ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
బ్యాలెట్ పత్రాలు తనిఖీ చేసిన భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ బుధవారం తనిఖీ చేశారు. ఈ నెల 19న జరుగనున్న ఎన్నికల బ్యాలెట్ పత్రాల ముద్రణ 13వ తేదీన పూర్తయింది. అప్పటి నుంచి హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో వీటి పరిశీలన, తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం భన్వర్‌లాల్ వీటిని తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.
హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్ధన్‌రెడ్డి, అడిషనల్ సీఈవో అనూప్‌సింగ్, రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్‌లు ఆయన వెంట ఉన్నారు. దాదాపు 20 టేబుళ్లను సందర్శించి భన్వర్‌లాల్ బ్యాలెట్ పేపర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల ఛాయాచిత్రాలు స్పష్టంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌ను కూలంకషంగా పరిశీలించాలని, ఏవిధమైన పొరపాటు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సమీక్షలో జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ రామకృష్ణారావు, అధికారులు చంద్రయ్య, శశికిరణాచారి, ప్రేమ్‌రాజ్, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ అధికారులు, డీఆర్‌వోలు పాల్గొన్నారు.