
లారెన్స్‌కు ముందస్తు బెయిల్
సాక్షి, హైదరాబాద్: ‘రెబల్’ చిత్ర వివాదంలో ఆ చిత్ర దర్శకుడు లారెన్స్ రాఘవకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాల్సిందిగా లారెన్స్‌ను ఆదేశించింది. రెబల్ చిత్రాన్ని రూ. 22.5 కోట్లతో నిర్మిస్తానని లారెన్స్ ఆ చిత్ర నిర్మాతలైన జె.భగవాన్, పుల్లారావులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. చిత్ర నిర్మాణ సమయంలో ఆ బడ్జెట్ రూ.40 కోట్లకు చేరింది. దీనికితోడు చిత్రం ఆశించిన రీతిలో ఆడక నిర్మాతలు నష్టపోయారు.
ఈ విషయంలో దర్శకుడికి, నిర్మాతలకు మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా కొంత మొత్తాన్ని తాను భరిస్తానని లారెన్స్ అంగీకరించాడు. అయితే డబ్బులడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ నిర్మాతలిరువురూ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లారెన్స్‌పై సెక్షన్ 406, 420 కింద కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి కోర్టు శనివారం లారెన్స్‌కు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని సూచించింది.