ట్రిపుల్ తలాక్ అన్నాక భర్తను జైలులో వేస్తే ఆమె భరణం ఎవరిని అడగాలి? ఎక్కడ ఉండాలి? జైలులో ఉపాధిలేని భర్త కుటుంబాన్ని ఎట్లా పోషిస్తాడు? పోనీ అలాంటి కేసుల్లో మహిళలకు ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాయా? భరణం, వేతనం, ఆశ్రయం కల్పిస్తాయా? అంటే అదీ లేదు. వారిని గాలికి వదిలేయడమే. ఇది బాధితులకు ఏ రకంగా న్యాయం చేసినట్టు? ఒకవైపు స్త్రీలకు రక్షణ కల్పిస్తున్నట్టు కనబడుతూ.. మరోవైపు మైనారిటీ పురుషుల్ని నేరస్తుల్ని చేసే ప్రయత్నం ఇది. మత ఆచారాలు, మూఢ సంప్రదాయాల వల్ల, ఇతర కారణాలవల్ల భార్యల్ని వదిలేసే పద్ధతులు ఎవరు అనుసరించినా అంటే మతంతో పర్సనల్ లా లతో సంబంధం లేకుండా.. అది ఒక సమస్య. దాని పరిష్కారానికి ఏం చేయాలి? గృహ హింస చట్టం అందరికీ వర్తింపజేసి పటిష్టంగా అమలు చేయటం ద్వారా కుటుంబ వివాదాలు పరిష్కరించాలనే అసలు ప్రశ్నలు గాలికి వదిలేసి.. ఎవరికి భద్రత చేకూరుస్తారు?
బే సబాబ్ హం బే గునావోం పర్ రవా మత్ కర్ సితం/ కర్ సితం హం కోం కియా హై కతల్ క్యోం తున్ బే సబాబ్ – సిరాజ్ ఔరంగాబాదీ (1716) ‘అమాయకులపై నీ క్రూర మైన చూపెందుకు?/ ఏ నేరం, ఏ కారణం లేకుండానే నీ చూపులోని క్రూరత్వం మమ్మల్ని హత్య చేసింది’’ అని రాసిన ఈ గజల్ 18వ శతాబ్దం ప్రారంభం లోనిది... ఇది ప్రస్తుత ట్రిపుల్ తలాక్ బిల్లుకు సరిగ్గా సరిపోతుంది. ట్రిపుల్ తలాక్... ఒకేసారి మూడుసార్లు ఆ మాటంటే ఆ భార్యను వదిలేయొచ్చనేది ఇస్లాంకి వ్యతిరేకం అని అంటున్నారు ఇప్పుడు. గత పాతి కేళ్లుగా మహిళా ఉద్యమాలు మైనారిటీ మహిళల కనీస హక్కుల గురించి ప్రశ్నించినప్పుడంతా మిన్న కుండిపోయిన అధిక శాతం మతపెద్దలు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అడగలేదు? ఇప్పుడు టైమి య్యండి సరిచేస్తాం అంటున్నారు. గత 70 ఏళ్లుగా మైనారిటీల్లోని అభద్రతను ఆసరా చేసుకుని మతం పట్టు బిగించడం కోసం మహిళల హక్కులకు తూట్లు పొడిచి.. ఇస్లాం వ్యతిరేక ఆచారాలను అనుమతిం చడం లేదా చూసీ చూడనట్టు పోయినదాని పర్యవసా నమే.. ఇస్లాం మహిళలను అణచివేస్తుందనే భావన బలపడటానికి కారణం. ఈరోజు మహిళల సమా నత్వం ముసుగులో మైనారిటీ పురుషుల్ని నేరస్తు లుగా బోనులో నిలబెట్టేందుకు బీజేపీకి అవకాశం లభించింది. ముస్లిం మతపెద్దలే ఈ పని చేసుంటే.. నిర్ద్వంద్వంగా ట్రిపుల్ తలాక్ ఇస్లాంకి విరుద్ధం అని నిషేధించి ఉంటే.. ఈ చట్టం అవసరం ఏముండేది అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం చాలా సముచితం.
ట్రిపుల్ తలాక్ చట్టం ఆమోదింపచేసుకున్న పద్ధతి పార్లమెంటరీ సాంప్రదాయాలను అవహేళన చేసేదిగా ఉంది. జేడీయూ, టీఆర్‌ఎస్ వంటి పార్టీల గోడమీది పిల్లి ఆట చూడటానికి అసహ్యంగా ఉంది. బిల్లును వ్యతిరేకిస్తే ఖచ్చితంగా వైఎస్సార్‌సీపీలాగ నిలబడి ఓటు వేయాలి. కానీ సభ వదిలి పోవడం అంటే బిల్లును వ్యతిరేకించినట్లు కన బడి మైనారిటీల దగ్గర పరువు కాపాడుకోవాలి. అట్లని బీజేపీతో జరిపే లాలూచీని వదులుకోకూడదు. బీజేపీ బిల్లు గెలిచేందుకు వీలు కల్పించాలి. ఇదీ వ్యూహం. ‘ట్రిపుల్ తలాక్ చెప్పడం చెల్లదు’ అని ఈ చట్టం పేర్కొన్నది అంటే వివాహం రద్దు కాదు. ఆ స్త్రీకి, బిడ్డలకు వైవాహిక హక్కులన్నీ ఉంటాయి. అతను అప్పటికీ నిరాకరించినా ఆమెకు చట్ట రక్షణ ఉంటుంది. మరి అతన్ని జైలుకు పంపే వ్యవహారం దేనికి? తలాక్‌లు చెప్పిన ముస్లిం భర్త ఆమెను వది లేస్తాడు. అతనికి చట్టంతో పనిలేదు అని వాదించ వచ్చు. భార్యను వదిలేయదల్చినవాడు ఏ మతానికి చెందినా అతనికి చట్టంతో పనిలేదు. భార్యాబిడ్డల్ని నిరాధారంగా వదిలేసేవాళ్లు (ప్రజా సేవ కోసం లేదా మోక్షం కోసం వగైరా) అందర్నీ మూడేళ్లు జైలుపాలు చేస్తామంటే అందరికీ సమంగా ఆ శిక్షలుండాలి కదా.
498ఏ.. క్రిమినల్ చట్టం. తీవ్ర హింసలు, గాయాలు, మరణాలు, మానసిక హింస, వివాహ బంధంలోని మహిళల జీవించే హక్కుపై దాడి కాబట్టి అది నేరం. అయినా ఒకసారి భర్త అరెస్టయితే తిరిగి ఆ కుటుంబం కలవదు. కనుక ఎంతటి హింసలోనైనా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి స్త్రీలు ముందుకు రారు. ఆర్థికంగా ఆధారపడటం, సమాజానికి భయ పడటం, పిల్లల భవిష్యత్తు, ఒంటరి మహిళకు భద్రత లేకపోవడం.. భర్తే సర్వం అనే సాంప్రదాయ భావన వగైరాలు దీనికి ప్రధాన కారణాలు.
కనుకనే మహిళా ఉద్యమం కుటుంబంలో వివాదాలు సామరస్యంగా పరిష్కరించే సివిల్ చట్టం, గృహ హింస చట్టం కోసం పాతికేళ్లు పోరాడింది. 2002లో వాజ్‌పేయి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ హింస బిల్లు మహిళా హక్కులను కాలరాసేదిగా ఉండటంతో దాన్ని అడ్డుకుని 2005లో మహిళా సంఘాలు ప్రతిపాదించిన సవరణలన్నీ ఆమోదిం చిన చట్టం.. గృహ హింస చట్టంగా, సివిల్ చట్టంగా వచ్చింది. అంటే పరిష్కారానికి వీలు కల్పించేలా కుటుంబ వివాదాలు (హింసకాదు) సివిల్ చట్టంగానే ఉండాలి. ముస్లిం మహిళలకు నిజంగా భద్రత కల్పించ తల్చుకుంటే ఇది సివిల్ చట్టంగా తెచ్చి దాని అమలు యంత్రాంగం ఏర్పాటు చేసి పటిష్టంగా అమలు చేయాలి. భర్తలపై ఆర్థికంగా ఆధారప డుతూ, వృత్తి నైపుణ్యాలు, విద్యలేని అసంఖ్యాక ముస్లిం మహిళల విద్య ఉపాధిపై శ్రద్ధ పెట్టాలి.
ట్రిపుల్ తలాక్ అన్నాక భర్తను జైలులో వేస్తే ఆమె భరణం ఎవరిని అడగాలి? ఎక్కడ ఉండాలి? జైలులో ఉపాధిలేని భర్త కుటుంబాన్ని ఎట్లా పోషి స్తాడు. పోనీ అటువంటి కేసుల్లో మహిళలకు ప్రభు త్వం వక్ఫ్ బోర్డు ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాయా? భరణం, వేతనం, ఆశ్రయం కల్పి స్తాయా? అంటే అదీ లేదు. వారిని గాలికి వదిలేయ డమే. ఇది బాధితులకు ఏ రకంగా న్యాయం చేసి నట్టు? 498ఏ క్రిమినల్ చట్టం కాబట్టి దురుపయోగం అవుతుందని గగ్గోలు పెడుతున్న మగ సంఘాలు, బీజేపీ ఎంపీలు ఇప్పుడు ఈ చట్టాన్ని ఎందుకు క్రిమినల్ చట్టంగా ఆమోదించారు. నిజానికి ‘సతి’ చట్టం మొదలు ‘నిర్భయ’ సవరణల దాకా స్త్రీలకు రక్షణ కల్పించే చట్టాలన్నీ కుటుంబ వ్యవస్థకు విఘా తంగా పరిగణించే బీజేపీ భావజాలం కొనసాగింపే ఈ ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లు. ఒకవైపు స్త్రీలకు రక్షణ కల్పిస్తున్నట్టు కనబడుతూ.. మరోవైపు మైనారిటీ పురుషుల్ని నేరస్తుల్ని చేసే ప్రయత్నం ఇది.
మత ఆచారాలు, మూఢ సంప్రదాయాల వల్ల, ఇతర కారణాలవల్ల భార్యల్ని వదిలేసే పద్ధతులు ఎవరు అనుసరించినా అంటే మతంతో పర్సనల్ లా లతో సంబంధం లేకుండా.. అది ఒక సమస్య. దాని పరిష్కారానికి ఏం చేయాలి? గృహ హింస చట్టం అందరికీ వర్తింపజేసి పటిష్టంగా అమలు చేయటం ద్వారా కుటుంబ వివాదాలు పరిష్కరించాలనే అసలు ప్రశ్నలు గాలికి వదిలేసి ఎవరికి భద్రత చేకూ రుస్తారు.. ఎలాంటి సమానత్వం తీసుకు వస్తారు?
మహిళల హక్కులు ప్రత్యేకించి ముస్లిం మహిళల హక్కులు (షాబానో కేసు దగ్గర్నుండి) రాజకీయ చదరంగంలో పావులుగా వాడుకునే వ్యవహారానికి స్వస్తి పలకాలి. మతాలు, కులాలు, సాంప్రదాయాలు మహిళల హక్కులకు ఆటంకంగా మారితే.. వాటిని రాజ్యాంగబద్ధంగా తొలగించాలి. అనాగరికమైన కాలంచెల్లిన కుటుంబ వ్యవస్థల స్థానంలో అణచివేత లేని సమాన భాగస్వాములుండే ప్రజాస్వామ్య కుటుంబాలు.. హింసలేని కుటుంబాలు ఏర్పరచు కునేందుకు వీలు కలిగించే కుటుంబ చట్టాలు చేయాలి తప్ప రాజకీయ ప్రయోజనాలు కక్ష సాధిం పులకు కుటుంబం ఒక చట్ట సాధనం కాకూడదు.
వ్యాసకర్త :సాంస్కృతిక కార్యకర్త:దేవి
ఈ–మెయిల్: pa_devi@rediffmail.com
Comments
Please login to add a commentAdd a comment