నిబంధనలు గాలికి.. నిధులు అక్రమార్కులకు!
- జిల్లా ఆసుపత్రుల పారిశుధ్య పనుల్లో అక్రమాల ఆరోపణలు
- రిజిస్ట్రరైన సంస్థలకే టెండర్లివ్వడంపై సందేహాలు
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రుల్లో పారిశుధ్య పనుల కోసం కేటాయించిన నిధులు పక్కదారి పడుతున్నాయా..? ప్రభుత్వ సంకల్పాన్ని అమలు చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారా.. జిల్లా ఆస్పత్రుల్లో పారిశుధ్య టెండర్ల ప్రక్రియ చూస్తుంటే ఈ అనుమానాలు రాకమానవు. జిల్లాల్లోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న పారిశుధ్యం, సెక్యూరిటీ, కీటకాల నివారణ, పేషెంట్ కేర్ వంటి టెండర్ పనులను కనీస గుర్తింపు లేని సంస్థలు దక్కించుకుంటున్న తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
గత మార్చిలో టెండర్ నోటిఫికేషన్ వెలువడ్డాక రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంస్థలు కూడా టెండర్లు దక్కించుకుంటున్న తీరు విస్మయం కలిగిస్తోంది. రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఆస్పత్రుల్లో ఆయా పనులకు మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో కలెక్టర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్లు టెండర్లు నిర్వహించి ఏజెన్సీలకు పనులు అప్పజెప్పాలి. కానీ టెండర్ల నిర్వహణ పూర్తిగా పక్కదారి పట్టిందన్న విమర్శలున్నాయి. ఈ పనులకు ఏమాత్రం సంబంధం లేని సంస్థలు తెరమీదకొచ్చాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
నిబంధనలకు పాతర: ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన నిబంధనలను గాలికొదిలేశారు. టెండర్లలో పొందుపరిచిన కనీస నిబంధనలను చూడకుండా సంస్థలకు పనులు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పనుల నిర్వహణకు సంబంధించి అనుభవం లేకపోయినా కొన్ని సంస్థలకు టెండర్లు కట్టబెట్టారు. కొన్ని సంస్థలైతే కీటకాల నిర్వహణ లైసెన్సులు నకిలీవి సృష్టించి టెండర్లు వేశాయి. సంగారెడ్డి జిల్లాలో టెండరు దక్కించుకున్న ఒక కాంట్రాక్టరుకు అర్హతలేమీ లేకుండానే ఇచ్చినట్టు విమర్శలు వస్తున్నాయి. అయితే స్థానిక నేతల అండతో కొందరు కాంట్రాక్టర్లు ఆసుపత్రి సూపరింటెండెంట్లకు ఫోన్లు చేసి ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది.
టెండరు ప్రమాణాలు లేకుండానే..
► టెండరు దరఖాస్తులు వివిధ దశల్లో పరిశీలించాలి. కానీ అధికారులు వాటిని పరిశీలించనే లేదు.
► జీవో నంబర్ 9 ప్రకారం పేషెంట్ కేర్‌కు సంబంధించి అనుభవం ఉండాలి. అవేమీ లేకుండానే సంస్థలకు అనుమతులిస్తున్నారు.
► టెండర్లలో పాల్గొన్న పలు సంస్థలు నకిలీ అనుభవ ధ్రువపత్రాలు సమర్పించాయి. దీంతో చిన్న మండల కేంద్రాల్లో ఉన్న లోకల్ ఏజెన్సీలు కూడా తెరమీదకొచ్చాయి.
► చాలామంది కాంట్రాక్టర్లు కీటకాల నిర్వహణకు సంబంధించిన లైసెన్సులను టెండర్ నోటిఫికేషన్ విడుదలయ్యాక తెచ్చుకున్నవిగా తేలింది. అంటే వీళ్లకు ఏమాత్రం ముందస్తు అనుభవం లేదు.