
సబ్ కమిటీ నిర్ణయం మేరకే చర్యలు
♦ విచారణ కమిషన్ ఎదుట
♦ హెచ్‌సీయూ వీసీ అప్పారావు
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఘటనపై మూడు రోజులుగా జరుగుతున్న ఏకసభ్య కమిటీ విచారణ గురువారంతో ముగిసింది. ఈ ఘటనలో వర్సిటీ యాజమాన్యం తప్పేమీ లేదని హెచ్‌సీయూ అధికారులు అశోక్ రూపన్‌వాలా నేతృత్వంలోని కమిషన్‌కు నివేదించారు. అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఉన్నతాధికారులు, విద్యార్థులను కమిషన్ ఈ సందర్భంగా విచారించింది. చివరి రోజు విచారణకు హెచ్‌సీయూ వైస్‌చాన్స్‌లర్ పొదిలె అప్పారావు హాజరయ్యారు. అంబేడ్కర్ స్టూడెం ట్స్ అసోసియేషన్, ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య తలెత్తిన గొడవ సమయంలో తాను వీసీగా బాధ్యతలు చేపట్టలేదని అప్పారావు కమిషన్‌కు తెలిపారు.
అప్పటి వీసీ తొలుత యూనివర్సిటీ క్రమశిక్షణ సంఘంతో విచారణ జరిపారని, తదనంతరం నిపుణులతో సబ్ కమిటీని నియమించారని చెప్పారు. సబ్ కమిటీ నిర్ణయం మేరకే విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు విన్నవించారు. శిక్ష పరిమితిని తగ్గించేలా తాను కృషి చేశానని, విద్యార్థులతో స్నేహపూర్వక ధోరణి ప్రదర్శించానన్నారు. రోహిత్ ఆత్మహత్య తనను తీవ్రంగా కలచివేసిందని, తప్పేమి లేనప్పటికీ తనపై నిందలు మోపడం తీవ్రంగా బాధిం చిందన్నారు. అనంతరం ప్రస్తుత ఇన్‌చార్జి వీసీ పెరియసామి... ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను కమిషన్‌కు నివేదించారు. కమిషన్‌ను కలసిన వారిలో హెచ్‌సీయూ రిజిస్ట్రార్ ఎం.సుధాకర్, ఫైనాన్స్ ఆఫీసర్ పాండురెడ్డి ఉన్నారు. విరాచణ కమిటీ ఈ నివేదికను త్వరలో కేంద్రానికి సమర్పిస్తుంది.