పథకాలతో కేంద్రం లాలన | Guest Shyam Sunder Column On Central Government Schemes | Sakshi
Sakshi News home page

పథకాలతో కేంద్రం లాలన

Published Tue, Jul 17 2018 3:03 AM | Last Updated on Tue, Jul 17 2018 3:04 AM

Guest Shyam Sunder Column On Central Government Schemes  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అభిప్రాయం

ఆరుగాలం కష్టపడి పని చేసే రంగం భారతదేశంలో ఏదైనా ఉందంటే వ్యవసాయరంగమేనని కచ్చితంగా చెప్పవచ్చు. అయితే వారి కష్టానికి తగిన ఫలితం దక్కుతుందా అంటే గ్యారంటీ లేని  రంగం ఇదే. దాదాపు 60 ఏళ్లకుపైగా దేశాన్ని పాలించిన  కాంగ్రెస్‌ పాలకుల నిర్వాకం నిర్లక్ష్యమే దీనికి కారణం. దేశంలో ఏ వస్తువును తయారు చేసే ఉత్పత్తిదారైనా తాను తయారు చేసిన  వస్తువుకు సరైన ధర నిర్ణయించే అధికారం కలిగి ఉన్నాడు. కానీ రైతుకు మాత్రం తాను పండిచే పంటకు ధర నిర్ణయించే అధికారం లేదు. దీంతోనే రైతులు దళారీ వ్యవస్థలో చిక్కుకుని  తీవ్రంగా నష్ట పోతున్నారు. ఈ దుర్భరపరిస్థితులను దృష్టిలో పెట్టుకునే నరేంద్రమోదీ ప్రభుత్వం రైతుల కష్టాలు తీర్చే దిశలో కొన్ని అడు గులు వేసింది. 

కేంద్రప్రభుత్వం చేపట్టిన పలు పథకాల్లో ప్రధాన మంత్రి కృషి సంచయ యోజన, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన, భూసార పరీక్ష కార్డులు, రాష్ట్రీయ గోకుల్‌ మిషన్, అగ్రి ఉడాన్‌ 2017  వంటివి కీలకమైనవి. ఇటీవల14 రకాల పంటలకు కేంద్రం ఇబ్బడి ముబ్బడిగా మద్దతు ధర ప్రకటించింది కూడా. వ్యవసాయానికి యోగ్యమైన భూములన్నిం టికీ సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రతి చేనుకూ నీరు నినాదంతో కరువు నివారణ లక్ష్యంతో చేపట్టిన కేంద్ర ప్రభుత్వ పథకమే క్రిషి సంచన యోజన. దీన్ని మోదీ ప్రభుత్వం 2015 జూలైలో ప్రారంభించింది.

ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 99 ప్రాజెక్టులు  చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. తొలిదశలో 23 ప్రాజెక్టులు చేపట్టి మార్చి 2017లోగా పూర్తి చేయాలని సంకల్పించింది. తర్వాతి దశలో 2018 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా మరో 31 ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్ణ యించి పనులు చేపట్టింది. ఈ మొత్తం 99 ప్రాజె క్టులను పూర్తి చేసి 76 లక్షల హెక్టార్లకు సాగునీరం దించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం  అయిదేళ్లలో (2015–16 నుంచి 2019–20) 50 వేల కోట్ల రూపాయల దీర్ఘ కాలిక ధనసహాయం అందించాలని కేంద్రం నిర్ణయించింది. 

రైతులు చెమటోడ్చి పండించిన పంట మార్కెట్‌లో గిట్టుబాటు ధరకు అమ్ముకునేదాకా నమ్మకం లేని దుస్థితి. అతివృష్టి లేదా అనావృష్టి కారణంగా పంట చేనుల్లోనే రైతు కళ్లముందే పంట నాశనం కావటంతో, ఆ బాధను తట్టుకోలేక.. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ దుస్థితిని నివారించేందుకు మోదీ ప్రభుత్వం 2016 ఏప్రిల్‌లో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన్‌ను ప్రవేశపెట్టింది. బీమా మొత్తానికి, ఉత్పత్తి వ్యయానికీ మధ్య తేడాను తగ్గించడం దీని ప్రత్యేకత. ఇందు కోసం రైతులు ఖరీఫ్‌ పంటల బీమా ప్రీమియంలో కేవలం రెండు శాతం, రబీ పంటలకు 1.5 శాతం, ఉద్యాన, వాణిజ్య పంటలకు 5 శాతం చెల్లిస్తే సరి పోతుంది.ప్రీమియంలో మిగతా భాగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి.

అంటే కేంద్రం భారీ సబ్సిడీని రైతులకు అందిస్తున్నట్లు లెక్క. ఇది ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో అమలవుతోంది.వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని గుర్తిం చిన కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర ఇబ్బడిముబ్బడిగా పెంచింది. గతంలో ఏ కేంద్ర ప్రభుత్వం పెంచని విధంగా అత్యధికంగా వరికి క్వింటాలుకు రూ. 200 చొప్పున పెంచగా, జొన్నకు 725, పత్తికి 1,130, వలిసెలకు 1,827, పొద్దుతిరుగుడుకు 1,288, పెసర్లకు 1,400, రాగు లకు 997 రూపాయలుగా పెంచింది. సజ్జ, మొక్క జొన్న, కంది, మినుములు, సోయాబీన్స్, నువ్వులు తదితర పంటలకు కనీస మద్దతు ధరను మోదీ ప్రభుత్వం భారీగా పెంచి రైతులకు న్యాయం చేయ సంకల్పించింది.

కేంద్రం మరో బృహత్తరమైన పథకా నికి శ్రీకారం చుట్టింది. దేశంలో కూలీలు దొరకని పరి స్థితులను నివారించేందుకు వ్యవసాయ రంగాన్ని యాంత్రీకరించాలని భావించింది. రైతులకు భారీ సబ్సిడీపై ట్రాక్టర్లను, వరినాటు యంత్రాలను అందించాలని నిర్ణయించింది. రైతులకు 50 శాతం సబ్సిడీపై వరినాటు యంత్రాలను, మిగిలిన 50 శాతం బ్యాంకు రుణంగా అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 95 శాతం సబ్సిడీపై ఈ యంత్రాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.స్వాతంత్య్రానంతరం దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్‌ పాలకుల నిర్లక్ష్యంతో కుదేలైన వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం గత నాలుగేళ్లుగా చేపట్టిన వివిధ రకాల పథకాలతో కొంత భరోసా పెరిగింది. కేంద్రం చిత్తశుద్ధితో చేపడుతున్న ఈ పథకాల ద్వారా భవిష్యత్తులో రైతు ఆత్మహత్యలు లేని, రైతే రాజుగా మారే భవ్య భారతాన్ని మనం దరం చూడాలని ఆశిద్దాం.

శ్యామ్‌ సుందర్‌ వరయోగి
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు,
ఫౌండర్‌ – మేనేజింగ్‌ ట్రస్టీ, రాఘవ్స్‌ ఫౌండేషన్, హైదరాబాద్‌
ఫోన్‌ నెంబర్‌:  98669 66904 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement