► వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో (డీఎడ్) ప్రవేశాల కోసం ఈనెల 17న డీఈఈసెట్–2017 పరీక్ష నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలలో ఈ పరీక్షను నిర్వహించనుంది. ఏ మీడియంలో డీఎడ్ చేయాలనుకునే వారు ఆ మీడియంలోనే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. 17వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఒక మీడియం వారికి, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు ఒక మీడియం వారికి, సాయంత్రం 4 నుంచి 6 వరకు మరొక మీడియం వారికి పరీక్ష నిర్వహించనుంది.
ఏ మీడియం వారికి ఏయే సమయంలో పరీక్ష ఉంటుందనే వివరాలను హాల్‌టికెట్‌లో ఇవ్వనున్నారు. విద్యార్థులు ్టటఛ్ఛీ్ఛఛ్ఛ్టి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ కమిషనర్ కిషన్ తెలిపారు. పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నందున ముందస్తుగా విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకునేందుకు విద్యాశాఖ వెబ్‌సైట్‌లో మీడియం వారీగా ప్రత్యేక లింక్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ పరీక్ష కోసం గత నెల 10 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. డీఎడ్‌లో చేరేందుకు గతేడాది 1.10 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈ సారి 43 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంగ్లిష్ మీడియంలో డీఎడ్ చదివేందుకు 12 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.