ వంటి మహా నేత నుంచి స్ఫూర్తి పొందారు. స్వయంగా ఓదార్పు, పాదయాత్రలతో జనం కష్టాల్ని లోతుగా పరిశీలించిన అనుభవంతో పాలనకు జగన్ మోహన్‌రెడ్డి మెరుగులు దిద్దడం చూస్తుంటే విన్‌స్టన్ చర్చిల్ చెప్పిన ఓ గొప్ప మాట గుర్తొస్తోంది. ‘శిఖరాగ్రాలు నేతలకు స్ఫూర్తినిస్తాయి. కానీ, లోయలే వారిలో పరిపక్వత తీసుకువస్తాయి’.
దిలీప్ రెడ్డి
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment