ఏయూ క్యాంపస్: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో 97ను నిరసిస్తూ విద్యార్థులు ప్రత్యక్ష పోరాటానికి దిగారు. సోమవారం ఉదయం ఆంధ్రా వర్సిటీలోని పరిశోధకులు, విశాఖలోని గిరిజన విద్యార్థులు ఏయూ మెయిన్‌గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గిరిజన విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు ఎస్.లోవరాజు, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి తడబారికి సురేష్ కుమార్ తదితరలు ఈ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ.. మన్యం ప్రజల జోలికి వస్తే సహించేది లేదన్నారు.
పచ్చని ప్రకృతిని నాశనం చేయాలనే శక్తులను ఆదివాసీలంతా ఏకమై తరిమికొడతారన్నారు. దీక్షకు అరకు ఎమ్మెల్యే (వైఎస్సార్‌సీపీ) కిడారి సర్వేశ్వరరావు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ గిరిజనుల హక్కుల పరిరక్షణకు అన్ని వర్గాలతో కలసి పని చేస్తామన్నారు. ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ అరకును టూరిజం హబ్‌గా చేస్తామని చెప్పిన సీఎం.. నేడు పర్యావరణానికి హాని చేసే విధంగా ప్రవర్తించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు.
ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజులు విద్యార్థుల దీక్షకు సంఘీభావం తెలిపారు. గిరిజన ఉద్యోగ సంఘాల నేతలు, విశాఖలోని వివిధ కళాశాల విద్యార్థులు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఏయూ ఆచార్యుడు జర్రా అప్పారావు, పరిశోధకులు, గిరిజన సంఘాల, ఉద్యోగ సంఘాల నేతలు దీక్షకు మద్దతు తెలిపారు.