హైదరాబాద్: జాతీయ బీసీ కమిషన్‌కు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించడం పట్ల ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. బీసీ కమిషన్ అధికారాల కోసం 20 ఏళ్లుగా చేసిన కృషికి ఫలితం దక్కిందన్నారు. గతంలో జాతీయ బీసీ కమిషన్‌కు కేవలం కులాల చేర్పు, తొలగింపు అధికారాలు మాత్రమే ఉండేవని చెప్పారు. తాజాగా రాజ్యాంగహోదా కలగడంతో బీసీలపై దాడులు జరిగితే క్షేత్రస్థాయిలో విచారణ జరిపే అధికారం ఉంటుందన్నారు.
అంతేకాకుండా రిజర్వేషన్ల అమలులో అక్రమాలు అరికట్టడం, ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించే అధికారం ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా కమిషన్ మాదిరిగానే జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించినందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.