
ఈ సమావేశాల్లోనే తీసుకురావాలి
మహిళా బిల్లుపై తమ్మినేని... 15న రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: వామపక్ష పార్టీలు మినహా అన్ని రాజకీయ పార్టీలు మహిళలను మభ్యపెడుతున్నాయని, మహిళా రిజర్వేషన్ చట్టం తేవడం వారికి ఇష్టం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 17న ప్రారంభమ య్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని సీపీఎం డిమాండ్ చేస్తోందన్నారు. ఈ క్రమంలో ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించనున్నామని తెలిపారు.
ఈ ఆందోళనల్లో మహిళలు, ప్రజాస్వామికవాదులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. 2010లో మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందినా, నేటికీ లోక్‌సభలో ఆమోదానికి నోచుకోలేదన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు సైతం మహిళా బిల్లుతోనే కలిపి ప్రవేశపెట్టాలంటున్నారని, అయితే తాము బీసీ బిల్లుకు వ్యతిరేకం కాదని, దానిని సాకుగా చూపి మహిళా బిల్లును వెనక్కి కొట్టాలని కుట్ర చేస్తున్నారని విశ్లేషించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు వెంకట్, జ్యోతి పాల్గొన్నారు.