టీఆర్‌ఎస్. ఎంఐఎం పార్టీలు హైదరాబాద్ నగరానికి ప్రమాదకరమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. ఆ పార్టీలకు గ్రేటర్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం గోల్నాకలో నిర్వహించిన అంబర్‌పేట నియోజకవర్గం బీజేపీ, టీడీపీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు.
టీఆర్‌ఎస్ పార్టీ మాటల గారడీ, పేరడి కథలతో ప్రజలను మభ్యపెడుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర సర్కారు రెండు పడక గదుల పథకం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని రూ.3 వేల కోట్లు అడిగిందని... వాటిని కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తేనే లేకపోతే పడక మీదే ఉంటాయని ఎద్దేవా చేశారు. రాజకీయాన్ని వ్యాపారం చేస్తూ జెండాలు, కండువాలు మార్చే నాయకులకు గుణపాఠం చెప్పాలని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ వద్ద అధికారం ఉంటే బీజేపీ, టీడీపీ వద్ద నైతిక విలువలు ఉన్నాయని అన్నారు.
ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చెసేందుకు ప్రయత్నిస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే... టీఆర్‌ఎస్ ప్రభుత్వం దానిని కరీంనగర్‌కు తరలించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు.