మారిషస్‌లో తెలుగు వారి భాషా ర్యాలీ (ఇన్‌సెట్‌లో సంజీవ నరసింహ అప్పడు)
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు, ప్రజలకు ఇప్పుడు ఇంగ్లిష్ ఒక వెర్రి, ఓ వ్యామోహం. కానీ బతుకుతెరువు కోసం దేశాంతరాలు పట్టిన మన పూర్వీకులు, వారి వారసులు విదేశాల్లో తెలుగుకు పట్టాభిషేకం చేస్తున్నారు. మన భాషకు బ్రహ్మోత్సవం జరుపు తున్నారు. తమ కలల పంటగా వారు నిర్మించుకున్న తెలుగు మహాసభ వారి దృష్టిలో తెలుగు భాషా దేవాలయం. తమ పూర్వీకుల సంస్కృతిని నిలబెట్టుకోవడానికి వారికి మిగిలిన సాధనాలు భక్తి, భాష మాత్రమే.
ఒకప్పుడు దేశంలో తెలుగు మాట్లాడే జనాభా రెండో స్థానంలో ఉంటే అది ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. మాతృభాషకు ప్రభుత్వాలు ప్రాధాన్యమిచ్చి బోధన అందులో సాగిస్తేనే భాషను మనం పరిరక్షించుకోగలం అనేది భాషా పరిశోధకుడు గణేష్.డివె. తాజాగా వెల్లడించిన అభిప్రాయం. మన దేశంలో ముఖ్యంగా తెలుగు నేలలో మాతృభాషకు ఇక్కట్లు ఎదురవుతున్న స్థితిగతులు నెలకొంటే 1834లో మనల్ని వీడి చెరకు తోటల్లో పనిచేసేందుకు కూలీలుగా మారిషస్ వెళ్లిన తెలుగు వారు మాత్రం తమ తరువాతి తరం వారు కూడా తెలుగు భాషను ప్రేమించి, మాట్లాడేలా పునాది వేశారు. మన భాషకు బ్రహ్మో త్సవం జరుపుతున్నారు. తెలుగుకు పట్టాభిషేకం చేస్తున్నారు. వారు తమతో తీసుకెళ్లిన వ్యవసాయ పరికరాలైన పలుగు, పారతో పాటు పెద్ద బాలశిక్ష, రామాయణ, మహాభారతం వంటి ఇతిహాస గ్రంథాలు అక్కడి వారిని తెలుగు వారసులుగా తీర్చిదిద్దే ప్రయత్నానికి దోహదపడుతు న్నాయి. అవే ఇప్పటి ఆరోతరం తెలుగువారూ భాషాయజ్ఞంలో మమేకం కావడానికి కొండంత ఆసరాగా నిలుస్తున్నాయి. మారిషస్‌లో ఓ ఆరాధ్యభావంతో తెలుగుకు బ్రహ్మోత్సవాలు జరపడం విశేషం.ఈ ఏడాది(2018) జరిగే బ్రహ్మోత్సవాలకు సన్నాహక చర్యలు ఏడునెలలు ముందుగానే ప్రారంభమయ్యాయి. ఆగస్టు 20న ప్రారంభమైన ఈ వేడుకల్లో పద్యపఠన పోటీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతి ప్రదానంతో పాటు ఒక్కోరోజు ఒక్కో తెలుగు సాంప్రదా యంపై అవగాహన కల్పించేందుకు వీలుగా సదస్సుల నిర్వహణ ఉంటుంది. చివరి రోజు కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని, మంత్రులు పాల్గొనడంతో పాటు పూర్ణాహుతి నిర్వహిస్తారు.
మారిషస్ దేశానికి వెళ్లిన తెలుగువారు తొలుత తమ భాషా, సాంప్రదాయాలను నిలుపుకోవడానికి ఒడిదుడుకులు ఎదుర్కొన్నా అక్కడికి వెళ్లిన వారిలో మేబర్ ప్రాంతానికి చెందిన పండిట్ గుణ్ణయ్య 1930లో తెలుగు భాషా వికాసానికి నడుం కట్టారు. ఇలా 1947లో మారిషస్ తెలుగు సంఘం ఆవిర్భవించింది. అది వారి కలల పంటైన తెలుగు మహాసభగా 1974లో అవతరించింది. దాన్ని వారు తెలుగు భాషా దేవాలయంగా భావిస్తారు. ప్రస్తుతం మారిషస్ దేశంలో తెలుగు కుటుంబాల్లో ఆరోతరం వారూ తమ పెద్దలు వేసిన బాటలో నడుస్తుం డటం ఇక్కడి తెలుగు బిడ్డలకు స్ఫూర్తిదాయక అంశం. ఆ దీవిలోని మొత్తం జనాభా 12 లక్షలైతే తెలుగువారు లక్షమంది వరకూ ఉన్నారు. వీరికోసం సుమారు 300 తెలుగు పాఠశాలలు నడుస్తున్నాయి. ఉన్నత విద్యకోసం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పనిచేస్తుంటే దీనితో చేతులు కలిపి తెలుగు మహాసభ, తెలుగు సాంస్కృతిక మండలి, తెలుగు యువ సంఘం, అనేక ఉప సంఘాలు పనిచేస్తున్నాయి. వీటికి మారిషస్ రిపబ్లిక్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆర్థికంగా చేయూత నిస్తోంది. ఫ్రెంచికి దగ్గరగా ఉండే క్రియోల్ వారి మాతృభాష అయినా తెలుగును ద్వితీయ భాషగా ఎంచుకొని దాని మధురిమలను వారు ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా వేమన పద్యాలకు వారు పెద్దపీట వేయ డం, అన్నమయ్య, క్షేత్రయ్య, త్యాగయ్య, రామదాసు కీర్తనలు నేర్చు కోవడంతో పాటు తెలుగు సంప్రదాయాలనూ పూర్తిస్థాయిలో పాటిం చడం విశేషం. ఇటీవల అక్కడి విద్యార్థులే ఓ కథా సంకలనం వెలువరిం చడం వారి తెలుగు ప్రేమకు తార్కాణం. తెలుగు‘ధనా’న్ని నిలుపుకొనేం దుకు మారిషస్ మహాసభ, అక్కడి ప్రభుత్వం గట్టి సంకల్పంతో పని చేస్తున్నాయి. తెలుగువారికి ప్రీతిపాత్రమైన ఉగాదిని వారు జాతీయ సెల వుదినంగా పాటించడం గమనార్హం. ప్రస్తుతం తెలుగువారు నిర్మించు కున్న 350 దేవాలయాలూ తెలుగు భాషా వికాసానికి పనిచేస్తున్నాయి. ఇక తెలుగు పాఠశాలల్లో 190 మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు.
మారిషస్ దీవిలో తెలుగు భాషోన్నతికి సర్వస్వాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్నవారు సంజీవ నరసింహ అప్పడు. ఆయన ఆ దేశ తెలుగు విద్యాధికారి, రేడియో వ్యాఖ్యాత, మారిషస్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ తెలుగు విభాగ అధికారి. తెలుగు ప్రాంతాలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ అక్కడి తెలుగు వికాసానికి కృషిచేస్తున్నారు. మారిషస్ తెలుగువారిలో అయిదో తరానికి చెందిన ఆయన తెలుగునేలను పుణ్య భూమిగా అభివర్ణించి పులకరించి పోతారు. ఇప్పటికి 49సార్లు ఆయన తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఇక్కడి భాషా ప్రముఖులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. టోరీ తెలుగు రేడియో వ్యాఖ్యాతగా ఇక్కడి వారితో మాట్లాడుతూ... ఇరుదేశాల తెలుగువారిమధ్య సంధానకర్తగా పనిచేస్తున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆయనను ఫోన్ ద్వారా ‘సాక్షి’ పలకరించగా అక్కడి విశేషాలను వెల్లడించారు. మారిషస్ తెలుగు వారిపై పరిశోధనలు కూడా జరిగాయని ఇందుకు తాము సహకరించి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. భక్తిని, భాషను జోడించి తమ పూర్వీ కుల సంస్కృతిని నిలబెడుతున్నామని తెలిపారు.
-పట్నాయకుని వెంకటేశ్వరరావు, సాక్షి ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment