
మాధవ్ శింగరాజు
ఇండియాపై బెంగ పట్టుకుంది. అమెరికా నాకు కొత్తేం కాదు. టీనేజ్‌లో ఇక్కడే చదువుకున్నాను.. ఆంటీ వాళ్ల ఇంట్లో ఉండి. టీనేజ్‌లో అయినా, ఈ థర్టీఫోర్ ఇయర్స్ ఏజ్‌లో అయినా ఇండియా ఇండియానే.
‘‘ఈ మాట బయటికి అంటే ఉద్యోగాలు పోతాయ్ ఆంటీ’’ అని నవ్వుతూ అంటుంది నా కజిన్ కూతురు. వాళ్ల ఆఫీస్‌లోనూ ఒక హార్వీ వైన్‌స్టీన్ ఉన్నాడట. ‘‘ఏమంటాడు.. ఇండియాను పొగిడితే పింక్ స్లిప్ ఇస్తానంటాడా?’’ అన్నాను.
అది నవ్వింది. ‘‘అలా ఏం కాదు ఆంటీ.. పింకీ అంటాడు నన్ను, నా లిప్స్ పింకిష్‌గా ఉంటాయట. ‘షిట్’ అన్నాన్నేను. ఆ సాయంత్రమే పిలిచి, ‘ఇండియాలో మన బ్రాంచికి అవసరమట. వెళ్తావా?’ అని అడిగాడు. ‘వెళ్లను’ అన్నాను. ‘మరి షిట్ అని ఎందుకన్నావ్?’ అన్నాడు. ‘లిప్స్ జనరల్‌గా పింకిష్‌గానే కదా సర్ ఉండేది’ అన్నాను. వాడు వదిల్తేనా! ‘నీ లిప్స్ స్పెషల్’ అంటాడు’ అని పడీపడీ నవ్వుతూ చెప్పింది అది.
నిన్న యాన్ ఫ్యూలేవైడర్ నన్ను అడిగింది. ‘‘ప్రియాంకా.. మీ కంట్రీలో కూడా ఎవరైనా హార్వీ వైన్‌స్టీన్ ఉన్నాడా’’ అని. యాన్ పెద్ద పత్రికకు చీఫ్ ఎడిటర్. ఫిల్మ్ ప్రొడ్యూసర్‌ల గురించి ఆమెకు తెలియకుండా పోతుందా? ఔటాఫ్ ఇంట్రెస్ట్.. ఊరికే అడిగి ఉంటుంది.
‘‘టెల్ అజ్ మిస్ ప్రియాంక.. ఇండియాలో మీరు పెద్ద స్టార్ కదా. మీకలాంటి అనుభవాలేమీ లేవా?’’ అని యాన్ మళ్లీ అడిగింది.
నవ్వాన్నేను. ‘‘ఏ కంట్రీలోనైనా ఒక్కడే హార్వీ వైన్‌స్టీన్ ఉంటాడని ఎందుకు అనుకుంటున్నారు మిస్ యాన్’’ అన్నాను. అక్కడున్న అమ్మాయిలంతా గలగల నవ్వారు.
ఇంటికొచ్చేశాను. అలసటగా ఉంది. ప్రతిచోటా హార్వీ వైస్‌స్టీన్ టాపిక్కే. మరో ట్రంప్ అయిపోయాడు ఈ హాలీవుడ్ ప్రొడ్యూసర్. ఎందుకిలా పెద్ద పెద్ద మగాళ్లంతా అమ్మాయిల వెంట పడి వేధించుకు తింటారు? ఎందుకంటే పవర్!
పవర్‌లో మగాడు.. ఊరికే చేతికండల్ని చూసుకుని తృప్తి పడే మామూలు మగాడిలా.. తన పవర్‌ని తన చేతికింద ఉన్న అమ్మాయిలకు ఫ్లెక్స్ చేసి చూపించి తృప్తి పడుతుంటాడు. కూర్చోమంటే కూర్చునే అమ్మాయి, నిలుచోమంటే నిలుచునే అమ్మాయి అతడి పవర్ ఇగోని శాటిస్‌ఫై చేస్తుంది. తనకు లొంగని స్త్రీ కాళ్లు, చేతులు కదలకుండా చేయడానికి మగవాడికి తెలిసిన విద్య.. ఆమె ఉద్యోగాన్ని పోగొట్టడం. ఆమె కెరీర్‌పై దెబ్బ కొట్టడం. అదేనా పవర్!
‘ఎ కిడ్ లైక్ జేక్’ కంప్లీట్ అయింది. ‘ఈజెంట్ ఇట్ రొమాంటిక్’ కంప్లీట్ కావస్తోంది. బ్రేక్ దొరికితే ఇండియాకి వెళ్లి రావాలి. అక్కడా ఇదే అడుగుతారేమో.. హాలీవుడ్‌లో మీకు చాన్స్‌లు ఇవ్వడం కోసం హార్వీ వైన్‌స్టీన్‌లాంటి వాళ్లెవరైనా మిమ్మల్ని కూడా.. అంటూ.
చెప్పాలి. అమ్మాయిల్లో పవర్ లేకపోతే కదా, బయటి పవర్‌లకు లొంగిపోవడం!
Comments
Please login to add a commentAdd a comment