‘ఆశ’లకు నిరాశేనా?
- రూ.6 వేలు వేతనమిస్తామన్న సీఎం హామీకి అధికారుల కొర్రీలు
- ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆశ వర్కర్లు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్వయంగా ‘ఆశ’ కార్యకర్తలకు ఇచ్చిన హామీ అమలుకు అధికారుల కొర్రీలు అడ్డంకిగా మారుతున్నాయి. ‘ఆశ’ కార్యకర్తలకు రూ.6 వేలు గౌరవ వేతనంగా అందజేస్తామని సీఎం ప్రకటించగా... అలాకాకుండా ఇప్పుడి స్తున్న దానికి రెట్టింపు సొమ్ము ఇవ్వాలంటూ అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇదే జరిగితే అత్యధికశాతం మందికి గరిష్టంగా రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ‘ఆశ’ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అతి తక్కువ మందికి మాత్రమే రూ.6 వేలు అందుతాయని చెబుతున్నారు. అందరికీ రూ.6 వేలు గౌరవ వేతనం అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా..
రాష్ట్రంలో 27,045 మంది ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు. పదేళ్ల కింద జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) మార్గదర్శకాల ప్రకారం వారిని నియమించారు. కుటుంబ నియంత్రణ, ఆసుపత్రిలో కాన్పు, ఇమ్యునైజేషన్ వంటి వాటిని ప్రోత్సహించడంతోపాటు పలు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల అమలు బాధ్యతలను వారు నిర్వర్తిస్తున్నారు. 104, 108, ఆరోగ్యశ్రీ పథకాలకు తోడ్పాటు, హెచ్‌ఐవీ రోగులకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. కుష్టు, టీబీ రోగులకు మందులు పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ప్రజలకు వచ్చే వ్యాధులను గుర్తించడం, అవసరమైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)కు తీసుకెళ్లడం, అక్కడ తగిన వైద్యం అందుబాటులో లేకుంటే పైఆసుపత్రికి రిఫర్ చేయడం వంటివి చేస్తున్నారు.
ఈ పనులన్నింటికీ ప్రభుత్వం నామమాత్రపు పారితోషికాలనే చెల్లిస్తోంది. పనిని బట్టి నెలకు ఒక్కో ఆశ వర్కర్‌కు రూ.400 నుంచి రూ.2 వేల వరకు మాత్రమే అందుతున్నాయి. రోజంతా పల్లెల్లో సేవలందిస్తున్నా ప్రభుత్వం తగిన పారితోషికం ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటోందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘ఆశ’ వర్కర్లకు ప్రయోజనం కలిగించేలా నెలకు రూ.6 వేల చొప్పున గౌరవ వేతనంగా అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ దీనికి అధికారులు కొర్రీలు పెడుతున్నట్లు తెలుస్తోంది.