ఏటీఎంలతో ఎన్ని తిప్పలో!
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏటీఎంలు ఇంకా సరిగా తెరుచుకోలేదు. రూ. 2వేల నోట్లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయకపోవడంతో ఏటీఎం మిషన్లు పనిచేయడం లేదు. దాంతో అక్కడున్న సిబ్బంది, గార్డులతో ప్రజలు వాగ్వాదాలకు దిగుతున్నారు. బ్యాంకులలో భారీ క్యూలు ఉంటున్నాయని, దానికి బదులు రెండు వేల రూపాయలే వచ్చినా ఏటీఎంలో తీసుకోవడం మెరుగని అక్కడకు వెళ్తే.. ఏటీఎంలు పనిచేయడం లేదని పలువురు వాపోయారు.
ఇప్పటికే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఏటీఎంల వద్ద భారీ ఎత్తున క్యూలు మొదలైపోయాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని చెబుతున్న బ్యాంకు యాజమన్యాలు.. దాన్ని అప్‌డేట్ చేసే ప్రయత్నాల్లో పడ్డాయి. మరికొన్ని బ్యాంకుల వాళ్లు ఎందుకైనా మంచిదని అసలు ఏటీఎం సెంటర్లను ఓపెన్ చేయలేదు. చాలావరకు ఏటీఎంల వద్ద ఔటాఫ్ సర్వీస్ అనే బోర్డులు బయటే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రం ఏటీఎంల నుంచి వంద రూపాయల నోట్లు వస్తున్నట్లు వినియోగదారులు చెప్పారు. ఎక్కువ శాతం ఏటీఎంలు మాత్రం అయితే తెరుచుకోకపోవడం, ఒకవేళ ఉన్నా చివరి వరకు వెళ్లిన తర్వాత ఏదో ఒక కారణం చూపించి డబ్బులు రాకపోవడం లాంటివి జరుగుతున్నాయి.