
అసలైన ద్రోహులు ‘సంఘ్’ శక్తులే
♦ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం
♦ మోదీ సర్కార్‌ను ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులు పెడుతున్నారని ధ్వజం
♦ కన్హయ్యపై నిరాధార అభియోగాలు మోపారని వెల్లడి
సాక్షి,హైదరాబాద్: అసలైన దేశద్రోహులు సంఘ్‌పరివార్ శక్తులేనని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఆరోపించారు. రెండో ప్రపంచయుద్ధానికి కారకుడైన హిట్లర్ స్వస్తిక్ చిహ్నాన్నే ఆరెస్సెస్, బీజేపీలు ఆదర్శంగా చేసుకున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, దేశద్రోహులు, ఫాసిస్టులకు వ్యతిరేకంగా తమ పోరా టం సాగుతుందన్నారు. మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేను హీరోను చేస్తారా అని నిలదీశారు. నచ్చనివాళ్లు దేశాన్ని విడిచిపోవాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వంటి వాళ్లు మాట్లాడుతున్నారని, ఇదేమన్న మీ అబ్బ దేశమా అని ప్రశ్నించారు.
నిజాం, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఆరెస్సెస్‌కు లేదన్నారు. బీజేపీ, మోదీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేవారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారన్నారు. సోమవారం మఖ్దూంభవన్‌లో పార్టీ నాయకుడు పల్లా వెంకటరెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జేఎన్‌యూలో కొందరు విద్యార్థులు ఏవో నినాదాలివ్వగా, విద్యార్థి సంఘ నేతగా కన్హయ్య కుమార్ అక్కడకు వెళ్లి వారికి వ్యతిరేకంగా మాట్లాడారన్నారు.
అయితే అఫ్జల్‌గురుకు అనుకూలంగా మాట్లాడారంటూ తప్పుడు వీడియో సృష్టించి ఆయనను దేశద్రోహ నేరం కింద అరెస్ట్ చేశారన్నారు. కన్హయ్యపై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరగకుండానే ఉరితీయాలంటూ డిమాండ్ చేయడం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, లాయర్లు, జర్నలిస్టులపై దాడి చేయడం దేశభక్తా అని ప్రశ్నించారు. హెచ్‌సీయూలో దళిత విద్యార్థి రోహిత్‌పై వేధింపులకు పాల్పడి ఆత్మహత్య చేసుకునేలా చేసి, దానిని కప్పిపుచ్చుకునేందుకు కన్హయ్యపై, ఆయనకు బాసటగా నిలిచిన కమ్యూనిస్టు పార్టీలు, మద్దతు తెలిపిన రాహుల్ గాంధీలను దేశద్రోహులు, జాతి వ్యతిరేకులు అంటూ దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని ప్రధాని మోదీ గగ్గోలు పెట్టడం విచిత్రంగా ఉందన్నారు. ఎన్నికల హామీల అమల్లో వైఫల్యం వల్ల దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. చాయ్‌వాలా అయిన తాను ప్రధాని కావడాన్ని భరించలేక దించాలని చూస్తున్నారనడం హాస్యాస్పదమని, మోదీ చాయ్‌వాలా కాదని చాయ్ హోటల్ ఓనరన్నారు. ఆయనకంటే కడుపేదరికం నుంచి వచ్చిన లాల్‌బహదూర్‌శాస్త్రి ప్రధాని కాలేదా అని నిలదీశారు.
కన్హయ్య వీడియోల ప్రదర్శన...
అనంతరం జేఎన్‌యూ వివాదం, దానికి సం బంధించిన వీడియోలు, కన్హయ్య కుమార్ చేసిన ప్రసంగ వీడియోలను ప్రదర్శించారు. విడివిడిగా ఉన్న రెండు వీడియోలను తమకనుకూలంగా మార్చి, కన్హయ్య ఆజాద్ కశ్మీర్‌కు అనుకూలంగా నినాదాలు చేసినట్లుగా సృష్టిం చి ప్రదర్శించిన తీరును వివరించారు. ఈ టేపులు వాస్తవాలను బట్టబయలు చేస్తున్నాయని సురవరం సురవరం సుధాకరరెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.