సందర్భం
రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక వినూత్నమైన చారిత్రక పరిణామాలు మే నెలలోనే ప్రత్యేకించి పశ్చిమగోదావరి జిల్లాలోనే జరిగాయి. 15 ఏళ్ల క్రితం వైఎస్ రాజ శేఖర రెడ్డి తన ‘ప్రజా ప్రస్థానం’ చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురానికి పాదయాత్ర చేపట్టిన సందర్భంగా మే నెలలోనే 15వ తేది పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. ఇడుపులపాయ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్ఛాపురం వరకూ వైఎస్ తనయ వైఎస్ షర్మిల జరిపిన ‘మరో ప్రజా ప్రస్థానం’ కూడా 2,000 కిలోమీటర్ల పాదయాత్ర సాగిన తర్వాత మే నెలలోనే పశ్చిమగోదావరిలోకి ప్రవేశించింది.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ‘ప్రజాసంకల్పయాత్ర’ కూడా 2,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుని ఈ నెల 14న ఏలూరులో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగుదేశం పాలనలో, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, వలసలు వెళ్లడం లాంటి ఒక బీభత్స సామాజిక వాతావరణం నేపథ్యంలో తన పాదయాత్రను కొనసాగించారు. ఆత్మహత్యలు చేసుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సువర్ణ పాలన సాధిస్తాం అధైర్యపడొద్దంటూ తన పాదయాత్రలో ఆయన ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు.
వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో చీకటి ఒప్పందాలు చేసుకుని వైఎస్ కుటుంబంపై ప్రత్యేకించి వైఎస్ జగన్‌పై అనేక అక్రమ, అవినీతి కేసులు బనాయించి కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా 16 నెలలు జైలులో నిర్భంధించింది. ఎల్లోమీడియాగా పేరుపడిన పత్రికలు వైఎస్ కుటుంబంపై ప్రత్యేకించి వైఎస్ జగన్‌పై నీచ నికృష్ట్టమైన అవినీతి ఆరోపణలు చేస్తూ ఒక ప్రచార యుద్ధం లాంటిది చేపట్టారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ వైఎస్ షర్మిల మరో ‘ప్రజాప్రస్థానం’ చేపట్టారు. ఆమె తన 2,000 కిలోమీటర్ల పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోనే పూర్తి చేసుకున్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం పాదయాత్రలో భాగంగా మే నెలలోనే పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. ఇప్పుడు మే 14వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ ఒక చారిత్రక స్థూపం (పైలాన్)ను ఆవిష్కరించనున్నారు. చంద్రబాబు పరిపాలనకు వ్యతిరేకంగా లేదా బాబుతో కలగలసి ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంపై పాదయాత్రలు జరిగాయి. నేడు కూడాబాబు, కాంగ్రెస్ పార్టీ ఒకరకంగా బహిరంగ రహస్య ఒప్పందంతో పాలన సాగించడం జరుగుతోంది. కాంగ్రెస్, తెలుగుదేశం వైఎస్ జగన్‌కి వ్యతిరేకంగా ఒకరకంగా చెప్పాలంటే వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా చేతులు కలిపి పనిచేస్తున్నాయి.
నేడు మండుటెండలో వైఎస్ జగన్ అకుంఠిత దీక్షతో జరుపుతున్న పాదయాత్రకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు జేజేలు పలుకుతున్నారు. వైఎస్ జగన్‌కు మద్దతుగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. కానీ వైఎస్ జగన్ బీజేపీతో లాలూచీ పడ్డాడు అంటూ ఎల్లో మీడియా, బాబు అనుచర వర్గం తీవ్ర ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సినీ నటుడు పవన్ కల్యాణ్ కూడా జగన్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. బాబు కుట్రలు, కుతంత్రాలు, కపట నాటకాలతో ప్రజలను నమ్మించి మోసగించడంలో దిట్ట.
ఆయన ఎన్టీ రామారావును మొదలుకుని వామ పక్షాలను, చివరకు బీజేపీని నమ్మించి, మోసగించి తన పని చేసుకోగల దిట్ట. ఆయనకు బిడియం, ఎగ్గు, సిగ్గులలో నమ్మకం లేదు. ఆయన హయాంలో ప్రజల కోసం చేపట్టిన పథకాలంటూ ఏవీ లేవు. నేడు రాష్ట్రంలో సేద్యపు నీటి రంగంలో అవినీతి, అక్రమాలు ఏరులై పారుతున్నాయి. రాజకీయ వ్యవస్థలను పోలీసు, రెవెన్యూ న్యాయ యంత్రాంగాన్ని తనదైన శైలిలో నిస్తేజపరిచి ప్రజాస్వామిక సూత్రాలకు తిలోదకాలు ఇచ్చి పరిపాలన కొనసాగిస్తున్నాడు.
23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను ఇంకా అనేక మంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులను తన అవినీతి, అక్రమ పద్ధతుల ద్వారా కొనుగోలు చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తన అనుచర వర్గాన్ని రూపొందించారు. పాత్రికేయులకు నెలసరి జీతాలు ఇచ్చిన ముఖ్యమంత్రి బాబే! ఎన్నికలను తనకు అనుకూలంగా మలుచుకోగలనని తన వద్ద ఉన్న డబ్బు పోగేసి రెవెన్యూ యంత్రాంగం ద్వారా నెగ్గుకురాగలననే విశ్వాసంతో బాబు పాలన కొనసాగిస్తున్నారు.
మరోవైపు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్ర ద్వారా లక్షలాది మంది ప్రజలను కలుస్తూ వందలాది బహిరంగ సభలను రాజకీయ పాఠశాలలుగా మార్చి రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరిస్తూ మరో ‘ప్రజాసంకల్పయాత్ర’ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు వైఎస్ జగన్ కల్పించిన సానుకూల రాజకీయ వాతావరణంతో విపరీతమైన ఆత్మవిశ్వాసంలోకి వెళ్లకుండా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను ప్రజల్లో ఎండగడుతూ ప్రజలకు చేరువ కావడానికి కృషి చేయాలి. ఆ రకంగా జగన్‌కు ప్రోత్సాహం అందించినవారవుతారు.
- ఇమామ్
వ్యాసకర్త కదలిక సంపాదకులు
మొబైల్ : 99899 04389
Comments
Please login to add a commentAdd a comment