అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న జ్ఞానప్రసన్న
నగరంలోని నల్లపాడు రోడ్డులో మూడంతస్తుల భవనం..అమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో నడుపుతున్న ఓ ఆశ్రమం. ఇక్కడ ఒక్కో అంతస్తు ఎక్కే కొద్దీ సమాజంలో పాతాళానికి చేరిన మానవత్వపు ఛాయలు అమృతమంటి ఊటలా ఉబికివస్తుంటాయి. ఆరు పదులు దాటిన వయసులో నా అనే వాళ్లు విసిరేసిన బతుకులు అమ్మ ప్రేమలో ఆదరువు పొందుతుంటాయి. విధి రాతకు వాడిన పసిమొగ్గలు విద్యా కుసుమాలై వికసిస్తుంటాయి. అనాథ శవాల ఆత్మఘోషలు అనంతలోకాల నుంచి ట్రస్ట్‌ను ఆశీర్వదిస్తూ ఉంటాయి. ఈ ఆశ్రమంలోనే ఓ మూలన నిరాడంబర రూపం, నిర్మలమైన మనసుతో ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్న మౌనమునిగా సమాజ జీవచ్ఛవానికి సేవ అనే ఊపిరిపోస్తూ ఉంటారు.
గుంటూరు(పట్నంబజారు): ఎక్కడో విశాఖ నుంచి భార్యాబిడ్డలతో గుంటూరు వచ్చిన 24 ఏళ్ల చంద్రశేఖర్ ఓ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఒక రోజు అనాథ మృతదేహాం రోడ్డుపై పడి ఉంది. ఏ ఒక్కరూ పట్టించుకోవటం లేదు.. మనసు వికలమైపోయింది..వెంటనే ఆ శవాన్ని భుజాన వేసుకుని వెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేశాడు. ఇది జరిగి సరిగ్గా 28 ఏళ్లు. అప్పుడే అనుకున్నాడు ఏ ఒక్క శవం అనాథగా మిగిలిపోకూడదని. అంతే అమ్మ చారిటీబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక చింతనతో జ్ఞానప్రసన్నగా మారారు. దాతల సహకారంతో అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 35 వేలకుపైగా అనాథ శవాలకు పెద్ద కొడుకయ్యారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆమనుషులం కదా>్పటు చేసి స్వయంగా అనాథ శవాలను తానే తీసుకొస్తారు. అంత్యక్రియలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. కాశీ నుంచి తీసుకొచ్చిన గంగా జలంతో మృతదేహాన్ని శుభ్రపరుస్తారు. చితాభస్మాన్ని కాశీలో కలుపుతారు.
అనాథ శవాలే కాదు..అద్దె ఇళ్లలో వారైనా..
అద్దె నివాసాల్లో శవాన్ని పెట్టుకోవడానికి ఒప్పుకోరు. ఇలాంటి వారి కోసం ఒక భవంతి ఏర్పాటు చేశారు. ఉచితంగా వారికి మృతదేహాన్ని భధ్రపరిచే బాక్సులను ఇస్తారు. 11 రోజులపాటు జరిగే కార్యక్రమాలు అక్కడే నిర్వహించి సంబంధిత ఖర్చులు ఆయనే భరిస్తారు. నిత్యం నగరంలోని ఒక ఆలయంలో పేదలకు అన్నదానం చేయటంతో పాటు, ట్రస్ట్ ఆటోల్లో రైల్వేస్టేషన్, జీజీహెచ్, అరండల్ ఓవర్ బ్రిడ్జి, బస్టాండ్, మార్కెట్ ప్రాంతాల్లో 500 మందికిపైగానే అనార్తుల ఆకలి తీరుస్తున్నారు.
అమ్మలకు...అమ్మై..
ఆరుపదులు దాటిన పండుటాకులు.. ఉన్న వారు ఉండి పట్టించుకోని అభాగ్యులు కొంత మంది..ఏ దిక్కు లేకుండా దీనస్థితిలో ఉన్న వారు మరికొందరు. ఒక్కొక్కరిదీ..ఒక్కో గాధ. వీరందరికీ అమ్మ ట్రస్ట్ అండగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆశ్రమం ద్వారా 15 మంది అనాథలను అక్కున చేర్చుకుంది.
చిన్నారులకు పెద్దదిక్కులా...
విధి చిన్నచూపు చూసి కొంత మంది అనాథలైతే..పేదరికంలో మగ్గుతున్న మరి కొందరు చిన్నారులు.. వీరందికీ అమ్మ ట్రస్ట్ ఆపన్నహస్తం అందిస్తోంది. ప్రస్తుతం 30 మంది వరకు చిన్నారుల ట్రస్ట్ భవనంలో ఉంటూ కాన్వెంట్ చదువులకు వెళుతున్నారు.
మనుషులం కదా
మనుషులం కదా అందరికీ సేవ చేయాలి. ఆకలితో ఉన్న వారి కడుపు నింపాలి. అనాథ రోడ్డుపై పడి ఉంటే మా ఆశ్రమం మనసు అంగీకరించదు. అందుకే ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకుంటాం. అనాథ శవాలను ఆశ్రమంలోని వారు అన్నదమ్ముల్లా సాగనంపుతాం. ఆశ్రమ ఆస్తులన్నీ ట్రస్ట్ పేరుతోనే ఉంటాయి. అనాథలైన..అనాథ మృతదేహాలైనా ఉంటే 9848792228, 8341314440 నంబర్లకు ఫోన్ చేయండి.: స్వామి జ్ఞానప్రసన్న, ఆశ్రమ నిర్వాహకులు
Comments
Please login to add a commentAdd a comment