
గ్రూప్-2లో మరో 300 పోస్టులు!
ఫైలు సిద్ధం చేసిన ఆర్థిక శాఖ.. సీఎం ఆమోదం తర్వాత నోటిఫికేషన్
జిల్లాల్లో 212 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కలెక్టర్ల నివేదిక
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 కేటగిరీలో మరో 300 పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలు సిద్ధమైంది. ఇప్పటికే గుర్తించిన ఈ ఖాళీల జాబితాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు ఆర్థిక శాఖ పంపించింది. వీటిలో అత్యధికంగా డిప్యూటీ తహసీల్దార్ పోస్టులున్నాయి. అయితే రాజీవ్‌శర్మ జింబాబ్వే పర్యటనలో ఉండటంతో ఆయన తిరిగి వచ్చాక వచ్చే వారంలో ఈ ఫైలును పరిశీలించే అవకాశాలున్నాయి. అనంతరం ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశాక పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది.
ఈ నెల 24, 25 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలు వాయిదాపడటం తెలిసిందే. మరిన్ని పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించటంతో కొత్తగా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు.. నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందని లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. వెయ్యి పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించటం తెలిసిందే. తొలుత 439 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.
తాజా ఖాళీలతో ఈ సంఖ్య 739కు చేరనుంది. వీటితో పాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు, ఇటీవల రిటైరైన ఉద్యోగుల వివరాలు సేకరిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో సీఎం ఇచ్చిన మాట ప్రకారం దాదాపు 4 వందలకు పైగా పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయని టీఎస్‌పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.
జిల్లాల్లో కీలక పోస్టులు ఖాళీ..
జిల్లా, డివిజన్ స్థాయిలో ఖాళీగా ఉన్న కీలకమైన పోస్టుల వివరాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఇటీవలే రెవెన్యూ విభాగానికి పంపించారు. ముఖ్యమైన అధికారులు లేకపోవటంతో పని ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలుపై తీవ్ర ప్రభావం పడుతోందని నివేదించారు. వెంటనే ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్లు పంపిన ఖాళీల్లో ఎక్కువగా గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులే ఉన్నాయి. జెడ్పీ సీఈవోలు, డీఆర్‌డీఏ పీడీలు, ఎస్సీ బీసీ కార్పొరేషన్ల ఈడీలు, డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్, డీపీవో తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నివేదికల ప్రకారం జిల్లాల్లో మొత్తం 202 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి 117, ఇతర విభాగాలకు సంబంధించి 85 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 32, నిజామాబాద్‌లో 29, వరంగల్‌లో 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.