తాగండి తప్పులేదు.. కానీ.. : అల్లు అర్జున్
రూల్స్ బ్రేక్ చేయడం ప్రజలు అలవాటుగా మార్చుకుంటున్నారని హీరో అల్లు అర్జున్ అన్నాడు.
హైదరాబాద్: రూల్స్ బ్రేక్ చేయడం ప్రజలు అలవాటుగా మార్చుకుంటున్నారని హీరో అల్లు అర్జున్ అన్నాడు. మన పరిసరాల పరిశుభ్రత, మన ట్రాఫిక్ తీరు చూసిన వారు మన మనస్తత్వం ఏంటో చెప్పగలరని తెలిపాడు. ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దామని కోరారు. మందు తాగండి.. కానీ ఆ మత్తులో వాహనాలు నడపవద్దని సూచించాడు. ‘నీ కారణాలు తప్పు ముందు నిలబడవు , రూల్స్ కఠినంగా ఉన్నా... ఇంకా మార్పు రావాలి, చాదస్తం అనుకున్నా సరే... అవతలివారి ప్రాణాలతో ఆడుకోవద్దు’ అని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్‌తో పాటు సినీ నటుడు అల్లు అర్జున్, దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు. దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. యువతకు అన్నీ విషయాల్లో స్పీడ్ అవసరమే కానీ, డ్రైవింగ్ విషయంలో మాత్రం ఈ స్పీడ్ అవసరంలేదని తెలిపారు. అతివేగానికి మన రహదారులు అనుకూలంగా లేవని చెప్పారు.
ఈ సందర్భంగా సీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుకుందామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఈ క్యాంపెయిన్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. స్ట్రీట్ బేస్ టెక్నాలజీని త్వరలో అందుబాటులో తీసుకురానున్నట్టు తెలిపారు. నగరంలో 15 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తప్పు చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉండాలన్నారు.