టీడీపీపై 13 బీసీ సంఘాల ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యావంతులు, మేధావులు, సంఘసంస్కర్తలకు ఇవ్వాల్సిన రాజ్యసభ సీట్లను పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కాంట్రాక్టర్లకు ఇచ్చి రాజకీయాలను టీడీపీ భ్రష్టుపట్టిస్తోందని 13 బీసీ సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. మంగళవారం ఆర్.కృష్ణయ్య(జాతీయ బీసీసంక్షేమ సంఘం), జాజుల శ్రీనివాస్‌గౌడ్ (బీసీ సంక్షేమ సంఘం), గుజ్జ కృష్ణ (బీసీ ప్రజాసమితి), జి.మల్లేష్‌యాదవ్(బీసీ ప్రంట్) రాంకోటి(బీసీ ఐక్యవేదిక), ర్యాగ రమేశ్ (బీసీ విద్యార్థి సంఘం), దుర్గాగౌడ్(బీసీ ఫెడరేషన్), సి.రాజేందర్(బీసీ హక్కుల పోరాటసమితి) ప్రొ.నటరాజ్ (బీసీ కులాల ఐక్యవేదిక), నీల వెంకటేశ్(బీసీ యువజన సంఘం), ఎ.పాండు(బీసీసేన), పి.శ్రీనివాస్ (బీసీ ఉద్యోగుల సంఘం), శారదగౌడ్ (బీసీ మహిళా సంఘం) ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో బీసీలకు టీడీపీ మొండిచేయి చూపిందని విమర్శించారు. బీసీల పార్టీ అని గొప్పలు చెప్పుకోవడం తప్ప, బీసీలకు సీట్లు కేటాయించకుండా అన్యాయం చేసిందని మండిపడ్డారు.