నిష్క్రమణే నికార్సయిన మందు! | Guest Column By Harish Khare Over Rahul Gandhi | Sakshi
Sakshi News home page

నిష్క్రమణే నికార్సయిన మందు!

Published Wed, Jun 5 2019 1:17 AM | Last Updated on Wed, Jun 5 2019 6:40 AM

Guest Column By Harish Khare Over Rahul Gandhi - Sakshi

కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ

జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీలను అంతర్గతంగా కూడా ప్రశ్నిస్తూ వచ్చిన రాజకీయ సంస్కృతి సోనియా గాంధీ హయాం నుంచి కనుమరుగు కావడమే కాంగ్రెస్‌ ప్రస్తుత పతనానికి ముఖ్యకారణం. కుటుంబ నాయకత్వంపట్ల తిరుగులేని విశ్వాసం ప్రదర్శించడంతో పార్టీ స్వీయ విమర్శనా సమర్థతకు తీవ్ర హాని జరిగింది. కొత్త ప్రయోగాలు చేయడానికి సిద్ధం కావడం కాదుకదా.. మార్పు అనే భావనకే అది దూరమైపోయింది. రాహుల్‌ గాంధీ స్వీయ నిష్క్రమణ కాంగ్రెస్‌ భవిష్యత్తుకు నిక్కమైన మేలు చేస్తుంది. చరిత్రలో నిర్ణాయకమైన స్థానంవైపు ముందుకు నడవడంలో ఏ రాజకీయ పార్టీ అయినా కఠిన నిర్ణయానికి సిద్ధపడాల్సి ఉంటుంది. ఈ సంధికాలంలోనే పార్టీ సభ్యులు నాయకత్వాన్ని పరీక్షించడం, ప్రశ్నించడం నేర్చుకోవాలి. సంస్థ నిర్మాణాన్ని బాగు చేసుకోవడంలో కాంగ్రెస్‌ నిజంగా రక్తమోడ్చాల్సి ఉంటుంది.

కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సూత్రాలు, దాని సిద్ధాంతం, దాని విధానాలు, సంప్రదాయాల గురించి చర్చించే అవకాశం తమకు కల్పించినందుకు కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు యావన్మందీ రాహుల్‌ గాంధీకి కృతజ్ఞులై ఉండాలి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం పొందడంతో రాజకీయ పార్టీ అంటే ఎన్నికలకు సంబంధించింది మాత్రమే కాదని, దానికి మించిన ప్రాధాన్యం ఉంటుందని కాంగ్రెస్‌ వాదులకు బోధపడింది. దేశ ఐక్యత, సమగ్రత, భద్రత, సుస్థిరత, సౌభాగ్యం, సామరస్యం, సమానత్వం, న్యాయం వంటి భారత రిపబ్లిక్‌ ఆశయాల పరిరక్షణకు సదా నిలుస్తూ వచ్చిన సూత్రబద్ధ సంస్థగా కాంగ్రెస్‌ పార్టీ బ్రాండ్‌ విలువను పునరుద్ధరిం చేందుకు రాహుల్‌ రాజీనామాకు మించిన గొప్ప సందర్భం బహుశా ఉండదు.

పైన పేర్కొన్న విలువలు, లక్ష్యాలు ఏ సంఘటిత రాజకీయ సంస్థకైనా అవసరమే. అనుకూల, వ్యతిరేక స్వభావంతో ఉన్న ఇరుగుపొరుగు దేశాలు, అననుకూలమైన, ఇబ్బందికరమైన ప్రపంచ వాతావరణం రెండింటినీ సర్దుబాటు చేసుకుని భారత ప్రభుత్వం ముందుకు నడుస్తున్న తరుణమిది. జాతీయ స్వాతంత్య్ర పోరాటాన్ని నడపటంలో, శిశుప్రాయంలోని జాతీయ రాజ్యాన్ని సంఘటిత పర్చడంలో బలమైన రాజకీయ ఉపకరణంగా నిలిచిన కాంగ్రెస్‌ పార్టీకి గర్వించదగిన చరిత్ర ఉంది. పైగా మన ప్రజాస్వామిక రాజ్యపాలనా విధానాన్ని సచేతనంగా ఉంచడంలో ఈ పార్టీ కీలకపాత్ర పోషిస్తోంది కూడా. 

ఇంతటి ఘనతర చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి తన రాజకీయ స్వరాన్ని మళ్లీ కనుగొనవలసిన అవసరం ఉంది. ఇన్నాళ్లుగా కాంగ్రెస్‌ వాదులు తమ పార్టీ నాయకత్వాన్ని డిమాండ్‌ చేయడం ఆపివేసిన కారణంగానే ఈ లక్ష్యం నిర్లక్ష్యానికి గురైంది. అయితే కాంగ్రెస్‌ అన్ని కాలాల్లోనూ ఇలాగే ఉండేదని చెప్పలేం. గతాన్ని కాస్త పరికిద్దాం. జవహర్‌లాల్‌ నెహ్రూ దేశ ప్రధానిగా పనిచేసినంత కాలం ఆయన విధానాలు సొంతపార్టీలోనే సవాలుకు గురయ్యేవి. ఇక ఇందిరాగాంధీ హయాంలో స్పష్టంగా రెండు చీలికలను మనం చూడవచ్చు.

మారుతున్న రాజకీయ అర్థశాస్త్రానికి అనుగుణంగా పార్టీ అంతర్గత సమీకరణలను పునరేకీకరించడానికి ఈ చీలికలు ముందుకొచ్చాయి. ఇక రాజీవ్‌ గాంధీ హయాంలో వీపీ సింగ్, అరుణ్‌ నెహ్రూ, పీవీ నరసింహారావు ఆయనతో నేరుగా తలపడ్డారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వీరు రాజీవ్‌ని సవాలు చేశారు. ఈ క్రమంలో తల్కతోరా స్టేడియంలో జరిగిన ఒక బోగస్‌ తిరుగుబాటు ఉదంతాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇక తర్వాత ఎన్నికైన పార్టీ అధ్యక్షుడు సీతారాం కేసరిని 1998 మార్చి 14న జరిగిన అప్రతిష్టాకరమైన కుట్రలో పదవినుంచి తొలగించేశారు. 

ఆనాటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తన యధాతథ స్థితి పట్ల సౌకర్యవంతంగా ఫీలవుతూ, పూర్తి సంతృప్తి చెందుతూ కాలం గడుపుతూ వచ్చింది. కుటుంబ నాయకత్వ నమూనా పట్ల తిరుగులేని విశ్వాసం ప్రదర్శించిన యధాతథ స్థితిని అనాలోచితంగా ఆలింగనం చేసుకోవడంతో తనను తాను విమర్శించుకోవడంలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న సమర్థతకు తీవ్రంగా హాని జరిగింది. ఈ ఆరాధనా భావం వల్ల పార్టీ విధానాలు దెబ్బతినిపోవడమే కాకుండా, జాతీయ లక్ష్యాలు, ప్రయోజనాలకు కూడా హాని కలిగింది. ఈ క్రమంలో సంస్థాగత నిర్మాణంలో ఎలాంటి కొత్త ప్రయోగాలు చేయడానికి కూడా ఆ పార్టీ భీతిల్లిపోయింది. పైగా మార్పు అనే భావననుంచే అది దూరం జరిగిపోయింది.

పార్టీ అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం పనిచేసిన సోనియా గాంధీ అనుభవజ్ఞులైన, సీజనల్‌ నేతల కూటమికి మాత్రమే అందుబాటులో ఉండేవారు. పార్టీ పాలనా విధానంలో నెహ్రూవియన్‌ సమానతావాదానికి కేంద్ర స్థానం కల్పిస్తూ పాత విధానాలనే పునరుద్ధరించాలని వీరు ఆందోళన చేసేవారు. వీరే సోనియాకు రక్షణ కవచంగా ఉండి ఆమెను రక్షించే పనిలో మునిగిపోయారు. కానీ అలాంటి నాయకులందరూ ఇప్పుడు ముసలివారైపోయారు. పైగా గాయాల బారిన పడిన పార్టీని యధాతథంగా కొనసాగించడం అనే ఆటలో వీరంతా అలసిపోయారు. వారసత్వాన్ని సమర్థిస్తూవచ్చిన ఈ వయోవృద్ధులు ఎవరూ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఏకైక అభ్యర్థిగా రాహుల్‌ గాంధీనే తగినవారు అనే భావనను ముందుకు తీసుకెళ్లడంలో స్వయంగా రాహుల్‌నే మెప్పించలేకపోయారు.

తమ సొంత కుమారులను, కుమార్తెలను ప్రోత్సహించే విషయంలో ప్రలోభాలకు దూరంగా ఉండటంలో విఫలమైన వీరు రాహుల్‌ గాంధీకి రాజకీయ సమగ్రత్వం, సంపూర్ణత్వం అలవర్చగలరని ఎలా ఊహించగలం?
తన వెనుకనుంచి తనకు తగిలిస్తున్న ‘పప్పు’ ముద్రనుంచి బయటపడటానికి రాహుల్‌ గాంధీకి దాదాపు దశాబ్ద కాలం పట్టింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌ గట్టి పోరాటమే చేశారు. చాలామంది ఈ ఎన్నికల్లో రాహుల్‌ పనితీరుపట్ల ప్రశంసలు కురిపించారు. తీవ్రమైన వెనుకంజలు, ఎదురుదెబ్బలను తట్టుకుని నిలబడటంలో రాహుల్‌ కనబర్చిన అసాధారణ స్థిరత్వం పట్ల ప్రజల్లో గౌరవం పెరిగింది. కానీ రాహుల్‌ చేసిన ఈ రాజీనామా విషయం ఎలా అర్థం చేసుకోవాలి? తనపై దాడికి దిగిన కాషాయపార్టీ ప్రత్యర్థులతో తలపడడానికి అవసరమైన నిర్ణయాత్మక శక్తి, నిపుణతలు, కృత నిశ్చయం వంటివి తనకు లేవని రాహుల్‌ స్వయంగా అర్థ చేసుకున్నట్లు కనబడుతోంది.

భారతదేశంలో కానీ, ప్రపంచంలో మరెక్కడైనా సరే రాజకీయ జీవితం అనేది వ్యక్తులకున్న పరిధిని, మనోభావాలను సామూహిక హితానికి పూర్తిగా లోబర్చవలసి ఉంటుందని డిమాండ్‌ చేస్తుంటుంది. ఇలా చేయడం తనకు సాధ్యం కాదని రాహుల్‌ భావిస్తూ ఉండవచ్చు. అందుకే రాహుల్‌ గాంధీ తన అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను కాంగ్రెస్‌ ఇప్పుడు తప్పకుండా ఆమోదించాలి. గాంధీ కుటుంబం వెలుపల నుండి ఆయన స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడిని కనుగొనాల్సి ఉంది. ఇది కీలకమైన దశ. కాంగ్రెస్‌ పార్టీ ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. చరిత్రలో నిర్ణాయకమైన స్థానంవైపు ముందుకు నడవడంలో ఏ రాజకీయ పార్టీ అయినా కఠిన నిర్ణయానికి సిద్ధపడాల్సి ఉంటుంది.

మారుతున్న కాలంలో ప్రజల అవసరాలకు సమాధానం ఇవ్వడంలో వాజ్‌పేయి, అడ్వాణీ ద్వయం ఇక ముందుకు పోలేరన్న వాస్తవాన్ని బీజేపీ కేడర్లకు, నాయకులకు వివరించి నచ్చచెప్పడంలో నరేంద్రమోదీ అద్భుత కృషి చేశారు. పైగా రాహుల్‌ గాంధీ వయస్సు కూడా ఒక ప్రశ్నగా మారింది. అంటే ఆయనను ఇప్పుడు ఇంటికి వెళ్లడానికి అనుమతించకపోతే, మరో 20 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌నే అంటిపెట్టుకుంటుంది. అది కూడా రాహుల్‌ పెట్టే షరతులపైనే పార్టీ కొనసాగాల్సి ఉంది. ఇది కచ్చితంగా వారసత్వాన్ని కొనసాగించడం వైపే సాగుతుంది. ఇదే సమయంలో ప్రియాంక గాంధీని స్టార్‌ కేంపెయినర్‌గా ముందుకు తీసుకురావడం ఎన్నికల సీజన్‌లో ఒక రకమైన శక్తిని పార్టీకి తీసుకొచ్చింది.

కానీ దీనివల్ల కూడా కాంగ్రెస్‌ పార్టీ వారసత్వ ముద్రనే మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చినట్లయింది. దీంతో కాంగ్రెస్‌ భాయి–బెహెన్‌ (అన్నా, చెల్లెలు) పార్టీ స్థాయికి కుదించుకుపోయింది. అందుకే నామ్‌ధార్, కామ్‌ధార్‌ నినాదంతో నరేంద్రమోదీ ఈ వంశపారంపర్య రాజకీయాలను తన ప్రచారంలో సులువుగా ఎండగట్టగలిగేరు. అమేథీలో రాహుల్‌ నామినేషన్‌ దాఖలు చేసిన రోజు అప్రదిష్ట పాలైన రాబర్ట్‌ వాద్రా తెరముందుకొచ్చారు. ఆయన కుమారుడు రెహాన్‌ కాంగ్రెస్‌ కుటుంబ రాజకీయ వ్యవస్థ సంభావ్య వారసుడిగా ఆ సమయంలో కనిపించాడు. ఒకరకంగా 2019 పోలింగ్‌కి కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల పరాజయం కంటే ఎక్కువ విలువ కలిగింది. వారసత్వ రాజకీయ నాయకత్వ నమూనాను ఇది తిరస్కరించింది. ఏమాత్రం రాజీపడని రాజకీయ ప్రత్యర్థిని కాంగ్రెస్‌ ఎదుర్కొంది.

నెహ్రూవియన్‌ విదానాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని వ్యతిరేకిస్తున్న ఒక సిద్ధాంతంతో కాంగ్రెస్‌ పార్టీకి సవాలు ఎదురైంది. దీంతో భారతీయ సామాజిక సమీకరణాలనే కాంగ్రెస్‌ కొత్తగా మథనం చేయాల్సి వచ్చింది. మన దేశపౌరులకు తిరిగి హామీ ఇవ్వగలిగిన ఒక విశ్వసనీయమైన ప్రాపంచిక దృక్పథాన్ని అది నేర్చుకోవలసి వచ్చింది. పైగా తన కేడర్, కార్యకర్తలు సంతోషంగా స్వీకరించగలిగిన ఒక స్పష్టతను, దార్శనికతను అది ప్రదర్శించవలసి వచ్చింది. దీనికోసం కాంగ్రెస్‌ పార్టీకి నిజంగానే సాంస్కృతిక విప్లవం లాంటిది అవసరమవుతుంది.. కానీ ఈ తరహా పరిష్కారంలో ‘గాంధీ’లు భాగం కాలేరు.

పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్‌ గాంధీ నిష్క్రమణను కాంగ్రెస్‌ దయతో అనుమతించాల్సి ఉంది. అనేకమంది కాంగ్రెస్‌ వాదుల వ్యక్తిగత అదృష్టాలు గాంధీ కుటుంబంతోనే ముడిపడివున్నాయి. ఇలాంటి నాయకులే ఇప్పుడు రాహుల్‌ పదవినుంచి దిగిపోతే, అస్త్రసన్యాసం చేస్తే పార్టీ విచ్ఛిన్నమవుతుందనీ, కుప్పగూలిపోతుందనీ భయాందోళనలను ప్రచారం చేస్తూ వస్తున్నారు. అనివార్యమైన ఈ ఉపద్రవం, ఈ కల్లోలభరిత కాలం కాంగ్రెస్‌ పార్టీకి నిజంగానే మంచి చేస్తుంది. ఈ సంధికాలంలోనే పార్టీ సభ్యులు నాయకత్వాన్ని పరీక్షించడం, ప్రశ్నించడం నేర్చుకోవాల్సి ఉంటుంది. పైగా అవసరమైతే నాయకత్వానికి, కార్యకర్తలకు మధ్య, ఆదేశాలకు, విధేయతకు మధ్య ఉన్న సంబంధాల సంప్రదాయాన్ని కూడా వీరు ఛేదించవలసి ఉంటుంది. యావత్‌ పార్టీ నిర్మాణాన్ని బాగు చేసుకునే క్రమంలో కాంగ్రెస్‌ నిజంగానే రక్తమోడ్చాల్సి ఉంటుంది.

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
‘ది వైర్‌’తో ప్రత్యేక ఏర్పాటు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement