
మహిళలను అన్ని పార్టీలు మభ్యపెడుతున్నాయ్
హైదరాబాద్ : వామపక్ష పార్టీలు మినహా అన్ని రాజకీయ పార్టీలు మహిళలను మభ్యపెడుతున్నాయని, మహిళా రిజర్వేషన్ చట్టం తేవడం వారికి ఇష్టం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని సీపీఎం డిమాండ్ చేస్తోందని తెలిపారు.
ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించనున్నామన్నారు. దేశవ్యాప్త ఆందోళనలకు పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించిన మేరకు తామ చేపడుతున్న ఆందోళనల్లో కేవలం పార్టీ కార్యకర్తలే కాకుండా మహిళలు, ప్రజాస్వామిక వాదులు పాల్గొనాలని ఆయన పిలుపు ఇచ్చారు.
సీపీఎం కార్యాలయం ఎంబీ భవన్‌లో తమ్మినేని వీరభద్రం మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 1996లోనే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టగా అనేక మలుపులు తిరిగి 2010లో రాజ్యసభలో ఆమోదం పొందినా, నేటికీ లోక్‌సభలో ఆమోదానికి నోచుకోలేదన్నారు. మహిళలకు రిజర్వేషన్ల విషయంలో బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు సైతం మనకంటే చాలా ముందున్నాయని తమ్మినేని తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లు సైతం దీనితో పాటు ప్రవేశపెట్టాలంటూ కొందరు అడ్డుతగులుతున్నారన్నారు.
తాము బీసీ బిల్లుకు వ్యతిరేకం కాదని... అయితే ఆ వంకతో మహిళా బిల్లు ఆమోదానికి నోచుకోకుండా కొందరు కుట్ర పన్నుతున్నారని అన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే ఎంపీ కవిత మహిళా బిల్లుపై స్పందించాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టే విషయంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించాలని కోరారు. సీపీఎం, సీపీఐ పార్టీల విలీనంపై చర్చ జరుగుతోందని ఇందుకు ఆరు నెలలైనా, ఆరు సంవత్సరాలైనా పట్టవచ్చని తమ్మినేని అన్నారు.