నిజాయితీతో పనిచేస్తే ఏదైనా సాధ్యమే
పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: నిజాయితీతో, నిబద్ధతతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ప్రభుత్వం నిర్దేశిం చిన లక్ష్యం మేరకు పనిచేస్తే కచ్చితంగా గుర్తింపు లభిస్తుందన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఉత్తమ సేవలు అందించినందుకు గాను సీఎం కె.చంద్రశేఖరరావు చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ ‘ఎక్సలెన్స్’ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ, సంస్థ, లీగల్ మెట్రాలజీ ఉద్యోగులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం కమిషనర్‌ను కలసి అభినందించారు. ఈ అవార్డుతో బాధ్యత మరింత పెరిగిందని, ఈ అవార్డు ఒక్కరి విజయం కాదు, సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని ఆనంద్ అన్నారు.